YCP MLAs: రాష్ట్రంలో కూటమి( allians) అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు సమీపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. ఆ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా రాలేదు. కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. సాంకేతికంగా ప్రతిపక్ష హోదా ఇవ్వడం కుదరదని భావించి స్పీకర్ హోదా కల్పించలేదు. అయితే సీఎం చంద్రబాబుతో సమానంగా తనకు మాట్లాడే అవకాశం కల్పించాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టారు. దానిని సాకుగా చూపి సభకు దూరంగా ఉన్నారు. అయితే పేరుకే ఎమ్మెల్యేలు కానీ.. వైసిపి సభ్యులు సభకు హాజరు కాకపోవడంతో ఆవేదనతో ఉన్నారు. పైగా సభకు హాజరు కాకుండానే వేతనాలు తీసుకుంటున్నారని కూటమి ప్రభుత్వం ప్రచారం చేస్తుండడంతో అవమానంగా భావిస్తున్నారు.
* అనర్హత వేటు భయంతో..
మరోవైపు వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కత్తి వేలాడుతోందని ప్రచారం నడుస్తోంది. మొన్న ఆ మధ్యన ఎథిక్స్ కమిటీ కూడా సమావేశం అయింది. సభకు రాకుండా వేతనాలు తీసుకుంటున్న వారిపై చర్యలకు ఆదేశించాలని స్పీకర్ను కోరే అవకాశం ఉంది. మరోవైపు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు దీనిపై సీరియస్ గా ఉన్నారు. సభకు రావాలని వైసీపీ సభ్యులకు పిలుపునిస్తున్నారు. సభకు హాజరు కాకుండా వేతనాలు ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల సమావేశం ఉత్తరప్రదేశ్లో జరిగింది. అక్కడ కూడా ప్రత్యేక ప్రస్తావన తీసుకొచ్చారు స్పీకర్ అయ్యన్నపాత్రుడు. జాతీయ స్థాయిలో సైతం తమ విషయంలో చర్చ జరగడంతో వైసీపీ ఎమ్మెల్యేలు పూర్తి మనస్థాపంతో ఉన్నారు.
* అధినేత వైఖరి నచ్చక..
గత రెండేళ్లుగా తనకు ప్రత్యేక హోదా ఇవ్వనిదే సభకు హాజరు కానని జగన్మోహన్ రెడ్డి తేల్చి చెబుతున్నారు. సభకు వెళ్లాలని సీనియర్లు సూచిస్తున్న ఆయన పెద్దగా వినడం లేదు. పైగా వైసీపీ నుంచి గెలిచిన వారిలో సగానికి పైగా కొత్త వారే. వారు సభకు వెళ్లాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ జగన్ మోహన్ రెడ్డి పట్టించుకోవడం లేదు. పైగా అధికార పార్టీ సభకు హాజరు కాకుండానే తాము వేతనాలు తీసుకుంటున్నామని ప్రజల్లో ప్రచారం చేస్తోంది. దీనిని అవమానంగా భావిస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. అధినేత చెపుతుంటే పట్టించుకోవడం లేదు. అందుకే కడప జిల్లాకు చెందిన ఓ మహిళ ఎమ్మెల్యే, ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఎమ్మెల్యే రాజీనామాకు నిర్ణయం తీసుకున్నారని ప్రచారం నడుస్తోంది. మరి ఈ ప్రచారంలో ఎంత వాస్తవం ఉందో చూడాలి.