Vijayawada Utsav 2025: విజయవాడ ఉత్సవ్( Vijayawada Utsav ) ను ఘనంగా నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. మైసూర్ ఉత్సవాలను తలదన్నేలా విజయవాడ ఉత్సవాలను నిర్వహించాలని భావించింది. దీంతో ఏర్పాట్లు కూడా ఘనంగా చేస్తున్నారు. విజయవాడలో దేవి శరన్నవరాత్రి వేడుకలు జరుగుతున్న దృష్ట్యా.. విజయవాడ ఉత్సవ్ ను సైతం అదే స్థాయిలో జరపాలని నిర్ణయించారు. అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి శివారు ప్రాంతంలోని వెంకటేశ్వర స్వామి ఆలయ భూముల్లో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలని భావించారు. ఇందుకుగాను తాత్కాలిక ప్రాతిపదికన 52 రోజులకు ఆ భూమిని లీజుకు ఇవ్వాలని నిర్వాహకులు దరఖాస్తు చేసుకున్నారు. అక్కడ నుంచి వివాదం ప్రారంభం అయ్యింది. అది తాత్కాలిక లీజు కాదని.. శాశ్వత లీజు అంటూ ప్రచారం జరుగుతోంది. అప్పటినుంచి వివాదం ముదురుతోంది.
* 40 ఎకరాలు తాత్కాలిక లీజుకు..
విజయవాడ ఉత్సవ్ కు సంబంధించి నిర్వాహకుల కోరిక మేరకు 40 ఎకరాలను కేటాయించింది దేవాదాయ శాఖ( endowment department). కేవలం తాత్కాలిక ప్రాతిపదిక పై లీజుకు కేటాయించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన నగదును సైతం నిర్వాహకులు చెల్లింపులు పూర్తి చేశారు. అయితే ఈ లీజును స్థానిక సంఘ్ పరివార్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. దేవుడు భూముల్లో ఎగ్జిబిషన్ నిర్వహణకు అడ్డు చెబుతున్నారు. లీజుకు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు లీజును రద్దు చేస్తూ తీర్పును ఇచ్చింది.
* బిజెపి మంత్రి ఆధ్వర్యంలో..
మరోవైపు విజయవాడ ఉత్సవ్ కు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. విజయవాడ ఉత్సవ్ సన్నాహక కమిటీ కోర్టు తీర్పు ఇచ్చిన నాడే ప్రత్యేకంగా సమావేశం అయింది. ఆ సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి మంత్రి సత్య కుమార్ యాదవ్( Minister Satya Kumar Yadav ) హాజరయ్యారు. అదే రోజు ఆయన పుట్టినరోజు కావడంతో సన్మానించారు కూడా. దీంతో ఉత్సవ్ నిర్వహణ వెనుక బిజెపి ఉంటే.. దానిని అడ్డుకోవడం వెనుక సంఘ్ పరివారం ఉండడంతో ఈ వివాదం కొత్త మలుపు తిరిగింది. హాట్ టాపిక్ అవుతోంది. ఆలయ భూముల్లో ఉత్సవాల నిర్వహణకు ఆర్ఎస్ఎస్ కు అభ్యంతరం ఉంటే బిజెపి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలి కానీ ఇలా రచ్చ చేయడం ఏమిటంటే ప్రశ్న వినిపిస్తోంది. కోర్టుకెళ్లడంతో ఇప్పుడు ప్రభుత్వం ఇరకాటంలో పడింది. కూటమిలో సమన్వయ లోపానికి ఇదో కారణంగా నిలుస్తోంది. అయితే విజయవాడ ఉత్సవ్ ను.. మైసూర్ ఉత్సవ్ తరహాలో నిర్వహించి చూపాలన్న ప్రయత్నంలో ఉంది ప్రభుత్వం. చూడాలి మరి ఏం జరుగుతుందో?