YCP MLAs walkout: రాజకీయాలు హుందాగా ఉండాలి. హుందాతనం రాజకీయాలు అలవాటు చేసుకోవాలి. బహుశా ఏపీలో అది లేదు. అయితే 2014 నుంచి గాడి తప్పింది. అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వాలు సుదీర్ఘకాలం పాలించాయి. ప్రాంతీయ పార్టీగా తెలుగుదేశం( Telugu Desam) అవతరించింది. శతాబ్దాల పార్టీని మట్టికరిపించింది. రాజకీయంగా అది సంచలనమే. అప్పటివరకు ఉన్న ఆధిపత్యానికి గండి కొడుతూ ఒక పార్టీ రావడం అంటేనే సహజంగానే ఒక రకమైన సంచలనాలకు వేదిక అవుతుంది. అయితే అదే తెలుగుదేశం పార్టీని వైయస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మట్టికరిపించింది. కానీ ఆ పరిస్థితుల్లో రాజశేఖర్ రెడ్డి తో పాటు చంద్రబాబు హుందాగా వ్యవహరించారు తప్ప.. తప్పుడు మాటలు ధ్వనించలేదు. ఒకరిపై ఒకరు కక్షలు తీర్చుకోలేదు. కానీ ఎందుకో జగన్ తన జైలు జీవితానికి చంద్రబాబు కారణమని భావించారు. అప్పటినుంచి రివేంజ్ రాజకీయాలు ఏపీలో మొదలయ్యాయి.
రాకరాక వస్తే..
మొన్నటి ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. అంతులేని విజయగర్వంతో బరిలో దిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారు. కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. కానీ ఏపీ సమాజంలో 40 శాతం మంది తమను సమ్మతించారని చెబుతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. అయితే ఓడిపోయిన సరే దాని నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా.. 2014 నుంచి 2019 మధ్య వ్యవహరించిన తీరుగానే ఆ పార్టీ పరిస్థితి ఉంది. తాము అధికారంలోకి వస్తే రప్పా రప్పా తప్పదని వైసీపీ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. కానీ ప్రజాస్వామ్యానికి శాసనసభ అనేది ఒక ఆలయం లా ఉంటుందన్న విషయాన్ని మరిచిపోతోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొద్దిసేపటి కిందట గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో మొదలయ్యాయి. జగన్ టీం 11 మంది సభకు వచ్చారు. గవర్నర్ ప్రసంగిస్తుండగానే.. 11 నిమిషాల పాటు మాత్రమే ఉండి బయటకు వెళ్లిపోయారు. దీంతో సోషల్ మీడియా వేదికగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీపై సెటైర్లు పడుతున్నాయి. 11 మంది సరిగ్గా 11 నిమిషాల పాటు మాత్రమే ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెలుస్తున్నాయి.
వైసీపీకి వెంటాడుతున్న 11..
గడిచిన ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీకి 11 అసెంబ్లీ స్థానాలు మాత్రమే వచ్చాయి. ఆ పార్టీకి కీలకమైన రాయలసీమ ప్రాంతంలో ఏడు అసెంబ్లీ స్థానాలు రాగా.. కోస్తాలో రెండు.. ఉత్తరాంధ్రలో రెండు సీట్లు మాత్రమే వచ్చాయి. 2019 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 151 సీట్లు వచ్చాయి. అయితే అందులో మధ్య సంఖ్యగా ఉన్న ఐదును తీసేస్తే మిగిలేది 11. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి దీనిపైనే సెటైర్లు పడుతున్నాయి. అయితే ఇప్పుడు కూడా ఆ 11 మందితో సభకు వచ్చి.. 11 నిమిషాల పాటు మాత్రమే ఉండడాన్ని గుర్తుచేస్తూ టిడిపి కూటమి శ్రేణులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాయి. అవి విపరీతంగా వైరల్ అవుతున్నాయి.