https://oktelugu.com/

Amaravati: ఏపీ సర్కార్ కు ప్రపంచ బ్యాంక్ షాక్.. అమరావతికి సాయం అనుమానమే

ఏపీ అంటేనే రాజకీయ ఎత్తుగడల రాష్ట్రం. ఈ విషయం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా అమరావతి రాజధానికి ప్రపంచ బ్యాంకు రుణం ఇచ్చేందుకు ముందుకు రాగా.. దానిని సైతం చెడగొట్టేందుకు తప్పుడు ఫిర్యాదులు వెళుతుండడం విశేషం.

Written By:
  • Dharma
  • , Updated On : December 22, 2024 / 11:59 AM IST

    Amaravati Capital(1)

    Follow us on

    Amaravati: కూటమి ప్రభుత్వం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణం పై దృష్టి పెట్టింది. వచ్చే నెల నుంచి పనులు ప్రారంభించాలని చూస్తోంది.అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించింది. బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయల సాయం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు తోపాటు ఏసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి ఈ మొత్తం సర్దుబాటు చేయనున్నట్లు చెప్పింది. అటు ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు అమరావతి రాజధాని నిర్మాణ పనులు పరిశీలించి.. నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మొత్తం ఆరు విడతల్లో రుణం మంజూరుకు ముందుకు వచ్చారు. తొలివిడతగా జనవరి నెలాఖరుకు సిఆర్డిఏ కు నిధులు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. ఈ తరుణంలో ఏపీ నుంచి ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వెళ్లినట్లు తెలుస్తోంది.అమరావతి విషయంలో కొన్ని అభ్యంతర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. అయితే ఫలానా వ్యక్తి అని కాకుండా..అపరిచిత వ్యక్తుల రూపంలో ప్రపంచ బ్యాంకుకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. దీంతో అమరావతి పనులు మొదలు పెట్టాలన్న ఏపీ సర్కార్కు షాక్ తగిలినట్లు అయింది.

    * అప్పట్లో అలా
    గతంలో టిడిపి ప్రభుత్వం ఉన్న సమయంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. అప్పట్లో ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు తో కలిసి 3,500 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. అయితే అప్పట్లో వైసీపీ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా చంద్రబాబు సర్కార్ భూ సమీకరణ చేపట్టినట్లు అప్పట్లో ఫిర్యాదు చేసింది. అప్పటికే కేంద్ర భూ సేకరణ చట్టం అమల్లో ఉన్నా.. దానిని పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు సర్కార్ భూ సమీకరణ చేసిందని అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా సరే చంద్రబాబు సర్కార్ ప్రపంచ బ్యాంకును ఒప్పించి నిధుల విడుదలకు అడ్డంకులు లేకుండా చేసింది. అయితే ఇంతలో ఏపీలో ప్రభుత్వం మారింది.వైసీపీ అధికారంలోకి వచ్చింది. అమరావతికి నిధులు ఇచ్చేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చినా.. జగన్ సర్కార్ మాత్రం అందుకు అంగీకరించలేదు. దీంతో నిధుల విషయంలో వెనక్కి తగ్గింది ప్రపంచ బ్యాంకు.

    * ఇప్పుడు తప్పుడు ఫిర్యాదులు
    ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిత్వంతో 15 వేల కోట్ల రూపాయల నిధులు సర్దుబాటుకు ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది. ఇప్పుడు కూడా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తో కలిసి ఆ మొత్తం ఇచ్చేందుకు అంగీకరించింది.పలుమార్లు అమరావతి ప్రాంతాన్ని సందర్శించిన ప్రపంచ బ్యాంకు బృందం..వచ్చే నెలలో మొదటి విడత నిధులు అందించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సరిగ్గా ఇదే సమయంలో అపరిచిత వ్యక్తుల నుంచి ప్రపంచ బ్యాంకుకు ఫిర్యాదులు వెళ్లాయి.

    * నిబంధనలకు విరుద్ధమట
    ఇప్పుడు కూడా అమరావతి రాజధానికి సంబంధించి భూ సమీకరణ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందన్నది ఈ ఫిర్యాదు సారాంశం. పైగా అమరావతికి కృష్ణానది వరద ముంపు ఉందని..అక్కడ రాజధాని నిర్మాణం అనేది ప్రమాదకరమని అపరిచిత వ్యక్తులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఇటువంటి ఫిర్యాదులు వచ్చినా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు తెలుసుకున్న ప్రపంచ బ్యాంకు నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.పైగా ఇప్పుడు చేసింది అపరిచిత వ్యక్తులు. ఇటువంటి ఫిర్యాదులను పరిగణలోకి తీసుకునే ఛాన్స్ లేదని కూటమి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికీ అమరావతి రాజధాని నిర్మాణానికి వైసీపీ అడ్డు తగులుతోందని కూటమి పార్టీలు విమర్శిస్తున్నాయి. మొత్తానికైతే అమరావతి పనులు ప్రారంభించాలనుకుంటున్న టిడిపి సర్కార్ కు ఇది గట్టి హెచ్చరిక. దీనిని గుణపాఠంగా మార్చుకొని.. ప్రపంచ బ్యాంకు నిధులను సక్రమంగా వినియోగించుకుంటే మంచిది. లేకుంటే టిడిపి కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరమే. మరి ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.