YSRCP leader quits: ఏపీ( Andhra Pradesh) రాజకీయాల్లో వింత పరిస్థితి కనిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత చాలామంది నేతలు ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. పైగా అధినేత జగన్మోహన్ రెడ్డి వైఖరిని తప్పుపడుతూ బయటకు వచ్చిన వారే అధికం. అయితే ఇలా బయటకు వచ్చిన వారు రాజకీయంగా కనిపించడం చాలా అరుదు. ఎవరైనా అవకాశాల కోసం పార్టీలు మారుతారు. కానీ వీరంతా అధినేతలో మార్పు కోసమే పార్టీ మారినట్లు కనిపిస్తున్నారు. కూటమి పార్టీలో చేరిన తర్వాత కనీసం బయటకు కనిపిస్తున్న వారు చాలా తక్కువ. అయితే ఇలా కూటమిలో చేరి వారంతా రిలాక్స్ అయినట్టు కనిపిస్తున్నారు. 2029 ఎన్నికల్లో చూసుకోవచ్చు కదా అన్న ధీమాతో కూడా ఉన్నవారు ఉన్నారు. అందుకే వచ్చామా? సైలెంట్ గా ఉన్నామా? అన్నట్టు ఉన్నారు.
బాలినేని సైతం..
వైయస్ కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న బాలినేని శ్రీనివాస్ రెడ్డి( Srinivas Reddy) సైతం జనసేనలో చేరిపోయారు. ఒకప్పుడు ఆయన ప్రకాశం జిల్లాలో తిరుగులేని నేత. కానీ ఇప్పుడు ఎక్కడో జనసేన వెనుక బెంచీలో కూర్చున్నారు. అయితే ఆయన రాకను ఎక్కువమంది వ్యతిరేకించారు. పవన్ మాటిచ్చారు కాబట్టి చేర్చుకున్నారు. జనసేనలోకి వచ్చాక బాలినేని కి సీన్ అర్థం అయింది. కూటమి ఐక్యతకు అందరం కలిసి కృషి చేద్దామని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన పట్టించుకునేవారు లేరు. అయితే బాలినేనికి పవన్ కళ్యాణ్ ఏ హామీ ఇచ్చారో తెలియదు. ఆయన రాజకీయ భవిష్యత్తుకు ఎటువంటి పదవులు ఇస్తారో తెలియదు. ప్రస్తుతం మాత్రం ఆయన గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.
చేరారే తప్ప..
ఒక్క బాలినేని కాదు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో వెలుగు వెలిగిన నేతలు చాలామంది కూటమి పార్టీల్లో చేరారు. ఆళ్ల నాని, సామినేని ఉదయభాను, కిలారు రోశయ్య… ఇలాంటి నేతలంతా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో చేరారు. కానీ తాము చేరిన పార్టీ కార్యక్రమాల్లో కనిపించరు. కనీసం వీరి వాయిస్ కూడా వినిపించదు. అయితే వీరి పరిస్థితి చూస్తుంటే మాత్రం ఎలాగైనా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనతోనే బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది. అంతకుమించి ఏమీ ఉండదు కూడా. రాజకీయం ఆశిస్తే పార్టీలో క్రియాశీలకంగా ఉండవచ్చు.. ఆఫర్లు ఉంటే ఈపాటికి పదవులు పొంది ఉండవచ్చు. ఈ రెండు జరగని క్రమంలో వారు అర్జెంటుగా పార్టీకి గుడ్ బై చెప్పాలన్న ఆలోచనతోనే బయటకు వచ్చినట్టు అర్థమవుతుంది.