Vemuri Radhakrishna vs BR Naidu: రాజకీయ నాయకుల మధ్య మాత్రమే కాదు, మీడియా ఆధిపతుల మధ్య కూడా గొడవలు జరుగుతుంటాయి. కొన్ని సందర్భాలలో అవి తారస్థాయిని దాటిపోతుంటాయి. ఇప్పుడు తెలుగులో అటువంటి కలహమే చోటుచేసుకుంది. గతంలో రామోజీరావు, దాసరి నారాయణరావు (ఉదయం) మధ్య పోటాపోటీ గా యుద్ధం సాగేది.
ఉదయం వార్తాపత్రిక మూతపడిన తర్వాత వార్త పత్రికతో రామోజీరావుకు కయ్యం ఏర్పడింది. రామోజీరావు, వార్తాపత్రిక అధిపతి గిరీష్ సంఘీ మధ్య గొడవ ఒక స్థాయికి చేరుకుంది. ఆ తర్వాత సంఘీ కుటుంబంలో చోటుచేసుకున్న గొడవలు చివరికి వార్తాపత్రిక స్థాయిని పూర్తిగా తగ్గించేశాయి. ఈ క్రమంలోని ఈనాడు కూడా తన పరపతిని మరింత పెంచుకుంది. వార్తల దగ్గర నుంచి మొదలు పెడితే మార్కెటింగ్ వరకు ప్రతి విషయంలోనూ అద్భుతమైన స్ట్రాటజీని అమలు చేసింది. తద్వారా నెంబర్ వన్ స్థానంలోకి వచ్చేసింది…
ఇప్పుడు రామోజీరావు గతించారు. ఆయన మాదిరిగా మీడియా పెద్దగా ఉండడానికి రాధాకృష్ణ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇవి ఎంతవరకు విజయవంతం అవుతాయో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే రాధాకృష్ణకు, టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడుకు మధ్య గ్యాప్ ఏర్పడినట్టు తెలుస్తోంది. టీవీ5 చైర్మన్ బి.ఆర్ నాయుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా కొనసాగుతున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈనాడు, ఆంధ్రజ్యోతి ఎలాగైతే కృషి చేశాయో.. టీవీ5 కూడా అలానే కృషి చేసింది. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు బిఆర్ నాయుడుకు ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి కట్టబెట్టారు. మొదట్లో బిఆర్ నాయుడు నియామకాన్ని స్వాగతించిన ఆంధ్రజ్యోతి.. ఆ తర్వాత నాయుడు ఆధ్వర్యంలో తీసుకుంటున్న నిర్ణయాలను ప్రశ్నించడం మొదలుపెట్టింది. తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానంలో చేపడుతున్న పనులను ఆంధ్రజ్యోతి ప్రశ్నించింది.
అలిపిరిలో భక్తుల కోసం వసతి కల్పించేందుకు టౌన్షిప్ నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం తీర్మానించింది. అయితే ఈ నిర్ణయం మొత్తం బిఆర్ నాయుడు తీసుకున్నారని ఆంధ్రజ్యోతి ఆరోపించింది. అంతేకాదు తాటికాయ సైజులో అక్షరాలతో బ్యానర్ కథనాన్ని కుమ్మేసింది. వాస్తవానికి ఈ టౌన్షిప్ వల్ల ఏదో ద్రోహం జరిగిపోతుంది అన్నట్టుగా ఆంధ్రజ్యోతి ప్రచారం చేసింది.
ఆంధ్రజ్యోతి కథనం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం కూడా ఇచ్చింది. అది బోర్డు నిర్ణయం అని.. బి ఆర్ నాయుడు ఒక్కరే తీసుకోలేదని స్పష్టం చేసింది. అలిపిరి లో కాకుండా ఎక్కడో పేరూరు (ఆంధ్రజ్యోతి తన కథనంలో సూచించింది) లో టౌన్ షిప్ నిర్మిస్తే భక్తులు అక్కడ ఉండడానికి ఆసక్తిని ప్రదర్శించరని తిరుమల తిరుపతి దేవస్థానం తన ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి అలిపిరి ప్రాంతంలో ఉన్న శిల్ప శాలను తీసివేస్తారా? అలాగే కొనసాగిస్తారా? అనే విషయంపై తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి వివరణ తీసుకుని ఆంధ్రజ్యోతి తన కథనాన్ని ప్రచురిస్తే బాగుండేది. శిల్ప శాల ప్రాంతంలో టౌన్షిప్ నిర్మిస్తున్నారని ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొనడం వివాదానికి కారణమైంది.
సరిగ్గా 20 సంవత్సరాల క్రితమే కాటేజీ కోసం నిజంగా కృష్ణమూర్తి ఇచ్చిన స్థలాన్ని ఎంపిక చేశారు. అయితే అనేక సమస్యల వల్ల అది ఆగిపోయింది. అయితే బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని బిఆర్ నాయుడు మాత్రమే తీసుకున్నట్టు ఆంధ్రజ్యోతి తన కథనంలో పేర్కొనడం గమనార్హం. నాయుడు ఆధ్వర్యంలోనే న్యూజన్ ఆయిల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చారు. దీనిపై ఆంధ్ర జ్యోతి అప్పట్లో వ్యతిరేక కథనాన్ని ప్రచురించింది. ఆ తర్వాత న్యూజన్ ఆయిల్ ఒక హాఫ్ పేజీ ప్రకటన ఇవ్వడంతో ఆంధ్రజ్యోతి సైలెంట్ అయిపోయింది. తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్ అయిన తర్వాత బిఆర్ నాయుడు పాత గొడవలను పక్కనపెట్టి అందరి దగ్గరికి వెళ్లారు.. అందులో వేమూరి రాధాకృష్ణ కూడా ఒకరు. అయితే, మొదట్లో బిఆర్ నాయుడుకు సపోర్ట్ చేసిన ఆంధ్రజ్యోతి.. ఆ తర్వాత ఆయన మీద వ్యతిరేక కథనాలను ప్రచురిస్తోంది.. ప్రసారం కూడా చేస్తోంది. ఈ లెక్కన రాధాకృష్ణకు ఈగో దెబ్బ తిన్నదని జర్నలిస్టు సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది.