Vizag Investment Summit: ప్రస్తుతం డిజిటల్ రంగం రాజ్యమేలుతున్న రోజులు ఇవి. సమాచార వ్యవస్థ విస్తృతం అయింది కూడా. ఏది నిజం? ఏది అబద్దం? అనేది ఇట్టే నిర్ధారణ అవుతుంది కూడా. తప్పుడు ప్రచారాలపై నిజనిర్ధారణ చేసుకోవచ్చు. ఏది తప్పుడు ప్రచారమో? ఏది నిజమో? ఇట్టే తెలిసిపోతుంది కూడా. అయితే ఇవన్నీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే విశాఖలో పెట్టుబడుల పండుగ ప్రారంభం అయింది. గతంలో కూడా చాలాసార్లు పెట్టుబడుల సదస్సులు జరిగాయి. 2014 రాష్ట్ర విభజన తర్వాత విశాఖ వేదికగా టిడిపి ప్రభుత్వం మూడు పెట్టుబడుల సదస్సు పెట్టింది. 2023 వైయస్ జగన్మోహన్ రెడ్డి విశాఖ వేదికగా పెట్టుబడుల సదస్సును ఏర్పాటు చేశారు. అయితే వాటికి.. తాజాగా ఈరోజు నుంచి రెండు రోజులపాటు జరిగే సదస్సుకు తేడా ఉంది. ఎవరు అవునన్నా? కాదన్నా? ఏపీకి భారీగా పరిశ్రమలు వచ్చాయి. అంతకుమించి ఈ తాజా పెట్టుబడుల సదస్సులో పెద్ద ఎత్తున పరిశ్రమలు తరలి వస్తాయన్న నమ్మకం ప్రజల్లో ఏర్పడింది. దానికి ముమ్మాటికి కారణం సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.
* ప్రపంచాన్ని చుట్టేశారు..
రాష్ట్ర విద్యా శాఖ మంత్రిగా ఉన్నారు నారా లోకేష్( Nara Lokesh ). ఐటీ శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు. పరిశ్రమల శాఖ మంత్రిగా టీజీ భరత్ వ్యవహరిస్తున్నారు. కానీ నారా లోకేష్ గత ఏడాదిన్నర కాలంగా కలవని పారిశ్రామికవేత్త లేరు. ఐటీ దిగ్గజ సంస్థల అధినేతలు లేరు. వాటి ఫలితాలు ఈ పెట్టుబడుల సదస్సులో కనిపించనున్నాయి. మంత్రి నారా లోకేష్ ఒకవైపు ప్రభుత్వ పాలన, తన శాఖ పనితీరు, టిడిపి రాజకీయ వ్యవహారాలు చూస్తూనే.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ పారిశ్రామికవేత్తలతో భేటీకి అవకాశం ఉంటే.. అక్కడకు వెళ్లి ఏపీని ప్రమోట్ చేశారు. అమెరికాలో ఏకంగా గూగుల్ క్లౌడ్ హెడ్ తో సమావేశం కూడా అయ్యారు. ఆ సమావేశమే విశాఖ ఏఐ హబ్ గా మారేందుకు బీజం పడింది.
* తనను తాను మార్చుకున్నట్టే..
ఒకసారి మంత్రి నారా లోకేష్ ను చూస్తే ఆయన తనను తాను మార్చుకునే తీరు ఇట్టే ఆకట్టుకుంటుంది. ఇప్పుడు ఏపీ కోసం ఆయన అదే తరహా ప్రయత్నం చేస్తున్నారు. పెట్టుబడులతో పాటు పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో సీఎం చంద్రబాబు ( CM Chandrababu)కంటే మెరుగైన పనితీరు కనబరుస్తున్నారు. ఒకప్పుడు మైక్రోసాఫ్ట్ను హైదరాబాద్కు తీసుకురావడంలో చంద్రబాబు కృషి ఉంది. ఇప్పుడు లోకేష్ సైతం తనకంటూ అటువంటి ముద్ర కోసం ప్రయత్నాలు చేశారు. పారిశ్రామిక వర్గాలతో టచ్ లోకి వెళ్లిపోతున్నారు. అయితే ఆయన చేసిన ప్రయత్నాలు కొంతవరకు వర్కౌట్ అవుతూ వచ్చాయి. ఈరోజు పెట్టుబడులు, విశాఖకు వచ్చే దిగ్గజ పరిశ్రమలు, వారితో జరిపే చర్చల్లో లోకేష్ పనితీరు బయటపడనుంది. లోకేష్ తనను తాను మార్చుకున్న తీరు.. పాలనలో తాను వ్యవహరిస్తున్న తీరు మాత్రం ఆయన రాజకీయంగా బలపడేందుకు ఎంతగానో దోహదం చేయనుంది. ప్రతి మనిషి నిశితంగా ఆయనను గమనిస్తున్నారు. ఒకప్పుడు విమర్శించే వారు సైతం సానుకూలంగా చూస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం అంతర్గత చర్చల్లో లోకేష్ పని తీరును మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ఏముంది?
* బహుళ పాత్రలో..
మంత్రి నారా లోకేష్ ఇప్పుడు బహుళ పాత్ర పోషిస్తున్నారు. రాజకీయాల్లో తనకంటూ ఒక మార్కు చాటుకున్నారు. పాలనలోనూ తనదైన పాత్రను పోషిస్తున్నారు. ఏపీ భవిష్యత్తు కోసం చాలా రకాలుగా ఆలోచనలు చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన పాత్రతో ముందుకు సాగుతున్నారు. అసలు రాజకీయాలకి పనికిరాడు అని ముద్రవేశారు. చంద్రబాబుకు తగిన తనయుడు కాదని నిర్ధారించేశారు. కానీ ఆ చిక్కుముళ్లను, అవమానాలను తట్టుకుని నిలబడ్డారు నారా లోకేష్. ఒక్క మాటలో చెప్పాలంటే విశాఖ పెట్టుబడుల సదస్సు ఒంటి చేత్తో నడిపించే శక్తిగా మారారు లోకేష్. తప్పకుండా విశాఖ సదస్సు గేమ్ చేంజర్ గా నిలిచే అవకాశం ఉంది.