Jagan: గత ఐదు సంవత్సరాలుగా జగన్ సంక్షేమ తారకమంత్రాన్ని వల్లె వేశారు. ప్రజలకు అన్ని ఇస్తున్నానని చెప్పుకొచ్చారు. కోట్లాదిమందికి నేరుగా డబ్బులు పంచుతున్నానని.. వారి బతుకుల్లో వెలుగులు నింపానని బలంగా నమ్మారు. అందుకే వై నాట్ 175 అన్న నినాదాన్ని తెరపైకి తెచ్చారు. అయితే ఆయన ఒకటి తలిస్తే.. దైవం ఒకటి తలచింది అంటూ పరిస్థితి మారింది. దారుణ ఓటమి ఎదురైంది. దీంతో జగన్ లో నిర్వేదం అలుముకుంది. ఓటమిని అంగీకరిస్తూ ఆయన సీఎం పదవికి రాజీనామా చేశారు.
అయితే ఎన్నడూ మీడియా ముందుకు రాని ఆయన.. ఓటమి ఎదురైన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. భావోద్వేగా ప్రకటనలు చేశారు. ఎన్నికల్లో ఇటువంటి ఫలితాలు వస్తాయని కలలో కూడా ఊహించలేదన్నారు. అక్క చెల్లెమ్మల ఓట్లు ఎటు పోయాయో అర్థం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పింఛన్లు అందుకున్న అవ్వ తాతల ఓట్లు ఏమయ్యాయో తెలియడం లేదన్నారు. దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. జగన్ ఈ ఎన్నికలపై చాలా ధీమాతో ఉండేవారు. మహిళలు, వృద్ధులు ఏకపక్షంగా ఓట్లు వేస్తారని అంచనా వేశారు. ఇప్పుడు ఓటమి ఎదురయ్యేసరికి వారిపై నెపం వేస్తూ జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
పథకాలు అందుకున్న వారు కృతజ్ఞత చూపలేదన్నట్టు జగన్ వ్యాఖ్యానించారు. ప్రజలకు మంచి చేసినా ఓటమి పాలయ్యామని వాపోయారు. 54 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం చేశామని గుర్తు చేశారు. రైతులను అన్ని విధాల ఆదుకున్నామని.. ఆటో డ్రైవర్లు, డ్వాక్రా మహిళలు, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు ఇలా అన్ని వర్గాలకు చెందిన కోట్లాదిమందికి సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమదేనని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోలో 99% హామీలను అమలు చేస్తే ప్రజలు గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు జగన్. గ్రామాల్లో ఎన్నడూ చూడని సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశామని.. అయినా సరే ప్రజలు పెద్దగా గుర్తించలేదని.. అయినా సరే ప్రజా తీర్పును శిరసా వహిస్తామని జగన్ నిర్వేదంతో కూడిన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని చేసినా మా ఓటు బ్యాంకు ను 40 శాతం నుంచి తగ్గించలేకపోయారని ధీమా వ్యక్తం చేశారు జగన్. మొత్తానికి అయితే ప్రజలకు ఎన్నో చేశాము కానీ.. ప్రజలు విశ్వాసం ఉంచలేదని జగన్ వ్యాఖ్యానించడం విశేషం.