Pawan Kalyan
Pawan Kalyan: ఏపీలో అధికారాన్ని దక్కించుకునేందుకు కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. మూడు పార్టీలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ పాత్ర ఏమిటి అన్నది బలంగా చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు అయితే పవర్ షేరింగ్ పై పెద్ద ఎత్తున రచ్చ నడిచింది. కానీ వాటన్నింటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడింది. పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ సీట్లు దక్కాయి. అయితే ఈ సీట్లలో జనసేన గెలిచే స్థానాలు బట్టి.. కూటమి ప్రభుత్వంలో పవన్ ప్రాధాన్యత తెలుస్తుంది. అయితే చంద్రబాబు సీఎం షేరింగ్ పవన్ కళ్యాణ్ కు కల్పిస్తారా? లేకుంటే సీఎంతో సమానమైన పదవిని క్రియేట్ చేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.
పవన్ ను సీఎంగా చూడాలని కాపులు ఆశిస్తున్నారు. కానీ పవన్ ఈ విషయంలో చంద్రబాబుతో ఎటువంటి స్పష్టత తెచ్చుకోలేకపోయారు. పైగా గత ఎన్నికల్లో తనను గెలిపించి ఉంటే ప్రశ్నించి ఉండేవాడినని.. పవర్ షేరింగ్ విషయమై గట్టిగానే మాట్లాడి ఉండేవాడినని పవన్ చెప్పుకొచ్చారు. తన పార్టీకి సీట్ల కేటాయింపు విషయంలో హరి రామ జోగయ్య వంటి వారు ఇచ్చిన సలహాలను సైతం పవన్ పెద్దగా పరిగణలోకి తీసుకోలేదు. పైగా ముద్రగడ పద్మనాభం లాంటి కాపు ఉద్యమ నేత పార్టీలోకి వస్తానన్న పెద్దగా ఆసక్తి చూపలేదు. ఈ పరిణామాల క్రమంలో పవన్ పవర్ షేరింగ్ కు పట్టుబడరని ఒక ప్రచారం అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మాత్రం.. క్రియాశీల పాత్ర పోషించేందుకు సిద్ధమని పవన్ సంకేతాలు ఇస్తున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే పవన్ ఏ పదవి తీసుకుంటారు. మంత్రి పదవా? లేకుంటే డిప్యూటీ సీఎం హోదా? లేకుంటే అంతకుమించి పదవిని సృష్టిస్తారా? రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సమన్వయకర్తగా నియమిస్తారా? ఇలా రకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
కూటమి అధికారంలోకి వస్తే కచ్చితంగా ముఖ్యమంత్రి పదవిని చంద్రబాబే తీసుకుంటారని.. పూర్తి పదవీకాలం ఆయనే ఉంటారని.. ఇందులో మరో చర్చకు అవకాశం లేదని లోకేష్ ఆ మధ్యన కుండ బద్దలు కొట్టినట్లు చెప్పిన సంగతి తెలిసిందే. అటు తరువాతే హరి రామ జోగయ్య స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. కానీ ఆ స్థాయిలో పవన్ స్పందించలేదు. పట్టించుకోలేదు కూడా. అయితే పవన్ విషయంలో పవర్ షేరింగ్ ఉంటే ఈపాటికే మాట్లాడి ఉండేవారని.. కానీ పవన్ కేవలం జగన్ నుంచి అధికారాన్ని దూరం చేసేందుకే ఆరాటపడుతున్నారని ఈ పరిణామాలు తెలియజేస్తున్నాయి. ప్రస్తుతం జనసేనకి 21 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. బిజెపికి మరో 10 అసెంబ్లీ సీట్లు వెళ్లాయి. ఈ 31చోట్ల ఆ రెండు పార్టీల విజయం బట్టి.. కూటమిలో వాటి ప్రాధాన్యత ఉంటుంది. అయితే గెలుపోటములతో సంబంధం లేకుండా.. పవన్ కు చంద్రబాబు అత్యంత ప్రాధాన్యం ఇస్తారు. పవర్ షేరింగ్ విషయంలో స్పష్టత లేకపోయినా.. మంత్రిగా తీసుకుని.. పవన్ ఒక్కరికి డిప్యూటీ సీఎం హోదా కట్టబెడతారని కూడా తెలుస్తోంది.
2014 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బిజెపి 12 అసెంబ్లీ సీట్లలో పోటీ చేసింది. కేవలం నాలుగు చోట్ల మాత్రమే గెలిచింది. కానీ ఆ పార్టీకి రెండు మంత్రి పదవులు దక్కాయి. అదే సమయంలో టిడిపి ఎంపీల్లో కేంద్ర మంత్రులుగా ఇద్దరికీ అవకాశం ఇచ్చారు. అయితే ఇప్పుడు కూటమి అధికారంలోకి వస్తే జనసేనతో పాటు బిజెపికి మంత్రి పదవులు ఇవ్వాలి. జనసేన లో ఫస్ట్ ఛాయిస్ పవన్ కళ్యాణ్ ది కాగా.. రెండో ఆప్షన్ గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. బిజెపికి సంబంధించి సుజనా చౌదరి ఉన్నారు. విష్ణు కుమార్ రాజుతోపాటు సత్య కుమార్ పేరును పరిగణలోకి తీసుకోవాలి. కానీపవన్ విషయంలో చంద్రబాబుఅత్యంత ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. తాను సీఎం పదవి చేపట్టినా.. అందుకు సమానమైన పదవి పవన్ కి ఇస్తేనే జన సైనికులు సంతోషపడేది. లేకుంటే మాత్రం అధికారంలోకి వచ్చిన తరువాత కూడా చికాకులు తప్పవు.