Vangaveeti Radhakrishna : రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో తప్పటడుగులు వేస్తే దానికి మూల్యం తప్పదు. ఈ విషయంలో వంగవీటి మోహన్ రంగా వారసుడు రాధాకృష్ణ చక్కటి ఉదాహరణ. 2004లో రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఎమ్మెల్యేగా గెలిచారు. చిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగు పెట్టారు. కానీ ఆ తరువాత ఎన్నికల్లో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి పెద్ద తప్పు చేశారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తరువాత జగన్ వెంట అడుగులు వేశారు. కానీ 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికలకు ముందు తాను ఆశించిన టికెట్ దక్కకపోవడంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఆ పార్టీ తరఫున ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ టిడిపి ఓడిపోయింది. దీంతో గత ఐదేళ్లుగా అదే పార్టీలో కొనసాగారు వంగవీటి రాధాకృష్ణ. ఈ ఎన్నికల్లో సైతం ఆయన పోటీ చేయలేదు. కానీ టిడిపి తో పాటు కూటమి తరుపున ప్రచారం చేశారు. అందుకే ఇప్పుడు ఆయనకు నామినేటెడ్ పదవి దక్కుతుందని పెద్ద ఎత్తున ప్రచారం నడుస్తోంది. మొన్న ఆ మధ్యన నారా లోకేష్ వంగవీటి రాధాకృష్ణను పరామర్శించారు. తాజాగా చంద్రబాబుతో భేటీ అయ్యారు వంగవీటి రాధాకృష్ణ. దీంతో రాధాకృష్ణకు పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది.
* నాగబాబు మంత్రివర్గంలోకి..
ప్రస్తుతం ఏపీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తయింది. వైసీపీకి చెందిన మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్యలు రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. తెలుగుదేశం పార్టీకి రెండు, జనసేనకు ఒక పదవి అని ప్రచారం నడిచింది. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు బలంగా వినిపించింది. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రాజ్యసభ పోటీ నుంచి జనసేన తప్పుకుంది. టిడిపి నుంచి బీదా మస్తాన్ రావు, సానా సతీష్, బిజెపి నుంచి ఆర్ కృష్ణయ్యలను ఖరారు చేశారు. ఈ మేరకు ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. పోటీ లేకపోవడంతో వారి ఎన్నిక లాంఛనమే. అదే సమయంలో మెగా బ్రదర్ నాగబాబును రాష్ట్ర క్యాబినెట్ లోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
* ఎమ్మెల్సీగా రాధాకృష్ణ
ఇంకోవైపు రాష్ట్రంలో నలుగురు ఎమ్మెల్సీలు తమ పదవులకు రాజీనామా చేశారు. అయితే వారి రాజీనామాలు మండలి చైర్మన్ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిని క్లియరెన్స్ చేసేందుకు అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు సభ్యులు సిద్ధంగా ఉన్నారు. ఈ తరుణంలో ఎమ్మెల్సీ సీట్లు ఆశిస్తున్న వారు చాలామంది ఉన్నారు. మార్చిలో కూడా పెద్ద ఎత్తున వైసిపి ఎమ్మెల్సీల పదవీకాలం ముగుస్తుంది. దీంతో పదుల సంఖ్యలో ఆశావహులు ముందుకు వస్తున్నారు. ఈ తరుణంలోని వంగవీటి రాధాకృష్ణ చంద్రబాబును కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. వంగవీటి రాధాకృష్ణకు ఎమ్మెల్సీ పదవి ఖాయమని ప్రచారం నడుస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.