Yanamala Rama Krishnudu: టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అసంతృప్తితో ఉన్నారా? చంద్రబాబు తీరును విభేదిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదు యనమల.కానీ కుమార్తెకు తుని టిక్కెట్ ఇప్పించుకుని గెలిపించుకున్నారు. ప్రభుత్వ విప్ గా పదవి పొందారు దివ్య. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అదే పార్టీలో కొనసాగుతున్నారు యనమల రామకృష్ణుడు. బీసీ వర్గానికి చెందిన రామకృష్ణుడుకు ఎనలేని ప్రాధాన్యం దక్కింది టిడిపిలో. ఎన్టీఆర్ మంత్రివర్గంలో కూడా పనిచేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడంలో కీలక భూమిక పోషించారు. అందుకే చంద్రబాబు కూడా ఎనలేని ప్రాధాన్యం ఇస్తూ వచ్చారు. టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి యనమల రామకృష్ణుడికి మంత్రి పదవి ఇస్తూ వచ్చారు. 2014లో యనమల రామకృష్ణుడు ఎమ్మెల్సీగా ఉండగా.. మంత్రివర్గంలోకి తీసుకున్నారు చంద్రబాబు. 1983 నుంచి 2004 వరకు వరుసగా గెలుస్తూ వచ్చారు యనమల. 2009లో మాత్రం ఆయనకు ఓటమి ఎదురైంది. కానీ చంద్రబాబు మాత్రం 2013లో ఆయనకు ఎమ్మెల్సీగా చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా, స్పీకర్ గా, అధికారంలో లేనప్పుడు పిఎసి చైర్మన్ వంటి పదవుల్లో కొనసాగారు. అయితే ఈ ఎన్నికల్లో ఆయన తప్పుకున్నారు. కుమార్తె దివ్య ను టిడిపి అభ్యర్థిగా బరిలోదించారు.
* కీలక పదవి అని ప్రచారం
కూటమి అధికారంలోకి రావడంతో యనమల రామకృష్ణుడుకు కీలక పదవి గ్యారెంటీ అని అంతా భావించారు. తొలుత ఆయన పేరు గవర్నర్ పదవికి వినిపించింది. మరో సీనియర్ నేత అశోక్ గజపతిరాజుతోపాటు యనమలకు గవర్నర్ పదవులు ఇస్తారని టాక్ నడిచింది. అదే సమయంలో రాజ్యసభ ఆశావహుల పేర్లలో సైతం యనమల పేరు బలంగా వినిపించింది. అయితే వివిధ సమీకరణల్లో భాగంగా యనమల పేరును పక్కకు తప్పించినట్లు తెలుస్తోంది. దీంతో యనమల తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. పార్టీ కోసం ఎంతగానో కృషి చేశానని.. కానీ తనకు గుర్తింపు లభించడం లేదని ఆయన సన్నిహితులు వద్ద ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
* కాకినాడ సెజ్ భూములపై లేఖ
ఇంకోవైపు యనమల రామకృష్ణుడు నేరుగా సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం సంచలనంగా మారింది. కాకినాడ సెజ్ భూముల కేటాయింపు విషయంలో బీసీలకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ నేరుగా కొందరు ఇతర కులాల వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం గమనార్హం. బీసీలకు అన్యాయం జరుగుతోందంటూ చెబుతూ వస్తున్న యనమల రామకృష్ణుడు తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అటు టిడిపి సోషల్ మీడియాలో యనమల తీరుపై వ్యతిరేక ప్రచారం నడుస్తోంది. చంద్రబాబును బ్లాక్ మెయిల్ చేసేందుకే యనమల ఈ లేఖ రాసినట్లు టిడిపి శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఏకంగా చంద్రబాబు సామాజిక వర్గం నేతల పేర్లు ప్రస్తావిస్తూ మరి లేఖ రాయడం విశేషం. ఈ లేఖ వెనుక యనమల రాజకీయ స్వార్థం ఉన్నట్లు టిడిపి వర్గాలు అనుమానిస్తున్నాయి.
* మూడు పదవులపై గురి
యనమల రామకృష్ణుడు మూడు పదవులు పై గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఒకటి గవర్నర్ పోస్ట్. ఎన్డీఏ లో టిడిపి కీలక భాగస్వామిగా కొనసాగుతోంది. టిడిపికి కేంద్రం ఎనలేని ప్రాధాన్యమిస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీకి ఒక గవర్నర్ పోస్టును కేంద్రం ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే ఆ పదవికి అశోక్ గజపతిరాజు పేరు దాదాపు ఖాయమైనట్లు ప్రచారం సాగుతోంది. అదే పదవిని యనమల సైతం ఆశిస్తున్నారు. ఇంకోవైపు రాజ్యసభ పదవి పై సైతం ఆశలు పెట్టుకున్నారు యనమల. కానీ వివిధ సమీకరణల దృష్ట్యా యనమలకు చాన్స్ లేదని తెలుస్తోంది. మరోవైపు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి.. మంత్రివర్గంలోకి తీసుకోవాలని యనమల చంద్రబాబు పై ఒత్తిడి పెంచుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై చంద్రబాబు నుంచి ఎటువంటి సానుకూలత రాకపోవడంతో బ్లాక్ మెయిల్ కు దిగారని ఒక ప్రచారం అయితే ఉంది. మరి యనమల ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతం అవుతాయో చూడాలి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Yanamala rama krishnudu writing a letter directly to cm chandrababu has become a sensation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com