TDP: తెలుగుదేశం పార్టీ ఎన్డీఏలో చేరుతోందా ? ఎన్డీఏ వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతోందా? చంద్రబాబు ఢిల్లీ వెళ్లారా? ఢిల్లీ పెద్దలు వచ్చి చంద్రబాబును కలిశారా? ఇప్పుడు ఇదో ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఎల్లో మీడియా పొత్తులపై నడుపుతున్న కథనాలు నవ్వు పుట్టిస్తున్నాయి. అంతా బిజెపి అవసరమే అన్నట్టు.. టిడిపికి ఏ అవసరం లేనట్టు.. బిజెపి పెద్దల కోరిక మేరకే చంద్రబాబు పొత్తు పెట్టుకుంటున్నట్టు ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కథనాలు రాస్తుండడం విశేషం.
గత ఎన్నికలకు ముందు టిడిపి ఎన్డీఏ నుంచి బయటకు వచ్చింది. బిజెపిని విభేదించింది. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే టిడిపికి ఆ ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదురైంది. బిజెపికి అంతులేని మెజారిటీ దక్కింది. అప్పటినుంచి చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. చేసిన తప్పు తెలుసుకొని పార్టీకి చెందిన నలుగురు రాజ్యసభ సభ్యులను బిజెపికి అప్పగించారు. అయినా సరే బిజెపికి కోపం తగ్గలేదు. గత నాలుగు సంవత్సరాలుగా దూరం పెడుతూనే ఉంది. ఇప్పుడు ఎన్నికల ముంగిట జాతీయ రాజకీయాల దృష్ట్యా టిడిపినిదగ్గర చేర్చుకునే ప్రయత్నాలు చేసింది.అది కూడా చంద్రబాబు ఎన్నో రకాల ప్రయత్నాలు చేయడంతోనే కాస్త కనికరించింది.
అయితే ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏలో చేరింది కేవలం బిజెపి అవసరాల కోసమే అన్నట్టు ఎల్లో మీడియా వర్ణిస్తోంది. ముఖ్యంగా ఏబీఎన్ ఆంధ్రజ్యోతి అయితే ఈ విషయంలో చేస్తున్న ప్రచారం అతిగా అనిపిస్తోంది. జాతీయస్థాయిలో చంద్రబాబు అవసరం ఉన్నట్టు.. చంద్రబాబు లేనిదే కేంద్ర ప్రభుత్వం నడవనట్టు లేనిపోని ప్రచారానికి ఆజ్యం పోస్తోంది. పొత్తుల విషయంలో లేనిపోని లెక్కలు చూపుతోంది. తొలుత నాలుగు అసెంబ్లీ,నాలుగు పార్లమెంట్ స్థానాలకు బిజెపి ఒప్పుకున్నట్లు ప్రచారం చేసింది. పొత్తుల్లో జాప్యానికి ఈ ప్రచారమే కారణమైంది.చంద్రబాబు తలకిందులై బిజెపిని ఒప్పించే ప్రయత్నం చేస్తే ఆంధ్రజ్యోతి మాత్రం అతిగా ప్రవర్తిస్తోంది.పొత్తు పై లేనిపోని అపోహలకు కారణమవుతోంది. లేనిపోని విశ్లేషణలతో కామెడీ తరహా ప్రచారం చేస్తోంది. ఇది నలుగురిలో నవ్వుల పాలవుతోంది. ఇక తేల్చుకోవాల్సింది ఆంధ్రజ్యోతి యాజమాన్యమే. ఒకవేళ బిజెపి పొత్తు కుదుర్చుకున్నా.. ఆంధ్రజ్యోతి ప్రచారం మామూలుగా ఉండదు. మరింత అతిశయోక్తిగా మారుతుంది అనడంలో సందేహమే లేదు.