YSRCP: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చిక్కుల్లో పడింది. ఆ పార్టీ నేతలపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. అరెస్టుల పర్వం నడుస్తోంది. ఇప్పటివరకు పాత కేసుల్లో నేతలు అరెస్ట్ అవుతూ వచ్చారు. కానీ ఇప్పుడు వ్యక్తిగత వ్యవహార శైలి కారణంగా అరెస్టుల పర్వం నడుస్తోంది. తన కుమారుడు బైక్ తో ఢీ కొట్టి ఒకరి మరణానికి కారణమైతే.. ఆ కేసును తారుమారు చేసే యత్నంలో అడ్డంగా బుక్కయ్యారు మాజీమంత్రి అప్పలరాజు. మరోవైపు భూ యజమాని బతికి ఉండగానే.. ఆయన చనిపోయినట్టు చూపి.. ఆయన వారసుల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి భూమిని కొట్టేశారు తమ్మినేని సీతారాం కుమారుడు. అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండగానే ఈ అడ్డగోలు వ్యవహారం నడవగా.. ఇప్పుడు తమ్మినేని ఫ్యామిలీ అడ్డంగా బుక్ అయింది. వరుసకేసుల్లో శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు చిక్కుకోవడం ఆ పార్టీకి చాలా డ్యామేజ్ చేస్తోంది. అయితే వీటిని కూడా ప్రభుత్వ కక్ష సాధింపు కేసులుగా ఆరోపిస్తున్నారు జగన్. ప్రజలు మాత్రం అలా భావించడం లేదు. ఇది అంతిమంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే విషయమే.
* దువ్వాడ కలకలం..
ఆది నుంచి శ్రీకాకుళం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే వివాదాలు, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు అన్న పరిస్థితి ఉంది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం తెరపైకి వచ్చింది. భార్య వాణిని కాదని.. పిల్లలను కాదని.. దివ్వెల మాధురి అనే మహిళతో కనిపించారు దువ్వాడ శ్రీనివాస్. ఆమెతో సన్నిహితంగా ఉండడం, వారి బంధం గురించి రోజురోజుకు ప్రచారం ఉధృతం కావడంతో కుటుంబ సభ్యుల నుంచి అభ్యంతరాలు, వీధి కొట్లాటల నేపథ్యంలో దువ్వాడపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో దువ్వాడ శ్రీనివాస్ వ్యవహార శైలి వల్ల పార్టీకి భారీగా డామేజ్ జరిగింది. అటువంటి నేతతో పార్టీకి తలవొంపులు అని సీనియర్లు ఫిర్యాదు చేయడంతో.. సస్పెన్షన్ వేటు వేశారు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికీ దువ్వాడ శ్రీనివాస్ వైఖరిలో మార్పు రాలేదు. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతగా చలామణి అవుతూ తరచూ వివాదాలకు కారణం అవుతున్నారు.
* అప్పలరాజు అనుచిత ప్రవర్తన..
మాజీమంత్రి అప్పలరాజు వ్యవహార శైలి కూడా పార్టీకి నష్టం చేకూర్చింది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి అనూహ్య పరిస్థితుల్లో వచ్చిన అప్పలరాజు స్వల్ప కాలంలోనే ఎమ్మెల్యే అయ్యారు. నాలుగు సంవత్సరాల పాటు మంత్రిగా వ్యవహరించారు. అయితే ఆయన కుమారుడు రాంగ్ డ్రైవింగ్ కారణంగా ఒక వ్యక్తి చనిపోయారు. అయితే తీవ్ర గాయాలు పాలై రోడ్డుపై పడి ఉన్న సదరు వ్యక్తిని అలానే వదిలేసి.. తన కుమారుడిని కాపాడుకునే ప్రయత్నంలో అతనికి బదులు మరో వ్యక్తిని ఈ కేసులో ఇరికించారు. తరువాత అసలు విషయం బయటకు వచ్చేసరికి అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు అప్పలరాజు అరెస్టు అయ్యారు కూడా. అయితే దానిని వైసీపీ శ్రేణులు తప్పు పడుతున్నాయి కానీ ప్రజల్లో పార్టీకి చాలా డ్యామేజ్ మాత్రం జరిగిపోయింది.
* తమ్మినేని అడ్డగోలు వ్యవహారం..
తమ్మినేని సీతారాం పరిస్థితి కూడా అలానే ఉంది. ఉమ్మడి రాష్ట్రంలోనే సుదీర్ఘకాలం మంత్రిగా పనిచేశారు. నవ్యాంధ్రప్రదేశ్లో రాజ్యాంగబద్ధ పదవి స్పీకర్ పదవి చేపట్టారు. అటువంటి వ్యక్తి బతికి ఉన్న ఓ భూ యజమానిని చనిపోయినట్టుగా చూపి.. ఆయన వారసుల పేరుతో నకిలీ ధృపత్రాల సృష్టించి.. తన కుమారుడు పేరుతో భూమి రాయించుకున్నారన్న విషయం వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. సభ్య సమాజం నుంచి పెద్ద ఎత్తున అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజల్లోకి ఈ అంశం బలంగా వెళ్ళింది. ఇప్పుడు అదే హైలెట్ అవుతోంది. స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ శ్రీకాకుళం జిల్లా వైసీపీ నేతలు ఇలా వ్యక్తిగత వివాదాలతో పార్టీని ఇబ్బందుల్లో పెడుతున్నారు అనేది పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తున్న మాట. అయినా సరే అడ్డగోలుగా వీటిని సమర్థిస్తోంది నాయకత్వం. దీనిపై పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

