YCP Boycotts Local Body Elections: ఏపీలో( Andhra Pradesh) స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వీలైనంత త్వరగా స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది. మూడు పార్టీల మధ్య కూటమి ప్రభుత్వం నడుస్తుండడంతో పదవుల పంపకాలు సైతం సజావుగా పూర్తి చేయాలని భావిస్తోంది. ముందుగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఈ పదవులు ఉంటాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు. స్థానికంగా పలుకుబడి, ప్రజల్లో పరపతి ఉండే నేతలు అవకాశం దక్కుతుంది. అటు తరువాత మండల ప్రాదేశిక, జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించాలని చూస్తోంది. ఇవి కొలిక్కి వచ్చాక చివరిగా మున్సిపల్ ఎన్నికలు పెట్టాలని భావిస్తోంది. ఓటరు జాబితా రూపొందించడంతో పాటు క్షేత్రస్థాయిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. అయితే ఈ ఎన్నికలను కూటమి ప్రభుత్వం సజావుగా తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తోంది. కూటమిలో ఐక్యత కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక రకమైన ఆందోళన ఉంది.
* ఎదుర్కోవడం కష్టమే..
స్థానిక సంస్థల( local bodies) ఎన్నికలు అంటే ఖర్చుతో కూడుకున్నవి. ఆపై అధికార పార్టీకి అనుకూలంగా ఉంటాయి. అందుకే ఇప్పుడు వైసీపీ పరిస్థితి వింతగా ఉంది. పోటీ చేస్తే ఓటమి భయం. తప్పుకుంటే క్యాడర్ దూరం అవుతుందని ఆందోళన. అందుకే ఈ విచిత్ర పరిస్థితి నుంచి బయటపడడానికి వైసిపి న్యాయపోరాటాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో స్థానిక ఎన్నికలను ఎదుర్కోవాలంటే వైసీపీకి సవాల్ తో కూడిన పరిస్థితి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత క్యాడర్ కుదురుకోలేదు. ఈ తరుణంలో ఎన్నికలకు వెళ్తే పరాభవం తప్పదని భయం పార్టీ నేతల్లో ఉంది. అందుకే గత టిడిపి మాదిరిగా ఎన్నికలను బహిష్కరించాలన్న డిమాండ్ కూడా పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. అయితే ఒకసారి ఎన్నికలను బహిష్కరిస్తే గ్రామస్థాయిలో క్యాడర్ పూర్తిగా నిస్తేజం అవుతుంది. అది పార్టీ ఉనికికే ప్రమాదం అన్న వారు ఉన్నారు.
* రెండే రెండు ఆప్షన్లు..
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ముందు రెండు ఆప్షన్లు ఉన్నాయి. ఒకటి ఎన్నికలను బహిష్కరించడం.. రెండు న్యాయ పోరాటానికి దిగడం. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ఖరారు లేదా ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయి అంటూ కోర్టులో పిటిషన్లు వేసి.. ఎన్నికల ప్రక్రియను నిలిపివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు కూడా ఆరోపణలు వస్తున్నాయి. వీలైనంతవరకూ స్థానిక సంస్థల ఎన్నికలను ఆలస్యం చేయడమే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. అనుకూల మీడియాలో సైతం దీనిపైన కథనాలు వస్తున్నాయి. అయితే కూటమి పార్టీలు మాత్రం స్థానిక సంస్థల ఎన్నికల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి. గత దశాబ్దానికి పైగా టిడిపి నేతలు స్థానిక సంస్థల పదవులకు దూరంగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్నికల సంఘం స్థానిక ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించడంతో.. గ్రామాల్లో పట్టు పెంచుకునేందుకు ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. చూడాలి చివరకు ఏం జరుగుతుందో..
