YSR Birth Anniversary
YSR Birth Anniversary: అమరావతి : తన తండ్రి పేరిట పార్టీని ఏర్పాటు చేశారు జగన్. పార్టీ ఆవిర్భావం నుంచి రాజశేఖర్ రెడ్డి కి సంబంధించి వర్ధంతి, జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.కానీ నిన్న మాత్రం జయంతి వేడుకలను సాదాసీదాగా జరిపించి చేతులు దులుపుకున్నారు. కొన్నిచోట్ల అయితే సీనియర్లకు అసలు జయంతి వేడుకలు అన్న విషయమే తెలియదు. అసలు వేడుకలు జరిపించలేదు. ఒకరిద్దరు ద్వితీయ శ్రేణి నాయకులు హాజరై మమ అనిపించేశారు. విశాఖలో అయితే రీజనల్ కోఆర్డినేటర్ వై వి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు ఒక్కరంటే ఒక్క సీనియర్ కూడా హాజరు కాలేదు. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది.
జగన్ విశాఖకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. పాలనా రాజధానిగా ఎంపిక చేయడంతో అక్కడ రాజకీయంగా బలపడాలని భావించారు.అందుకే బాబాయ్ వై.వి సుబ్బారెడ్డికి విశాఖ బాధ్యతలు అప్పగించారు. కానీ ఈ ఎన్నికల్లో విశాఖలో సైతం పార్టీ దారుణంగా దెబ్బతింది. కేవలం ఏజెన్సీలో రెండు సీట్లతో సరిపెట్టుకుంది.దాదాపు ఉత్తరాంధ్రను వైట్ వాష్ చేసింది ఆ పార్టీ. ఓటమి నుంచి ఆ పార్టీ నేతలు తేరుకోలేదు. రాజశేఖర్ రెడ్డి జయంతి వేడుకలకు హాజరుకావాలని పార్టీ హై కమాండ్ ఆదేశించినా.. రకరకాల కారణాలు చూపుతూ చాలామంది డుమ్మా కొట్టారు. మరికొందరైతే ఫోన్లను స్విచ్ ఆఫ్ చేశారు.
ప్రస్తుతం విశాఖలో చాలామంది నేతలు వైసీపీకి దూరంగా ఉన్నారు. పార్టీ కార్యక్రమాలకు కూడా హాజరు కావడం లేదు. మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, విశాఖ డెయిరీ చైర్మన్ ఎడారి ఆనందకుమార్, విశాఖ ఎంపీ ఏంవీవీ సత్యనారాయణ వైసిపి తో సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు పార్టీ సమావేశాలకు హాజరు కావడం లేదు. మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రెస్ మీట్ పెట్టి మరి వైసిపి నాయకత్వంపై తిరుగుబాటు చేసినంత ప్రయత్నం చేశారు. విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన బొత్స ఝాన్సీ లక్ష్మీ జాడలేదు. అందుకే సభలు సమావేశాలతో పాటు ఇటువంటి జయంతి వేడుకలను ద్వితీయ శ్రేణి నాయకత్వంతో జరుపుతుండడం విశేషం. విశాఖ నగరంతో పాటు జిల్లాలో ఎంతమంది నాయకులు పార్టీలో ఉంటారో? ఉండరో? తెలియని పరిస్థితి నెలకొంది.