Vijayasai Reddy: మేధావులు రాజకీయ నాయకులు కారని అనేక సందర్భాల్లో తెలుగు రాష్ట్రాల్లో నిరూపితమైంది. మేధావి అనేవాడు తెరవెనక ఆలోచనలకు పరిమితమైతే సరిపోతుంది. కానీ తమ ఆలోచనలతో రాజకీయ నాయకులు భారీగా పేరు తెచ్చుకుంటున్నారనే ఉద్దేశంతో మేధావులు కూడా రాజకీయాల్లోకి రావడం మొదలైంది. కానీ ప్రజాసేవ వేరు.. మేధస్సు వేరు. రాజకీయం వేరు.. ప్రతిభ వేరు. ఇది అర్థమైంది కాబోలు.. అందువల్లే విజయసాయిరెడ్డి తత్వాన్ని ఒంట పట్టించుకున్నారు.
వైసీపీలో ఆయన నెంబర్ 2 పొజిషన్లో ఉండేవారు.. కానీ ఎప్పుడైతే సజ్జల రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గర అయ్యారో.. అప్పుడే విజయసాయిరెడ్డి క్రమంగా తన స్థానాన్ని కోల్పోతూ వచ్చారు. చివరికి పార్టీ నుంచి బయటికి వచ్చారు. ఆ తర్వాత వైసిపిలో తనకు ఎదురైన అనుభవాలను.. తాను ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్పుకుంటూ వచ్చారు. అంతేకాదు కొన్ని రకాల కుంభకోణాలను కూడా ఆయన బయటపెట్టారు.
విజయ సాయి రెడ్డి వైసీపీ నుంచి బయటికి వచ్చిన తర్వాత.. కొంతకాలం పాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని అన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని కూడా మొదలుపెట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు మళ్లీ రాజకీయాల్లోకి వస్తానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అంతేకాదు తను డిజిటల్ మీడియాను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు రాజకీయాల్లోకి కూడా వస్తానని వెల్లడించారు. దీంతో విజయసాయిరెడ్డి ఏ పార్టీ లోకి ప్రవేశిస్తారనేది ఆసక్తికరంగా మారింది. విజయ సాయి రెడ్డి ఇప్పుడున్న పరిస్థితుల ప్రకారం ఆయన వైసీపీలోకి వెళ్లలేడు. అలాగని టిడిపిలో కూడా చేరలేడు. ఉన్నది ఒకే ఒక ఆప్షన్. అది కూడా బిజెపి.
ఇప్పటికే పార్లమెంట్లో ఆయనకు బలమైన లాబీయింగ్ ఉంది. బిజెపి పెద్దలతో మంచి సంబంధాలు ఉన్నాయి. అలాంటప్పుడు ఆయన ఆ పార్టీలో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. డిజిటల్ మీడియా ఏర్పాటు చేసి ఆయన తన రాజకీయ ప్రయాణానికి అనుకూలంగా మార్చుకుంటారని సమాచారం. జూలైలో డిజిటల్ మీడియా ఏర్పాటు కాబోతోందని.. త్వరలోనే తాను రాజకీయాలలోకి కూడా వస్తానని విజయసాయిరెడ్డి ప్రకటించారు.. విజయ సాయి రెడ్డి చెప్పింది కరెక్ట్.. నేటి కాలంలో సొంత మీడియా అనేది లేకుండా ఏ రాజకీయ పార్టీ మనుగడ సాగించలేదు. అందువల్లే విజయ సాయి రెడ్డి సొంత డిజిటల్ మీడియాను ఏర్పాటు చేసుకుంటున్నారు.