Vanga Geetha: ఏపీలో( Andhra Pradesh) కీలక నియోజకవర్గం గా ఉంది పిఠాపురం. గత ఎన్నికల్లో అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతో ఎనలేని ప్రాధాన్యత ఏర్పడింది పిఠాపురం నియోజకవర్గానికి. రాష్ట్రంలోనే కాదు జాతీయస్థాయిలో కూడా ఆ నియోజకవర్గం ప్రత్యేక గుర్తింపు సాధించింది. అయితే అక్కడ పవన్ కళ్యాణ్ ను ఓడించి రికార్డు బ్రేక్ చేయాలని చూసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. 2019 ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన రెండు చోట్ల ఓడించింది వైఎస్సార్ కాంగ్రెస్. మరోసారి అదే పరిస్థితిని తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేశారు. పవన్ కళ్యాణ్ పై మహిళా నేత వంగా గీతను ప్రయోగించారు. కానీ అక్కడ ఆమె ఓడిపోయారు. ఓడిపోయిన నాటి నుంచి ఆమె పెద్దగా కనిపించడం లేదు. అలాగని వేరే పార్టీలో చేరలేదు. వైసీపీలో క్రియాశీలకం కావడం లేదు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె జనసేనలో చేరుతారని ప్రచారం నడిచింది. దానికి కారణం లేకపోలేదు. ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ఫలితాలు తర్వాత.. వంగా గీత కచ్చితంగా జనసేనలోకి వస్తారని ఆయన ఆకాంక్షించారు. అయితే నియోజకవర్గానికి పెద్దగా అందుబాటులో లేరు. అందుకే ఆమె రాజకీయ ప్రయాణం ఎలా ఉండబోతుంది అనే చర్చ నడుస్తూ వచ్చింది.
* టిడిపి ద్వారా ఎంట్రీ..
తెలుగుదేశం( Telugu Desam) పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు వంగా గీత. 1995లో జడ్పిటిసి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా 2000 వరకు కొనసాగారు. అలా ఉండగానే రాజ్యసభ సభ్యురాలుగా ఎన్నికయ్యారు తెలుగుదేశం పార్టీ నుంచి. 2006 వరకు రాజ్యసభ సభ్యురాలుగా ఉన్న ఆమె.. 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని ఏర్పాటు చేయడంతో ఆ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో పిఆర్పి అభ్యర్థిగా పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో పోటీ చేశారు కానీ ఓటమి ఎదురైంది. 2019 ఎన్నికల్లో కాకినాడ పార్లమెంట్ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసి పిఠాపురంలో ఓడిపోయారు.
* పొలిటికల్ గా సైలెంట్..
గత 18 నెలలుగా పెద్దగా కనిపించడం లేదు వంగా గీత( Vanga Geetha ). అక్కడ వైసిపి వేరే నాయకత్వం కోసం అన్వేషిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అదే సమయంలో వంగా గీత సైతం తనకు సేఫ్ జోన్ ఎంచుకున్నట్లు ప్రచారం నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో గెలిచే నియోజకవర్గం నుంచి బరిలో దిగాలని భావిస్తున్నట్లు సమాచారం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఉండడంతో అక్కడ పోటీ చేయడం అంత శ్రేయస్కరం కాదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తన ఆశలకు, ఆశయాలకు అనుగుణంగా జనసేన అయితే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎన్నికల ప్రచారంలో ఆమెను చాలా మంచి మనిషిగా అభివర్ణించారు పవన్ కళ్యాణ్. ఆమె సైతం పవన్ కళ్యాణ్ ను తమ్ముడుగానే చూశారు. ఇప్పటికీ ఆమె చిరంజీవి కుటుంబంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ వచ్చారు. అందుకే ఆమె జనసేనలో చేరుతారని ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.
