YCP On Sharmila: పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వైసీపీని టార్గెట్ చేసుకున్నారు. ఆ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నారు. నేరుగా సీఎం జగన్ పైనే విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అవినీతితో పాటు దోపిడీపై నిలదీస్తున్నారు. దీంతో తెలుగుదేశం, జనసేనకు మించి షర్మిల నుంచి దాడి ఎదురవుతుండడంతో వైసిపి అప్రమత్తమవుతోంది. ఈ క్రమంలో షర్మిలకు ఎటువంటి అవకాశం ఇవ్వకూడదని వైసీపీ భావిస్తోంది. అందుకే ఆమె విషయంలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వైసీపీలో ఆవేశపూరిత నేతలను కట్టడి చేసి.. పెద్దరికం చూపే నాయకులను తెరపైకి తెస్తోంది. వారితోనే షర్మిలకు కౌంటర్ అటాక్ చేయిస్తోంది.
మరోవైపు ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు, పవన్ లకు మీడియా ప్రాధాన్యం లేకుండా చేసేందుకు.. మరో వ్యూహంలో భాగంగానే షర్మిల కామెంట్స్ ను తిప్పి కొడుతున్నారు. అది కూడా ఒక పద్ధతి ప్రకారం విమర్శలు చేస్తున్నారు. రాష్ట్ర విభజన చేసి కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిందని.. విభజన హామీలు పరిష్కరించలేదని.. అటువంటి పార్టీలో చేరిన షర్మిల తమను ప్రశ్నించేది ఏంటని వైసీపీ నేతలు నిలదీస్తున్నారు. విభజన హామీల అమలులో వైసిపి వెనుకబడిందని టిడిపి, జనసేనలు ప్రశ్నిస్తున్నాయి. ఎన్నికల ముంగిట ఆ రెండు పార్టీలకు ఇదో ప్రచారాస్త్రంగా మారుతుందని వైసీపీ భావిస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే షర్మిల వైసీపీ పై విమర్శలు చేయడాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి.. ఏపీకి ఈ పరిస్థితికి కారణమైన కాంగ్రెస్ పార్టీ పై వైసిపి విరుచుకుపడుతోంది. ఎక్కడా షర్మిలపై వ్యక్తిగత విమర్శలు చేయకుండా.. రాష్ట్ర విభజన, విభజన హామీల చుట్టూ వైసిపి ప్రశ్నల వర్షం కురిపిస్తుండడం ముమ్మాటికీ వ్యూహాత్మకమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు షర్మిల విషయంలో వైసీపీ నేతల స్పందన చూస్తుంటే హై కమాండ్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తోంది. షర్మిలకు కౌంటర్ అటాక్ ఇచ్చే బాధ్యతలను వైవి సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డి, ధర్మాన కృష్ణ దాస్ లాంటి నేతలు మాత్రమే తీసుకోవడం గుర్తించాల్సిన అంశం. వైసిపి పై కానీ, అధినేత జగన్ పై కానీ ఎవరైనా విమర్శలు చేస్తే వైసీపీలో దిగువ స్థాయి నుంచి పై స్థాయి వరకు నేతలు స్పందించడం ఆనవాయితీ. ఇక రోజా, గుడివాడ అమర్నాథ్, కొడాలి నాని, పేర్ని నాని, అంబటి రాంబాబు, అనిల్ కుమార్ యాదవ్ లాంటి నేతలు అయితే అధినేతపై ఈగ వాలనివ్వరు. కానీ షర్మిల విషయంలో వీరెవరు నోరు మెదపడం లేదు. ఈ విషయంలో వారికి స్పష్టమైన ఆదేశాలు ఉన్నట్లు సమాచారం. షర్మిల విషయంలో పార్టీలోని కొద్ది మంది నేతలకు మాత్రమే మాట్లాడే అవకాశం ఇచ్చామని.. ఎక్కడ నోరు తెరవద్దని తాడేపల్లి నుంచి ఆదేశాలు వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికైతే షర్మిల విషయంలో వైసీపీ ఒక వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. మున్ముందు ఈ పరిస్థితి ఉంటుందో? లేదో? చూడాలి.