YCP Final List: జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతున్నారు. ఇప్పటివరకు నాలుగు జాబితాలను ప్రకటించారు. ఏకంగా 60 మంది సిట్టింగులను మార్చారు. అందులో కొందరికి స్థానచలనం కల్పించారు. మరికొందరిని పక్కన పడేశారు. అయితే ఈ మార్పు జాబితా ఇక్కడితో ఆగదని.. దాదాపు 80 మంది వరకు వెళుతుందని వైసీపీలో ప్రచారం జరుగుతోంది. అయితే మరో రెండు జాబితాలను ప్రకటించి 20 మందిని మార్చుతారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఆ జాబితాలను తయారు చేసే పనిలో వైసీపీ హై కమాండ్ ఉన్నట్లు తెలుస్తోంది.
వీలైనంత త్వరగా ఎమ్మెల్యేలతో పాటు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయాలని జగన్ భావిస్తున్నారు. తెలంగాణ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చకపోవడం వల్లే కెసిఆర్ కు ఓటమి ఎదురైందని.. అందుకే జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చుతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే 20 నుంచి 30 మందిని మాత్రమే మార్చుతారని అంచనా వేశారు. కానీ అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా 80 మంది అభ్యర్థులను మార్చడం సాహసం అనే చెప్పుకోవాలి. కొందరి విషయంలో అయితే జగన్ ఎటువంటి భేషజాలాలకు పోలేదు. సర్వేల్లో వ్యతిరేకత వచ్చే ఏ నాయకుడికి ఉపేక్షించలేదు. నిర్మొహమాటంగా ముఖం మీద చెప్పేశారు.
ఈ 75 రోజులు పాటు అభ్యర్థులు ప్రజల్లో ఉండేలా జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నెల 24 తేదీ లోపల దాదాపు అభ్యర్థుల ప్రకటన పూర్తి చేయాలని భావిస్తున్నారు. మరో రెండు జాబితాలను ప్రకటించనున్నారు. ఈ రెండు జాబితాల్లో తమ పేర్లు ఉండకూడదని వైసిపి సిట్టింగులు ఆశిస్తున్నారు. ఈ రెండు జాబితాల ప్రకటన తరువాత.. వాటిలో పేర్లు లేకుంటే.. ఇప్పుడున్న వారే అభ్యర్థులుగా ఖరారు అయ్యే అవకాశం ఉంది. దాదాపు 175 నియోజకవర్గాలకు గాను.. సగం నియోజకవర్గాల్లో అభ్యర్థులు మారినట్టే. ఇంతటి సాహసానికి దిగిన జగన్ ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.