Jagan Vs Balakrishna: నందమూరి బాలకృష్ణ ( Nandamuri Balakrishna)గురించి చెప్పనవసరం లేదు. ఆయన తన మనసులో ఉన్న మాటనే చెబుతారు. ఏది ఉంచుకోరు కూడా. మొన్నటికి మొన్న జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీలోనే ఉతికి ఆరేశారు. వాడు సైకో గాడు అంటూ చాలా తేలిగ్గా తీసుకొని మాట్లాడారు. సినీ పరిశ్రమను అగౌరవపరిచారు అంటూ చెప్పే క్రమంలో చిరంజీవి ప్రస్తావన తీసుకురావడంతో.. జగన్మోహన్ రెడ్డి పై బాలకృష్ణ కామెంట్స్ పక్కకు వెళ్లిపోయాయి. అయితే బాలకృష్ణను మాత్రం జగన్మోహన్ రెడ్డి మరిచిపోలేకపోతున్నారు. తనను సైకో గాడు అంటూ చాలా తేలిగ్గా తీసుకోవడాన్ని తట్టుకోలేకపోతున్నారు. జగన్ ఇటీవల ప్రెస్ మీట్ లో అది స్పష్టంగా తెలుస్తోంది. బాలకృష్ణ అసెంబ్లీకి తాగి వచ్చాడు అంటూ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. తద్వారా బాలకృష్ణపై ఏ రేంజ్ లో ఆయనకు కోపం ఉందో అర్థం అవుతుంది.
* రకరకాల ప్రచారం..
వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) నందమూరి బాలకృష్ణకు పెద్ద అభిమాని అని అంతా చెబుతారు. రాజకీయాల్లోకి రాక మునుపు బాలకృష్ణ అభిమాన సంఘం ప్రతినిధిగా ఉండేవారని ఒక ప్రచారం ఉంది. పైగా బాలకృష్ణ విషయంలో రాజశేఖర్ రెడ్డి సాయం చేశారని.. జగన్మోహన్ రెడ్డికి సాఫ్ట్ కార్నర్ ఉందని వైసీపీ నేతలు తరచూ చెబుతుంటారు. కానీ మొన్నటి అసెంబ్లీ ఎపిసోడ్లో బాలకృష్ణ సినిమాల్లో విలన్లపై డైలాగ్ కొట్టినట్టే.. జగన్మోహన్ రెడ్డిని ఇచ్చి పడేశారు. ఎవడు ఆ సైకో గాడా అంటూ తేలిగ్గా మాట్లాడారు. సినీ పరిశ్రమ పెద్దలు నాటి సీఎం జగన్ ను తనను రమ్మన్నారని.. కానీ తాను వెళ్లలేదని.. ఆ సైకో గాడిని కలిసేందుకు తనకు ఇష్టం లేదని తేల్చి చెప్పినట్లు చెప్పారు బాలకృష్ణ. ఎవరో వెళితే జగన్ తగ్గారన్నది తప్పు అని.. అందులో ఎంత మాత్రం నిజం లేదని తేల్చి చెప్పారు. దీంతో మెగాస్టార్ చిరంజీవి పై బాలకృష్ణ ఏదేదో అన్నారని సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. చిరంజీవి స్పందించడంతో అదే హైలెట్ అయింది.
* టార్గెట్ కాపు సామాజిక వర్గం..
అయితే అదే రోజు శాసనసభకు బాలకృష్ణ మందు తాగి వచ్చారని తాజాగా ఆరోపించారు జగన్మోహన్ రెడ్డి. మద్యం తాగి వచ్చిన వ్యక్తికి శాసనసభలో అనుమతిస్తారా? అంటూ విలేకరుల సమావేశంలో ప్రశ్నించారు. దీంతో బాలకృష్ణ వ్యాఖ్యలతో జగన్మోహన్ రెడ్డి హర్ట్ అయినట్లు తెలుస్తోంది. వాస్తవానికి బాలకృష్ణ ఎపిసోడ్ లో చిరంజీవి ద్వారా పొలిటికల్ మైలేజీ పొందాలని వైసీపీ భావించింది. కానీ ఆ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇటీవల కందుకూరు నియోజకవర్గంలో జరిగిన హత్యను సైతం అలానే వినియోగించుకోవాలని చూశారు. కమ్మ, కాపు కులాల మధ్య.. నేతల మధ్య.. వ్యక్తుల మధ్య ఏ చిన్నపాటి పరిణామాలు జరిగిన తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అది జగన్ మాటల్లో సైతం అర్థమవుతోంది. కమ్మ సామాజిక వర్గం పై ఆశలు వదులుకున్న జగన్ ఇప్పుడు కాపుల విషయంలో మాత్రం జాగ్రత్త పడుతున్నారు. అందుకే మరోసారి బాలకృష్ణ ఎపిసోడ్ను గుర్తుచేసి చిరంజీవి అభిమానులను, కాపు సామాజిక వర్గం అభిమానాన్ని పొందాలని ప్రయత్నిస్తున్నారు. అయితే జగన్ చేసిన వ్యాఖ్యలపై బాలకృష్ణ ఎలా స్పందిస్తారో చూడాలి.