Chandrababu Jail: చంద్రబాబు అనారోగ్యంతో బాధపడుతున్నారు. స్కిల్ స్కాం కేసులో అరెస్టు అయిన చంద్రబాబు గత 33 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టుల్లో ఆయనకు ఊరట దక్కడం లేదు. దీంతో రోజుల తరబడి జైల్లో ఉండాల్సి వస్తోంది. దీంతో వివిధ రుగ్మతలతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజులుగా విపరీతమైన వేడితో డిహైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. మరోవైపు చర్మ సంబంధిత వ్యాధులకు గురైనట్లు సమాచారం.
స్కిల్ స్కామ్ లో గత నెల 10న సిఐడి అధికారులు చంద్రబాబును అరెస్టు చేశారు. నంద్యాలలో అదుపులో తీసుకొని రోడ్డు మార్గంలో విజయవాడ ఏసీబీ కోర్టుకు తరలించారు. కోర్టు రిమాండ్ విధించింది. జైలులో ప్రత్యేక వసతులు కల్పించాలని జైలు అధికారులను ఆదేశించింది. అప్పటి నుంచి ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లోని స్నేహ బ్లాక్ లో ఉన్నారు. అయితే జైల్లో భద్రత, వసతులపై కుటుంబ సభ్యులతో పాటు టిడిపి వర్గాలు ఆందోళన చెందుతూ వస్తున్నాయి. చంద్రబాబు ఉన్న బ్యారెక్ చుట్టూ చెట్లు ఉండడంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. ఒక రిమాండ్ ఖైదీ సైతం డెంగ్యూ బారిన పడి మృతి చెందడంతో.. చంద్రబాబు విషయంలో టిడిపి వర్గాలు ఆందోళన చెందుతూ వచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు సైతం అనారోగ్యానికి గురయ్యారన్న వార్తలు తెలుసుకొని తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
డిహైడ్రేషన్ తో పాటు అలెర్జీకి గురైన చంద్రబాబును జైలులో వైద్యాధికారులు వైద్య పరీక్షలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం చంద్రబాబు బరువు తగ్గారని తెలుస్తోంది. డిహైడ్రేషన్ ఇతర ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చునని వైద్యులు సూచించినట్లు సమాచారం. అటు జైలు అధికారులు సైతం చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రికి లేఖ రాసి చర్మ వైద్య నిపుణులను పంపించాలని కోరినట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. దీంతో జిజిహెచ్ నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్, మరో అసోసియేట్ ప్రొఫెసర్ ఒకరు గురువారం సాయంత్రం జైలుకు వెళ్లి చంద్రబాబును పరీక్షించారు. అనంతరం జైలు మంచి బయటకు వచ్చిన వారిని మీడియా పలకరించినా వారు స్పందించలేదు. దీంతో టిడిపి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. మరోవైపు చంద్రబాబు ఆరోగ్యంగా ఉన్నారని.. ఆయన అలెర్జీతో బాధపడుతున్నారని.. మందులు ఇచ్చామని.. ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని జైలు ఇన్చార్జ్ రాజ్ కుమార్ చెప్పడం విశేషం.