CM Jagan: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. రెండోసారి అధికారంలోకి రావాలని జగన్ కసిగా ప్రయత్నిస్తున్నారు. అటు సంక్షేమ పథకాలతో పాటు గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను శత శాతం అమలు చేసినట్లు చెప్పుకొస్తున్నారు. తాను వస్తేనే సంక్షేమం కొనసాగుతుందని.. చంద్రబాబు అధికారంలోకి వస్తే పథకాలు ఉండవని తేల్చి చెబుతున్నారు. మరోవైపు టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించడంలో చంద్రబాబుతో పాటు పవన్ బిజీగా ఉన్నారు. ఆసక్తికరమైన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలోనే జగన్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేస్తున్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను సంతృప్తి పరచడంతో పాటు రైతులను తన వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. పింఛన్ లబ్ధిదారులను బలమైన ఓటు బ్యాంకుగా మార్చుకోవాలని వ్యూహాలు రూపొందిస్తున్నారు.
మరోసారి అధికారంలోకి వస్తే పింఛన్ మొత్తాన్ని నాలుగు వేల రూపాయలకు పెంచనున్నట్లు జగన్ ప్రకటించే అవకాశం ఉంది. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు పింఛన్ మొత్తాన్ని రూ.2 వేలకు పెంచారు. తాను అధికారంలోకి వస్తే 3000కు పెంచుతానని జగన్ హామీ ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదికి 250 రూపాయలు పెంచుకుంటూ పోయారు. ఈ లెక్కన ఈ నెల నాటికి మూడు వేలకు పింఛన్ మొత్తం పెరిగింది. దీంతో ఒక్కో లబ్ధిదారుడు 30 వేల రూపాయలు కోల్పోయాడంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏకకాలంలో పింఛన్ మొత్తం పెంచక పోవడాన్ని తప్పుపడుతున్నాయి. ఇప్పుడు నాలుగు వేలు జగన్ ప్రకటించినా మరోసారి ఇలానే చేస్తారని ప్రజల్లో ఒక అపోహ నెలకొనే అవకాశం ఉంది. అటు విపక్షాలు సైతం ఇదే ఆరోపణ చేసే ఛాన్స్ ఉంది.
ఉద్యోగ, ఉపాధ్యాయులకు బకాయిలు, రాయితీలు చెల్లించేందుకు జగన్ సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు వైసీపీకి బలమైన మద్దతు ఇచ్చాయి. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని జగన్ హామీ ఇవ్వడంతో నమ్మాయి. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత సిపిఎస్ రద్దు చేయలేదు. కొత్తగా ఎటువంటి ప్రయోజనాలు కల్పించలేదు. పైగా గతంలో ఉన్న రాయితీలను సైతం తొలగించారు. దీంతో ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మారిపోయాయి. అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలో 27% ఐఆర్ ప్రకటించారు. కానీ కొన్ని రాయితీలు అమలు చేయడం మరిచిపోయారు. ఆశించిన స్థాయిలో చెల్లింపులు లేవు. అటు జీతాలు సైతం సక్రమంగా అందించడం లేదు. రెండో వారం దాటితే కానీ ఖాతాల్లో జీతాలు పడడం లేదు. వైసిపి సర్కార్ దిగిపోవాలని ఆ రెండు వర్గాలు బలంగా భావిస్తున్నాయి. సరిగ్గా ఇటువంటి సమయంలోనే ఆ రెండు వర్గాలకు అనుకూలంగా ప్రకటన చేయాలని జగన్ భావిస్తున్నారు. కానీ వారు నమ్మే స్థితిలో మాత్రం లేరు.
రైతు రుణమాఫీ పై సైతం జగన్ సీరియస్ గా ఆలోచిస్తున్నట్లు సమాచారం. రైతులకు ఎంత మొత్తం రుణమాఫీ చేయాలి? అందుకు ఎంతవరకు సాధ్యం ఉంది? అనే దానిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రెండోసారి అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే గత ఎన్నికలకు ముందు ఏటా రైతుకు సాగు ప్రోత్సాహం కింద పదిహేను వేల రూపాయల నగదు సాయం చేస్తానని జగన్ హామీ ఇచ్చారు. కానీ కేంద్రం అందించే 6000 సాయానికి.. మరో 7500 జత కలిపి చేతులు దులుపుకున్నారు. పైగా సాగుకు సంబంధించిన పథకాలను నిలిపివేశారు. ఈ తరుణంలో రుణమాఫీ ప్రకటన సాధ్యమయ్యే పని కాదని.. గతంలో చంద్రబాబు ఎన్నికల ముంగిట పసుపు కుంకుమ కింద, అన్నదాత సుఖీభవ కింద నగదు జమ చేసినా ప్రజలు ఆహ్వానించలేదని విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు మరోసారి జగన్ అలాగే హామీ ఇస్తే ప్రజలు ఎంతవరకు నమ్ముతారు? అనేది ప్రశ్నార్ధకంగా మిగులుతోంది. కచ్చితంగా చంద్రబాబు మాదిరిగానే ఫలితం ఎదురు కానుందని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు. కానీ టిడిపి, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రాకమునుపే ఈ కీలక ప్రకటనలు చేసి ప్రజలను ఆకట్టుకోవాలని జగన్ భావిస్తున్నారు. మరి ఆయన ప్రయత్నం ఎంత వరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.