Jagan: ఏపీలో( Andhra Pradesh) వైసీపీకి పరిస్థితి ఏంటి? ఆ పార్టీ నుంచి నేతలు ఎందుకు బయటకు వెళ్తున్నారు? వెళుతూ వెళుతూ రాజకీయాల నుంచి ఎందుకు నిష్క్రమిస్తున్నారు? ఎదుటి పార్టీలో అవకాశం లేక.. లేకుంటే ఆ పార్టీల్లో చేరే పరిస్థితులు పోగొట్టుకున్నారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ. వైసిపి అధికారం కోల్పోయిన వెంటనే ఆ పార్టీ అభ్యర్థిగా విజయవాడ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేసిన కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకున్నారు. అటు తరువాత సినీ నటుడు అలీ తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని తేల్చి చెప్పారు. అయితే వీరే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ద్వితీయ శ్రేణి నాయకత్వం తమకు ఇక రాజకీయాలతో సంబంధం లేదు అన్నట్టు వ్యవహరిస్తోంది. అంతలా పరిస్థితి దాపురించడానికి కారణం ఎవరంటే మాత్రం అందరి చూపు జగన్ వైపే ఉంది. ఎందుకంటే గత పది ఏళ్ల వైసిపి కాలగమనంలో చాలా తప్పిదాలు జరిగాయి. పార్టీ శ్రేణులకు ఒక రాంగ్ ఫీడ్ బ్యాక్ వెళ్ళింది. రాజకీయ దూకుడు తనం అధికం అయ్యింది. అదే ఇప్పుడు ఆ పార్టీకి చేటుగా మారింది.
* ఆ ఆరుగురితో పార్టీ ప్రకటన
కాంగ్రెస్ ( Congress)పార్టీ నుంచి విభేదించి బయటకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి. 2011 మార్చి 12న వైయస్సార్సీపిని ప్రకటించారు. పార్టీ ఆవిర్భావ సమయంలో విజయసాయిరెడ్డి, షర్మిల, విజయమ్మ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నారు. విశాఖ జిల్లాకు చెందిన సబ్బం హరి, కొణతాల రామకృష్ణ వంటి వారు జగన్ వెన్నంటే ఉన్నారు. వాస్తవానికి వైసీపీ ఆవిర్భావంలో ఉండే నేతలు ఎవరు ఎక్కువ రోజులు ఆ పార్టీలో ఉండలేకపోయారు. వాస్తవానికి జగన్ వెంట ఉండి కష్టాలు పడింది ఒకరు.. పదవులు అనుభవించింది మరొకరు. నాడు జగన్ వెంట నడిచిన చాలామంది నేతలు మధ్యలోనే డ్రాప్ అయ్యారు. కొందరు ఇతర పార్టీల్లోకి వెళ్లిపోయారు.
* చుట్టూ ఎంతో మంది నేతలు
సబ్బం హరితో( Shabnam Hari ) పాటు కొణతాల రామకృష్ణ పూర్తిగా జగన్కు దూరమయ్యారు. అప్పట్లో తెలంగాణ నుంచి కొండా సురేఖ, గోనె ప్రకాశరావు వంటి నేతలు ఉండేవారు. తరువాత కాలంలో విభేదించి బయటకు వెళ్లిపోయారు. జగన్ తల్లి విజయమ్మతో పాటు చెల్లెలు షర్మిల కూడా పార్టీకి గుడ్ బై చెప్పారు. విజయమ్మ కుమారుడితో అప్పుడప్పుడు కనిపిస్తున్న.. రాజకీయంగా విభేదించినట్టే. ఇప్పుడు విజయసాయిరెడ్డి సైతం పార్టీకి దూరమయ్యారు. అంటే దాదాపు వైసీపీ ఆవిర్భావ సమయంలో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న వారంతా ఇప్పుడు ఆ పార్టీకి దూరమైనట్టే.
* సొంత టీంను ఏర్పాటు చేసుకున్న జగన్
2019లో వైసీపీ( YSR Congress ) అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ ఆవిర్భావం నుంచి వచ్చిన నేతలకు కాదని.. తన సొంత టీంను ఏర్పాటు చేసుకున్నారు జగన్. సీనియర్లకు పక్కన పెట్టి తనను నమ్ముకున్న జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు. తన మాటకు తిరిగి చెప్పకుండా ఉండే నేతలకు ఎంపిక చేసుకుని పదవులు ఇచ్చారు. వారికి విపరీతమైన వాక్ స్వాతంత్రాన్ని ఇచ్చారు. అయితే అది ప్రత్యర్థులపై ప్రయోగించడంతో విఫలమయింది. అయితే జగన్ ఆదరించిన నేతలు ఎవరు ఇప్పుడు ఆయనకు మద్దతుగా లేరు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వారు ఎవరూ మాట్లాడడం లేదు. అయితే ఇంత జరుగుతున్నా జగన్లో ఒక సమీక్ష జరగట్లేదు. ఎందుకిలా జరుగుతోంది అని ఆలోచించుకోవడం లేదు. మున్ముందు ఇలానే సాగితే పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.