Pawan Kalyan: పవన్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. గతం మాదిరిగా ఆవేశంగా మాట్లాడడం లేదు. ఆచితూచి మాట్లాడుతున్నారు. జనసేన అధికారంలోకి వస్తే ఏం చేయగలం? ఏం చేస్తాం? అన్న వాటికే ప్రాధాన్యమిస్తున్నారు. సున్నిత విమర్శలకే పరిమితమవుతున్నారు. మరీ ముఖ్యంగా చెప్పాలంటే గతం మాదిరిగా ఊగుతూ, ఆవేశంతో మాట్లాడడం తగ్గించారు.అయితే పవన్ లో ఈ తరహా మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ శ్రేణులతో పాటు ప్రజలను ఆకర్షిస్తోంది. పవన్ పై ఉన్న అభిప్రాయాన్ని మారుస్తోంది. పవన్ తనకు తాను మార్పు దిశగా అడుగులు వేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ అంటే ఆవేశం, ఊగుతూ మాట్లాడుతారు అన్నది ప్రత్యర్థులు చేసే ఆరోపణ. కానీ ఆయన అభిమానించే వారు మాత్రం ఆవేశంగా మాట్లాడితేనే ఇష్టపడతారు. అయితే రాజకీయాల్లో ఆవేశాలకు చోటు లేదు. దూకుడు చాలా సందర్భాల్లో చేటు తెస్తుంది. అందుకే పవన్ ప్లాన్ మార్చారు. జనసేన ఎందుకు కూటమి కట్టాల్సి వచ్చింది? జనసేన అధికారంలోకి వస్తే ఏం చేయగలదు? భాగస్వామ్య ప్రభుత్వంలో జనసేన పాత్ర వంటి వాటి గురించి ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా తాను పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారాన్ని ప్రారంభించారు. మూడు రోజులపాటు పిఠాపురం నియోజకవర్గంలోనే ఉండనున్నారు. చేబ్రోలు లో జరిగిన తొలి సభలో పవన్ కీలక ప్రసంగం చేశారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురాన్ని దేశంలోనే రోల్ మోడల్ నియోజకవర్గంగా చేస్తానని మాత్రం బలంగా చెప్పుకొచ్చారు. స్థానిక సమస్యలను కూడా ప్రస్తావించారు.
ప్రస్తుతం ఏపీలో ఉన్న నాయకుల్లో అత్యంత చరిష్మ ఉన్న వ్యక్తి పవన్. సినీ నటుడు కావడంతో సహజంగానే చరిష్మ ఉంటుంది. కానీ పవన్ ప్రసంగ శైలి, సమస్యలు ప్రస్తావించే తీరు మాత్రం ప్రత్యేకం. ఆవేశంగా మాట్లాడే క్రమంలో కొన్నిసార్లు తప్పులు దొర్లుతాయి. వాటినే అధికారపక్షం టార్గెట్ చేసుకుంటుంది. అయితే పవన్ నుంచి వచ్చే మాట ప్రజల్లోకి బలంగా వెళ్తుంది అన్నది ఒక టాక్ ఉంది. అందుకే పవన్ సైతం ఎన్నికల ప్రచారంలో చాలా రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నారు. వైసిపి పై విమర్శలు చేస్తూనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అన్నది చెబుతున్నారు. అయితే గతానికి భిన్నంగా పవన్ ప్రసంగ శైలి మారడం, ఆవేశాలకు దూరంగా ఉండటం వంటి వాటిని చూసి జన సైనికులు మురిసిపోతున్నారు. తప్పకుండా ఏపీలో పవన్ ప్రభావశీలిగా మారుతారని చెబుతున్నారు. పిఠాపురం పర్యటన తర్వాత జనసేన పోటీ చేయబోయే నియోజకవర్గాల్లో పవన్ పర్యటించనున్నారు. దీంతో ఆ నియోజకవర్గాల్లో ప్రధాన సమస్యలపై స్టడీ చేస్తున్నారు. వాటిని ప్రస్తావించనున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే తాము చేయబోయే కార్యక్రమాలను వివరించుకున్నారు. మొత్తానికైతే పవన్ లో ఈ తరహా మార్పు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.