YSRCP new experiment: రాష్ట్రానికి చివరిగా ఉంటుంది ఇచ్చాపురం నియోజకవర్గం. ఉత్తరాది రాష్ట్రాలకు ముఖద్వారం కూడా. ఈశాన్య రాష్ట్రాలతో పాటు ఉత్తరాది రాష్ట్రాలుగా ఉన్న పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఒడిస్సా తో పాటు చత్తీస్గడ్ రాష్ట్రాలకు ముఖద్వారంగా నిలుస్తోంది ఇచ్చాపురం నియోజకవర్గం. అయితే ఆ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పట్టుకొమ్మ. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఒకేసారి ఓడిపోయింది. కాంగ్రెస్ తర్వాత వైసిపి మూడుసార్లు ప్రయత్నాలు చేసింది కానీ వర్క్ అవుట్ కావడం లేదు. అయితే ఇప్పుడు అక్కడి పార్టీ పగ్గాలు వేరే వ్యక్తికి అప్పగించింది. సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి అనే కొత్త వ్యక్తి చేతిలో పెట్టింది. అయితే దీనిని అంగీకరించడం లేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అనవసరంగా ఇచ్చాపురం నియోజకవర్గంలో విభేదాలకు హైకమాండ్ కారణమని ఆరోపిస్తున్నారు. తరచూ నియోజకవర్గ ఇన్చార్జిలను మార్చడం ద్వారా విభేదాలకు అవకాశం కల్పిస్తున్నారు అన్నది హై కమాండ్ పై ఉండే ఆరోపణ.
తెలుగుదేశం పార్టీకి బలం..
తెలుగుదేశం పార్టీకి సంస్థాగతంగా బలం ఉన్న నియోజకవర్గం ఇది. 1983 నుంచి 2024 వరకు జరిగిన ఎన్నికల్లో.. 2004 తప్పించి.. మిగతా అన్నిసార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. 2014, 2019, 2024 ఎన్నికల్లో ప్రయత్నాలు చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. మూడుసార్లు ఆ పార్టీకి షాక్ తప్పలేదు. 2019లో అయితే రాష్ట్రవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి ప్రభంజనం వీచింది. ఇక్కడ మాత్రం టిడిపి అభ్యర్థి డాక్టర్ బెందాలం అశోక్ గెలిచారు. అంతకుముందు ఎన్నికల్లోను ఆయనే గెలిచారు. 2024 ఎన్నికల్లో మూడోసారి గెలవడంతో ఆయనకు విప్ పదవి దక్కింది. అయితే రోజురోజుకు ఇక్కడ టిడిపి బలం పెంచుకుంటుంది. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఆ పార్టీని పూర్తిగా నష్టపరుస్తున్నాయి.
ఆమెను తప్పించి..
మొన్నటి ఎన్నికల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఉంటూ పోటీ చేశారు ఫిరియా విజయలక్ష్మి. ఆమె మాజీ ఎమ్మెల్యే పిరియా సాయిరాజ్ భార్య. అయినా సరే నెగ్గలేదు. అయితే ఇప్పుడు ఆమెను మార్చి నియోజకవర్గ బాధ్యతలను రెడ్డిక సామాజిక వర్గానికి చెందిన సాడిశ్యాం ప్రసాద్ రెడ్డికి అప్పగించారు. ఇక్కడ రెడ్డిక సామాజిక వర్గం బిసి. అయితే ఇప్పటికే సంస్థాగతమైన బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి ధీటైన అభ్యర్థి శ్యాంప్రసాద్ రెడ్డి కారు అన్నది ఎక్కువ మంది అభిప్రాయం. కానీ హై కమాండ్ మాత్రం ఆయననే నియమించింది. అయితే పిరియా విజయలక్ష్మిని తప్పించడంతో ఆమె అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఇచ్చాపురం నియోజకవర్గంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి మొదలైంది. ఇచ్చాపురంలో ప్రయోగాలే తప్ప సక్సెస్ కావు అని టాక్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.