Kanna Lakshminarayana
Kanna Lakshminarayana : ఏపీలో సత్తెనపల్లి కీలక నియోజకవర్గం. ఎంతోమంది హేమాహేమీలు ఆ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. అటువంటి నియోజకవర్గంలో తాజాగా గెలిచారు కన్నా లక్ష్మీనారాయణ.మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు పై సంచలన విజయం సాధించారు. అయితే కన్నా లక్ష్మీనారాయణ నియోజకవర్గం లో పెద్దగా కనిపించడం లేదు. ఎన్నికల్లో గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని ఆయన భావించారు. కానీ వివిధ సమీకరణలో భాగంగా కన్నాకు చోటు దక్కలేదు. అప్పటినుంచి పెద్దగా నియోజకవర్గం పై దృష్టి పెట్టడం లేదన్న విమర్శ ఉంది. ఓ ద్వితీయ శ్రేణి నాయకుడు ఇక్కడ ఇన్చార్జిగా కొనసాగుతున్నారు. ఆయనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఈ తరుణంలో టిడిపి హై కమాండ్ కు సైతం పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళుతున్నట్లు సమాచారం. బిజెపి నుంచి తెలుగుదేశంలో చేరిన కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి సీటు ఇచ్చారు చంద్రబాబు. 2014 ఎన్నికల్లో కోడెల శివప్రసాదరావు ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. అసెంబ్లీ స్పీకర్ గా కూడా వ్యవహరించారు. 2019 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్నారు. అయితే ఈ సీటును ఆశించారు కోడెల కుమారుడు శివరాం. అయినా సరే చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు చాన్స్ ఇచ్చారు.
* సుదీర్ఘ నేపథ్యం
ఉమ్మడి ఏపీలోనే కన్నా లక్ష్మీనారాయణ సీనియర్ నాయకుడు. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం పనిచేశారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఒక వెలుగు వెలిగారు. 2014 ఎన్నికల వరకు ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా కూడా వ్యవహరించారు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీని వీడారు. భారతీయ జనతా పార్టీలో చేరి ఏపీ బాధ్యతలు స్వీకరించారు. అయితే 2019 ఎన్నికల్లో బిజెపి ఓటమికి బాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఎన్నికలకు ఆరు నెలల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. దీంతో కోడెల వారసుడుకు కాదని చంద్రబాబు కన్నా లక్ష్మీనారాయణకు సత్తెనపల్లి బాధ్యతలు అప్పగించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన కన్నా లక్ష్మీనారాయణ గత ఆరు నెలలుగా పెద్దగా కనిపించడం లేదన్న విమర్శలు ఉన్నాయి.
* అనూహ్యంగా టిడిపిలోకి
వాస్తవానికి వైయస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య,కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలలో మంత్రిగా వ్యవహరించారు కన్నా లక్ష్మీనారాయణ. 2014లో ఆయన వైసీపీలో చేరతారని అంతా ప్రచారం నడిచింది.అయితే చివరి నిమిషంలో బిజెపి అధ్యక్ష పదవి ఆఫర్ చేయడంతో అటువైపు వెళ్లారు. తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు వెళ్లడంతో బిజెపి ఒంటరి అయింది. దీంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంది. ఆ ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. గతంలో జగన్ కన్నా లక్ష్మీనారాయణ విభేదించడంతో.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలతో బీజేపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే గత ఐదేళ్లుగా బిజెపిలో కొనసాగినా..చంద్రబాబు విషయంలో సానుకూలంగా ఉండేవారు.అందుకే ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు.గెలిస్తే మంత్రి పదవి దక్కుతుందని భావించారు. అయితే మంత్రి పదవి దక్కక పోయేసరికి సైలెంట్ అయ్యారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ అవుతోంది.