కనకదుర్గమ్మ వెండి రథంపై ఉన్న మూడు సింహాల మాయం ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద దుమారం రేపుతోంది. ప్రభుత్వం చెబుతున్నట్లు అసలు అక్కడ ఆ సింహాలు ఉన్నాయా..? ఉంటే ఎవరు మాయం చేశారు..? ఆ అవసరం ఎవరికి ఉంది..? ఈ పాపం ఎవరిది..? ఎవరైనా కావాలనే చేస్తూ ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారా..? ప్రభుత్వం కూడా ఈ నేరాన్ని దాచేందుకు ఎందుకు ప్రయత్నిస్తోంది..? ఉగాదికి వెండి రథం మరమ్మతులు చేయాలని, పాలిష్ పెట్టాలని ఆదేశాలు జారీ చేసిన ఈవో.. గతేడాది ఏప్రిల్ నుంచి ఆయన అసలు రథాన్ని ఎదుకు పరిశీలించలేదు..? వెండి విగ్రహాలు మాయమయ్యాయని గుర్తించిన కూడా పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు..? అంతర్వేది ఘటనపై స్పందించిన ప్రభుత్వం.. ఈ వెండి సింహాల మాయం సంఘటనపై ఎందుకు స్పందించడం లేదు..? ఇప్పుడు ఏపీ రాజకీయంగా ఈ ప్రశ్నల చుట్టూనే తిరుగుతోంది.
Also Read: శ్రీవారి సేవలో ఇద్దరు సీఎంలు ఎవరు?
ఇటీవల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైన ఘటనకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు కూడా లేకుండానే ఆ దేవస్థానం ఈవోను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆపై సీబీఐ ఎంక్వైరీ కూడా కోరింది. కానీ.. బెజవాడలోని ఆలయంలో సింహాల మాయంపై ఈవోను ఎలాంటి సంజాయిషీ కోరలేదు. దుండగులు చోరీ చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నా.. అధికారుల నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నా.. పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అంటే.. ఈ చోరీ ఘటనను కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. దుర్గగుడి ఈవోపై ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై భక్తుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
చోరీ జరిగినా పోలీసుల ఫిర్యాదు చేయకుండా మూడు రోజుల తర్వాత దుర్గగుడి అధికారులు పోలీసులను సంప్రదించడంపైనా అనుమానాలు వస్తున్నాయి. ఈ చోరీలో ఈవోను కాపాడేందుకు సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ చోరీ ఘటనకు ఈవో సురేశ్‌బాబుకు ఎలాంటి సంబంధం లేదనే తరహాలోనే మంత్రి మాట్లాడుతుండడం గమనార్హం. అసలు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటివరకు అమ్మవారి వెండి రథాన్ని బయటకే తీయలేదని, ఆ రథంపై వెండి సింహం విగ్రహాలు గత ప్రభుత్వ హయాంలోనే పోయి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మంత్రి, ఈవో, దుర్గగుడి చైర్మన్ సోమినాయుడు కూడా ఇదే పాట అందుకున్నారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 25న వసంత్సోవాల్లో భాగంగా వెండి రథోత్సవం నిర్వహించేందుకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం వెండి రథానికి మరమ్మతులు, పాలిష్ చేయాలని ఆదేశిస్తూ మార్చి 11న ఈవో ఆదేశాలు జారీ చేశారు.
Also Read: బాబు మళ్లీ మూడు కళ్ల సిద్ధాంతం పాటించాల్సిందేనా..?
ఆ ఆదేశాల మేరకు మార్చి 13న రథానికి ఉన్న పట్టాను దుర్గగుడి అప్రయిజర్ షమి తొలగించారు. ఆ సమయంలో రథానికి నాలుగు సింహాలు ఉన్నట్లు షమి శుక్రవారం పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారు. షమి ఈవో వద్ద సెకండ్ సీసీగా పనిచేస్తున్నారు. ఈవోకి అత్యంత నమ్మకస్థుడు. ఈ నేపథ్యంలో రథానికి ఎన్ని గుర్రాలు ఉన్నాయో కూడా తనకు తెలియదని ఈవో బుకాయించడం ఎవరిని రక్షించడానికి అనే ప్రశ్న సాధారణ భక్తులకు సైతం వస్తోంది. వెండి సింహాలు మాయమైన కేసును గత టీడీపీ ప్రభుత్వంపై నెట్టేందుకు దుర్గగుడి అధికారులు పక్కా స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతోంది. మంత్రి అంతా తెలిసి కూడా ఏమీ తెలియనట్టు వెండి సింహాల మాయంలో కుట్ర ఉందని, గత ప్రభుత్వ హయాంలోనే జరిగి ఉండొచ్చని ప్రకటనలు చేశారు. ఈ నేరాన్ని టీడీపీ ప్రభుత్వంపైకి నెట్టేందుకే 2019 ఏప్రిల్ 6 నుంచి 2020 సెప్టెంబరు 15 నడుమ చోరీ జరిగి ఉండొచ్చని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది మార్చి 13న రథానికి పాలిష్ చేసేందుకు పట్టా తొలగించినప్పుడు నాలుగు సింహాలు ఉన్నాయని దుర్గగుడి అప్రయిజర్ షమి స్పష్టం చేస్తున్నా, ఫిర్యాదులో 2019 ఏప్రిల్ 6 నుంచి అని పేర్కొనడం కొసమెరుపు.