Visakha Operation Lungs: విశాఖ నగరం పై( Vishakha City ) ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది కూటమి ప్రభుత్వం. నగరాన్ని ఐటి హబ్ గా మార్చాలని భావిస్తోంది. ఇంకోవైపు విశాఖకు పర్యాటక ప్రాజెక్టులు సైతం వస్తున్నాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ తరుణంలో విశాఖను సుందర నగరంగా మార్చి.. ఆర్థిక రాజధాని చేయాలన్నది చంద్రబాబు సర్కార్ ప్రణాళిక. అయితే ఇందుకు కొన్ని రకాల సంస్కరణలు తీసుకురావాలి. అది జరగాలంటే రాజకీయ ప్రమేయం లేని నిర్ణయాలు తీసుకోవాలి. ముఖ్యంగా విశాఖ నగరంలో అక్రమ నిర్మాణాలు, ఫుట్ పాత్ నిర్మాణాలపై దృష్టి పెట్టింది ప్రభుత్వం. వాటి తొలగింపులో రాజకీయ జోక్యం అడ్డంకిగా నిలుస్తుందని భావించి ఒక వ్యూహం ప్రకారం ముందుకు సాగింది. ‘లైఫ్ టు అర్బన్ గ్రీన్ స్పేసెస్ 2.0’.. లంగ్స్ పేరిట గత కొద్దిరోజులుగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది గ్రేటర్ విశాఖ నగరపాలక సంస్థ. నగరంలో ఫుట్ పాత్ పై ఉన్న షాపులను తొలగించే ప్రయత్నం చేస్తోంది.
వైసిపి హయాంలో అనుమతి..
వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) హయాంలో విశాఖ సెంట్రల్ పార్క్ వెనుక భాగంలో నైట్ ఫుడ్ కోర్టు ఏర్పాటు చేశారు. అక్కడకు వెళ్తే ఏ సమయంలోనైనా ఆహార పదార్థాలు లభిస్తాయి. అంతలా ప్రాచుర్యం పొందింది. అయితే అక్కడ 32 స్టాళ్లకు అప్పట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ ప్రస్తుతం 240 పైగా ఉన్నాయి. వీటి నుంచి జీవీఎంసీ కి ఒక్క రూపాయి ఆదాయం రావడం లేదు. అయితే అనధికారికంగా స్టార్ల నుంచి కార్పొరేటర్లు నెలవారి మామూలు వసూలు చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో 2023లో కార్పొరేటర్లతో ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఫుడ్ కోర్ట్ అనధికారికంగా నడుస్తోందని ఆ కార్పొరేటర్ల కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిపై అర్హులకే స్టాళ్లను రెగ్యులరైజ్ చేసి జీవీఎంసీకి ఆదాయం వచ్చేలా చర్యలు తీసుకోవాలని కౌన్సిల్లో తీర్మానాన్ని ఆమోదించారు. కానీ ఆ తీర్మానం అమలుకు నోచుకోలేదు. ఆ స్టాల్స్ నిర్వాహకుల నుంచి నెలకు లక్షల్లో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అందుకే ఎటువంటి చర్యలు తీసుకోలేదు అన్న ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు లేని సమయంలో..
అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నైట్ స్టాల్స్ పై ( night stalls ) అనేక రకాల ఫిర్యాదులు రావడం, జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో.. జీవీఎంసీ సీరియస్ యాక్షన్ లోకి దిగింది. ఇటీవల జీవీఎంసీ కమిషనర్ గా వచ్చిన కేతన్ గార్గ్ దీనిపై ఒక అడుగు ముందుకు వేశారు. ఇటీవలే కార్పొరేటర్లు అధ్యయన యాత్ర కోసం ఇతర రాష్ట్రాల పర్యటనకు వెళ్లారు. మరోవైపు ఐదు రోజుల క్రితమే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. దీంతో ఇటు కార్పొరేటర్లు, అటు ఎమ్మెల్యేలు లేని సమయాన్ని చూసుకొని ఇది ఆదురుగా భావించారు. వెంటనే ఆపరేషన్ లంగ్స్ ను ప్రారంభించారు. నైట్ ఫుడ్ కోడ్ తో సహా నగరంలో అనధికార చిల్లర దుకాణాలను జీవీఎంసీ సిబ్బంది యుద్ద ప్రాతిపదికన తొలగిస్తున్నారు. ఒకటి కాదు రెండు కాదు విశాఖ నగరంలో దాదాపు మూడువేల అనధికారిక దుకాణాలను తొలగించారు. దాదాపు పదివేలకు పైగా దుకాణాలు ఇలా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
కూటమి మధ్య చిచ్చు..
హైదరాబాద్ హైడ్రా తరహాలో.. విశాఖలో లంగ్స్ ఆపరేషన్( lungs operation) కొనసాగుతుండడం విశేషం. మరోవైపు జీవీఎంసీ అనధికారిక దుకాణాలను తొలగిస్తుండడంతో చిరు వ్యాపారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. వామపక్షాలతో పాటు ప్రజాసంఘాల నేతలు వీరికి అండగా నిలుస్తున్నారు. ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా దుకాణాలను తొలగించి.. ఉన్నఫలంగా తమకు రోడ్డున పడేసారని బాధ్యత చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ లంగ్స్ విశాఖ కూటమిలో చిచ్చు రేపింది. అనధికార ఫుడ్ కోర్టు కు అనుకూలంగా అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. కూటమిలో కీలక భాగస్వామి పార్టీకి చెందిన సదరు నేతకు అనధికారిక స్టాల్స్ నుంచి అధిక మొత్తంలో ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తుండడంతో వివాదం ముదురుతోంది. మున్ముందు ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. మొత్తానికైతే హైదరాబాదులో హైడ్రా, విశాఖలో లంగ్స్ సరికొత్త ప్రకంపనలకు కారణం అవుతోంది.