Tirumala Laddu Controversy : టీటీడీ లడ్డు వివాదం ప్రకంపనలకు దారితీసింది. లడ్డు తయారీకి సంబంధించి నెయ్యిలో జంతు కొవ్వు కలిపారు అన్నది ప్రధాన ఆరోపణ.సీఎం చంద్రబాబు ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో ఈ సంచలన విషయాన్ని బయటపెట్టారు. అప్పటి నుంచి రచ్చ ప్రారంభం అయ్యింది.డిప్యూటీ సీఎం పవన్ సనాతన ధర్మ పరిరక్షణకు బలమైన వ్యవస్థ కావాలని ఆకాంక్షించారు.అదే సమయంలో పాప ప్రక్షాళనకు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టారు.ఈ ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది. అత్యున్నత అధికారుల బృందంతో విచారణకు ఆదేశించింది. విచారణ సైతం ప్రారంభించింది. అయితే ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ అని విపక్ష నేత జగన్ ఆరోపించారు. అటు వైసిపి హయాంలో టీటీడీ చైర్మన్లు గా వ్యవహరించిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి సైతం స్పందించారు. చంద్రబాబు రాజకీయ దురుద్దేశం పూర్వకంగా ఈ ఆరోపణలు చేశారని.. ఆయన ఏర్పాటు చేసిన సిట్ వారికి అనుకూలంగా వ్యవహరిస్తుందని.. అందుకే కేంద్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేపట్టాలని కోరుతూ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకున్న అత్యున్నత న్యాయస్థానం.. ప్రత్యేక సిట్ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చింది. అయితే ఇది జరిగి రోజులు గడుస్తున్నా ప్రత్యేక సిట్ ఇంతవరకు ఏర్పాటు కాలేదు.
* ఐదుగురు అధికారులతో
ఈ ప్రత్యేక సిట్ బృందంలో.. సిబిఐ నుంచి ఇద్దరు అధికారులు.. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు పోలీసు అధికారులు.. ఆహార కల్తీ నియంత్రణ శాఖ నుంచి ఒకరిని నియమిస్తూ.. ప్రత్యేక సిట్ ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. అయితే ఇంతవరకు అటువంటి నియామకాలు ఏవీ జరగలేదు. ప్రత్యేక సిట్ ఏర్పాటుకు సంబంధించి.. కోర్టు ఎటువంటి గడువు విధించకపోవడం ఇందుకు కారణంగా తెలుస్తోంది.
*ఎవరిని నియమిస్తారు?
అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ విచారణ ఆగింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇద్దరు పోలీస్ అధికారులు ప్రత్యేక సీట్ లో సేవలు అందించాల్సి ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ లో ఉన్న ఇద్దరిని నియమిస్తారా? లేకుంటే కొత్త వారిని నియమిస్తారా? లేకుంటే సిబిఐ పర్యవేక్షిస్తుంది కనుక.. వారు కోరిన వారిని నియమిస్తారా? అన్నది తెలియాల్సి ఉంది. అయితే కోర్టు ఆదేశాలు వచ్చి రోజులు గడుస్తున్న నేపథ్యంలో.. వీలైనంత త్వరగా ప్రత్యేక సిట్ నియమిస్తేనే.. విచారణ పట్టాలెక్కే అవకాశం ఉంది.