Nadendla Manohar : జనసేనానికి అండగా నిలిచిన నేతల్లో నాదేండ్ల మనోహర్ ఒకరు. ఒక విధంగా చెప్పాలంటే జనసేనలో పవన్, మనోహర్ ధ్వయం బాగానే వర్కవుట్ అవుతోంది. తాను సినిమాలతో బిజీగా ఉన్న పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో మనోహర్ కష్టపడుతున్నారని పవన్ కూడా గుర్తించారు. ఓ సీనియర్ నాయకుడిగా, మంచి వాగ్ధాటి ఉన్న నేతగా ఆయన ఏ పార్టీలోకి వెళ్లినా సముచిత స్థానం లభించేదని.. కానీ జనసేనకు అండగా ఉంటున్న తీరుతో పవన్ కు అభిమానపాత్రుడిగా మారారు. రాజకీయ ప్రత్యర్థులతో పాటు జనసేనలో ఉంటూ ఇతర పార్టీలకు పనిచేసేవారికి మింగుడు పడడం లేదు. మనోహర్ పై విమర్శలు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తానని పవన్ హెచ్చరికలను బేఖాతరు చేస్తూ కొంతమంది అదే పనిగా ట్రోల్ చేస్తున్నారు.
మొన్న ఆ మధ్యన పార్టీ శ్రేణులకు పవన్ స్పష్టమైన హెచ్చరికలు కూడా పంపారు. అయితే అప్పటి వరకూ నాదేండ్ల చుట్టూ వివాదాలు ఉన్నాయని ప్రచారం జరిగింది. కానీ పవన్ ప్రస్తావించేసరికి ఆయన నోటీసుకు వెళ్లినట్టు అర్ధమైంది. జనసేనలో ఎప్పటి నుంచో ఓ వర్గం నాదేండ్ల మనోహర్ కు వ్యతిరేకంగా పనిచేస్తోంది. టార్గెట్ చేస్తోంది. కావాలనే ఆయనపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. కారణం ఏదైనా ఆయన పార్టీ వ్యవహారాలు చూస్తున్నారు. పార్టీలోని చోటా నేతలు తమ ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయనపై అలుగుతున్నారు. ఇతరులకు ప్రాధాన్యం ఇవ్వడం.. తమను పట్టించుకోకపోవడం వంటి కారణాలతో కొందరు నేతలు బాహటంగానే మాట్లాడేస్తున్నారు. మరికొందరు సమర్థిస్తూ వ్యాఖ్యానిస్తున్నారు. ఇవి విభేదాలకు అవకాశం కల్పిస్తున్నాయి.
జనసేన వెనుక బలమైన కాపు ముద్ర ఉంది. పవన్ కుల రాజకీయం చేయకపోయినా… సామాజిక పరిస్థితుల దృష్ట్యా కాపులు జనసేనకు అండగా నిలబడుతున్నారు. ఇది అధికార వైసీపీ నేతలకు మింగుడు పడడం లేదు. కాపుల ఓట్లను హోల్ సేల్ గా చంద్రబాబుకు పవన్ అమ్మేస్తున్నాడని ఆరోపించడం ప్రారంభించారు. అంతటితో ఆగకుండా కొందరు మంత్రులు అది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన అంటూ కొత్త భాష్యం చెబుతున్నారు. మనోహర్ పార్టీ నడుపుతున్నందున.. ఆయన కమ్మ అయినందున .. అది కమ్మజనసేనగా అభివర్ణిస్తున్నారు. వైసీపీ హితం కోరుతూ జనసేన పేరు చెప్పుకొని తిరుగుతున్న కొంతమంది నాయకులు ఇదే వాదనను పదును పెడుతున్నారు.
పవన్ కు ఆది నుంచి నాగబాబు అండగా నిలుస్తున్నారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో పార్టీని మరింత బలోపేతం చేయాలన్న ఉద్దేశ్యంతో పార్టీ ప్రధాన కార్యదర్శిగా నాగబాబును నియమించారు. దీంతో కొత్త ప్రచారానికి తెరలేపారు. నాదేండ్ల మనోహర్ ప్రాధాన్యతను తగ్గించేందుకే నాగబాబును నియమించారని ప్రచారం ఉధృతం చేశారు. కానీ అందులో ఏ మాత్రం నిజం లేదు. వచ్చే ఎన్నికల్లో బరిలో దిగడం లేదని నాగబాబు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషిచేస్తానని చెప్పుకొచ్చారు. అందుకే ఆయనకు పార్టీ పదవి ఇచ్చారు. నాదేండ్ల మనోహర్ పై విమర్శలు వద్దని పవన్ చెప్పినా కొంతమంది వినడం లేదు. అటువంటి వారిని ఐడెంటి ఫై చేస్తున్నారు. ఈ విషయంలో పవన్ కఠిన చర్యలకు ఉపక్రమించనున్నట్టు తెలుస్తోంది.