Chandrababu: ఏపీలో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కి రావడం లేదు. బిజెపి నుంచి ఎటువంటి సంకేతాలు లేవు. చంద్రబాబు సైతం స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. పవన్ కళ్యాణ్ మాత్రం తప్పకుండా పొత్తులు ఉంటాయని చెబుతున్నారు. బిజెపి కలిసి వస్తుందని చెప్పుకొస్తున్నారు. అయితే ఈ ఇద్దరు నేతలు బిజెపి అగ్ర నేతలను కలిసి దాదాపు నెల రోజులకు పైగా అవుతోంది. అయినా సరే పొత్తుల విషయంలో ప్రతిష్ఠంభన కొనసాగుతోంది. ఒకవైపు బిజెపి 175 అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులను వడబోస్తుండగా.. టిడిపి, జనసేన తమ అభ్యర్థుల రెండో జాబితా ప్రకటనకు కసరత్తు చేస్తుండడం విశేషం.
పొత్తుల విషయంలో ఎల్లో మీడియా అత్యుత్సాహం చూపించింది. సీట్ల సర్దుబాటులో భాగంగా బిజెపికి నాలుగు అసెంబ్లీ, నాలుగు పార్లమెంట్ స్థానాలు కేటాయించనున్నట్లు ప్రత్యేక కథనాలు వండి వార్చింది. ఎన్డీఏ లోకి టిడిపి ఎంట్రీ అంటూ తేదీలను సైతం ప్రచురించింది. అయితే గడువుల మీద గడువులు దాటుతున్నాయే తప్ప చంద్రబాబు ఢిల్లీ వెళ్ళింది లేదు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ కు అపాయింట్మెంట్ ఇచ్చింది లేదు. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ అంటూ తాజాగా కొన్ని కథనాలను ప్రచురించింది. ఈనెల 7న చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని.. ఎన్డీఏ లోకి ఎంట్రీ ఇస్తారని.. ఏపీ విషయంలో పొత్తులు, సీట్ల సర్దుబాటు కొలిక్కి వస్తాయని చెప్పుకొస్తోంది.
అప్పుడెప్పుడో చంద్రబాబు ఢిల్లీ వెళ్లి అమిత్ షా తో భేటీ అయ్యారు. దీంతో పొత్తులు ఖాయమయ్యాయి అన్న ప్రచారం జరిగింది. కానీ నాడు అమిత్ షా ఒక ప్రతిపాదన పెడితే.. చంద్రబాబు మరో ప్రతిపాదన పెట్టారని.. దీంతో చర్చలు ఉన్నపలంగా నిలిచిపోయాయని.. పార్టీ నాయకులతో ఆలోచించి చెబుతానని చంద్రబాబు వచ్చేసారని.. బిజెపి ప్రతిపాదనలు ఇష్టం లేక చంద్రబాబు మౌనం వహించారని ప్రచారం జరుగుతోంది. అయితే ఇంతలో పవన్ కళ్యాణ్ పై ఒత్తిడి చేసి చంద్రబాబు సీట్లు ప్రకటించగలిగారు. తద్వారా బిజెపి పై ఒత్తిడి పెంచగలిగారు. అదే సమయంలో బిజెపి సైతం సొంతంగా మ్యానిఫెస్టో రూపకల్పనతో పాటు 175 అసెంబ్లీ, 25 ఎంపీ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను రూపొందించే పనిలో పడింది. అవసరమైతే తాము ఒంటరి పోరుకు సిద్ధంగా ఉన్నామని చంద్రబాబుకు సంకేతాలు పంపింది. ఇటువంటి తరుణంలో చంద్రబాబు ఢిల్లీ వెళ్తారని ఎల్లో మీడియా చెబుతుండడం విశేషం.
ఇప్పటివరకు రాష్ట్ర బృందం ఢిల్లీ వెళ్లడం గానీ.. బిజెపి జాతీయ బృందం రాష్ట్రానికి రావడం గానీ జరగలేదు. ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ వెళ్తే మాత్రం బిజెపి అడిగినన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది. అందుకు చంద్రబాబు సిద్ధంగా ఉన్నారా? అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది. అయితే ఎలాగైనా బిజెపితో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు వ్యూహం. అలాగని బిజెపి అడిగినన్ని సీట్లు ఇచ్చే ఉద్దేశం లేదు. అందుకే పొత్తుల విషయంలో జాప్యం జరుగుతోంది. చంద్రబాబు చొరవ చూపలేకపోతున్నారు. మరోవైపు బిజెపి అగ్ర నేతలను ఒప్పిస్తానన్న పవన్ కు అపాయింట్మెంట్ లభించడం లేదు. ఈ పరిణామాలన్నీ పొత్తుపై ప్రభావం చూపుతున్నాయి. ఆలస్యానికి కారణమవుతున్నాయి. అయితే టిడిపికి మానస పుత్రికలైన ఎల్లో మీడియా ఇప్పుడు చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై సరికొత్త ప్రచారానికి దిగాయి. మరి అందులో వాస్తవం ఎంత ఉందో చూడాలి.