YS Jagan And KTR: అధికారంలో లేకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ గురించి రోజు చర్చ జరుగుతూనే ఉంటుంది. మీడియా వీరిద్దరి గురించి వార్తలు రాస్తూనే ఉంటుంది.. వైసీపీకి అధినేతగా జగన్ కొనసాగుతుండగా.. గులాబీ పార్టీకి కార్య నిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు. వీరిద్దరు కూడా తమ పార్టీలకు కీలక వ్యక్తులుగా కొనసాగుతున్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ షాడో ముఖ్యమంత్రిగా.. జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా కొనసాగారు.
అధికారం కోల్పోయిన తర్వాత కూడా తెలంగాణలో కేటీఆర్, ఆంధ్రప్రదేశ్లో జగన్ తమ రాజకీయ ప్రాబల్యాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. 2023లో అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ ఓడిపోయింది.. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లోను అధికార పార్టీ ఓటమిపాలైంది. అయినప్పటికీ పార్టీ కేడర్ చెక్కుచెదరకుండా ఉండడానికి కేటీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పలు జిల్లా కేంద్రాలలో పర్యటిస్తున్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడు ప్రచార బాధ్యతలు మొత్తం తనే స్వీకరిస్తున్నారు. ఇక జగన్ కూడా తన వంతు బాధ్యతగా ఏపీలో పర్యటిస్తున్నారు.. రైతుల సమస్యల నుంచి మొదలు పెడితే.. పార్టీ నాయకుల పరామర్శ వరకు జగన్ అన్ని కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.. కేటీఆర్ హైదరాబాదులోని నంది నగర్ లో నివాసం ఉంటుండగా.. జగన్ బెంగళూరులోని యలహంక ప్యాలెస్ లో నివాసం కొనసాగిస్తున్నారు. ఏపీలో ఏవైనా కార్యక్రమాలు ఉంటే బెంగళూరు నుంచి రాకపోకలు సాగిస్తున్నారు జగన్.
రాజకీయంగా జగన్, కేటీఆర్ మధ్య సాన్నిహిత్యం ఉంది. తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు పరస్పరం రాకపోకలు సాగాయి. తెలంగాణలో గులాబీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రగతి భవన్లో నిర్వహించిన సమావేశానికి జగన్ సతి సమేతంగా హాజరయ్యారు. నాడు జగన్మోహన్ రెడ్డిని కెసిఆర్ సాదరంగా ఆహ్వానించారు. ఆ సమయంలో కేసీఆర్ పక్కన కేటీఆర్.. ఇతర గులాబీ నాయకులు ఉన్నారు. అయితే ప్రస్తుతం రకరకాల కేసులలో అటు జగన్, ఇటు కేటీఆర్ పేర్లు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ బెంగళూరులో కనిపించారు. శనివారం బెంగళూరు నగరంలో సాయంత్రం జరిగిన ఓ అవార్డుల కార్యక్రమానికి వీరిద్దరు హాజరయ్యారు. పక్కపక్కనే కూర్చుని మాట్లాడుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి ఉన్న ఫోటోలను, వీడియోలను వైసిపి, గులాబీ పార్టీల సోషల్ మీడియా గ్రూపులు తెగ ప్రచారం చేస్తున్నాయి. రాజకీయంగా వారిద్దరూ ఏం చర్చించుకున్నారో విషయాల పక్కన పెడితే.. ఇద్దరు కలిసి ఉన్న ఫోటోలు మాత్రం సంచలనం సృష్టిస్తున్నాయి.