YSRCP leaders joining TDP: టిడిపిలో( Telugu Desam Party) మళ్లీ చేరికలు పెరిగే అవకాశం ఉంది. గత కొంతకాలంగా ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎక్కువగా టిడిపిలో చేరికలు పెరిగాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ మంది గుడ్ బై చెప్పారు. పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్సీలు, రాజ్యసభ పదవులను వదులుకున్న వారు ఉన్నారు. అయితే ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వివాదాస్పద ముద్ర కలిగిన నేతలు మాత్రమే మిగిలిపోయారు. మిగతా నేతలు అంతా ఎన్నికలకు ముందు, ఫలితాలు వచ్చిన తర్వాత పార్టీని వీడారు. కొన్నాళ్లుగా టిడిపిలో చేరికలకు బ్రేక్ పడింది. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రిలీఫ్ అయ్యింది. అయితే మళ్లీ ఇప్పుడు టిడిపి గేట్లు తెరవడంతో చాలామంది నేతలు పార్టీలోకి వచ్చేందుకు సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.
మేకపాటి ఫ్యామిలీ..
నెల్లూరు( Nellore ) జిల్లా నుంచి మేకపాటి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీలో చేరుతుందని ఒక టాక్ అప్పటి నుంచో ఉంది. గతంలో మేకపాటి రాజమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ చుట్టూ కోటరి ఉందని.. దాని నుంచి బయటపడకపోతే నష్టం అని వ్యాఖ్యానించారు. జగన్మోహన్ రెడ్డిని కొంతమంది తప్పుదోవ పట్టిస్తున్నారు అంటూ ఆరోపించారు. అప్పటినుంచి మేకపాటి రాజమోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. అటు తర్వాత జగన్మోహన్ రెడ్డిని మేకపాటి కుటుంబ సభ్యులు కలిశారు. దీంతో అదంతా ఉత్త ప్రచారం అని సంకేతాలు ఇచ్చారు. అయితే గతం కంటే మేకపాటి కుటుంబం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంత క్రియాశీలకంగా లేదు. టిడిపిలో చేరడం ఖాయమని నెల్లూరు పొలిటికల్ వర్గాల్లో చర్చ అయితే మాత్రం జరుగుతోంది.
గోదావరి జిల్లా నుంచి..
మరోవైపు మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్( Pilli Subhash Chandra Bose ) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం సాగుతోంది. వచ్చే జూన్లో ఆయన రాజ్యసభ సభ్యుడిగా పదవీ విరమణ చేయనున్నారు. మరోసారి ఆయన రాజ్యసభ సభ్యుడు అయ్యే అవకాశం లేదు. ఇంకోవైపు రామచంద్రాపురంలో ఆయనకు సరైన గుర్తింపు లేదు. కుమారుడికి రాజకీయ భవిష్యత్తు ఇవ్వాలని భావిస్తున్నారు. కానీ నియోజకవర్గంలో మాత్రం అవకాశం ఇవ్వడం లేదు జగన్. ఈ తరుణంలో ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంపై ఆగ్రహంగా ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. రాజ్యసభ పదవీకాలం అయిపోతున్న తరుణంలో తన కుమారుడి కోసం ఆయన టిడిపిలో చేరుతారని ప్రచారం సాగుతోంది. మొన్న మద్యన వైసీపీ హయాంలో జరిగిన గృహ నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. దానిపై ఫిర్యాదు చేసేందుకు సీఎం చంద్రబాబును కలుస్తానని కూడా చెప్పారు. అయితే ఇప్పుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ తన కుమారుడి కోసం టిడిపిలో చేరడం ఖాయమని తెలుస్తోంది. గోదావరి జిల్లాలో దీనిపైనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ పరిస్థితులు చూస్తుంటే మాత్రం టిడిపిలో మళ్లీ చేరికలు పెరిగే ఛాన్స్ మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.