Appalaraju Arrest: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం పై ఆరోపణలు చేస్తోంది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అప్పలరాజు అరెస్టుపై కక్ష సాధింపు అన్నముద్ర వేస్తోంది. రాజకీయ కక్షతోనే అప్పలరాజును అరెస్టు చేశారని చిత్రీకరిస్తుంది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో మానవీయ విలువలు, సామాజిక సునీతత్వం ఏ స్థాయిలో కనుమరుగవుతున్నాయో చెబుతోంది. అప్పలరాజు కుమారుడు అతివేగంగా బైక్ నడుపుతూ.. ఒక నిరుపేద వ్యక్తిని ఢీకొట్టడం, తీవ్ర గాయాల పాలైన బాధితుడిని ఆసుపత్రికి తరలించే ప్రయత్నం కూడా చేయకుండా వదిలేయడంతో.. ఆ పేద కుటుంబ పెద్ద ప్రాణాలు కోల్పోయాడు. ఘటనా స్థలంలో ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించాల్సింది పోయి.. పలుకుబడిని అడ్డం పెట్టుకుని కేసును పక్కదారి ప్రయత్నించి అడ్డంగా బుక్కయ్యారు అప్పలరాజు. అయితే దానిని రాజకీయ కక్ష సాధింపుగా వర్ణిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
* తప్పు ఒప్పుకొని ఉంటే ఇంత దాకా వచ్చేదా?
సాధారణంగా రోడ్డు ప్రమాదాలు అనేవి సహజం. అయితే ఈ ప్రమాదం జరిగిన వెంటనే నిజాయితీగా తప్పు ఒప్పుకొని ఉంటే స్టేషన్ బెయిల్ తోనే అంత సరిపోయేది. కానీ మాజీ మంత్రి అప్పలరాజు స్వయంగా రంగంలోకి దిగి.. తన కుమారుడి స్థానంలో వేరొక యువకుడిని నిందితుడిగా ఇరికించేందుకు కుట్రపన్నారు. సీసీటీవీ ఫుటేజ్, పక్కా ఆధారాలు బయటపడడంతో అసలు విషయం వెల్లడయ్యింది. చివరకు అప్పలరాజు అరెస్టు కాక తప్పలేదు. అన్యాయంగా ప్రాణాలు కోల్పోయిన పేద కుటుంబం ఓవైపు దిక్కు తోచని స్థితిలో ఉంది. ఆ కుటుంబాన్ని పరామర్శించి న్యాయం జరిగేలా చూసి ఉంటే ఇప్పటివరకు పరిస్థితి వచ్చేది కాదు.
* బాధిత కుటుంబ కన్నీళ్ళకు…
కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నం చేసిన అప్పలరాజు అరెస్టును వైయస్ జగన్మోహన్ రెడ్డి తో పాటు ఆ పార్టీ నేతలు కక్ష సాధింపుగా చిత్రీకరిస్తున్నారు. చట్టపరంగా తప్పు చేసిన వ్యక్తి కొద్ది రోజులు జైలు శిక్ష అనుభవించి బయటకు రావచ్చు. కానీ ఒక్క రాత్రిలో ఇంటి పెద్దలు కోల్పోయి.. అనాధగా మారిన ఆ నిరుపేద కుటుంబానికి జరిగిన తీరని లోటును ఎవరు భర్తీ చేస్తారు. వైసీపీ నేతలు కనీసం సానుభూతి వ్యక్తం చేయడం లేదు సరి కదా… దీనిలో రాజకీయ కోణాలు వెతుకుతున్నారు. అడ్డగోలుగా కేసును తారుమారు చేసేందుకు ప్రయత్నించిన నాయకుడికి రక్షణగా నిలబడుతున్నారు. బాధితుల కన్నీళ్లను పట్టించుకోకుండా.. తప్పు చేసిన నాయకులకు రాజకీయ రక్షణ కల్పిస్తూ.. ఒక రకమైన నీచ సంస్కృతిని పరిచయం చేయడం ఆందోళన కలిగిస్తోంది.

