Undavelli Arun Kumar: ఉండవల్లి అరుణ్ కుమార్ ( undavalli Arun Kumar ) మరోసారి మీడియా ముందుకు వచ్చారు. గత కొద్దిరోజులుగా ఆయన చుట్టూ రాజకీయం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అంతా ప్రచారం నడిచింది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లు చాలామంది వైయస్సార్ కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఈ తరుణంలో ఏ పార్టీలో లేని తటస్థ నాయకుడిగా ఉన్న ఉండవల్లి అరుణ్ కుమార్ సైతం అదే ఫాలో అవుతారని తెగ ప్రచారం నడిచింది. ఈ తరుణంలో ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చారు. దీంతో అంతటా చర్చ నడిచింది. కానీ ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రభుత్వంతోపాటు ప్రతిపక్షానికి కీలక సూచనలు చేశారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ పై తనకు ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రానికి ఆశాదీపంగా పేర్కొన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. ఆయన గట్టిగా కృషి చేస్తే ఈ రాష్ట్రానికి విభజన హామీలకు సంబంధించి నిధులు వచ్చే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు.
* ఆ ఇద్దరికీ కాదని
జగన్మోహన్ రెడ్డి ( Jagan Mohan Reddy)గత ఐదేళ్లలో విభజన హామీలకు సంబంధించి అనుకున్న స్థాయిలో రాణించకపోయిన విషయాన్ని గుర్తు చేశారు ఉండవెల్లి అరుణ్ కుమార్. చంద్రబాబు సైతం తనకున్న వ్యూహాలు ఉన్నాయని.. కానీ ఈ సమయంలో పవన్ కళ్యాణ్ గట్టిగా పోరాడితే కేంద్రం ఏపీ విషయంలో న్యాయం చేసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు ఉండవెల్లి. అందుకే పార్లమెంటుకు ప్రత్యేక నోటీసులు ఇచ్చి.. రాష్ట్రం తరఫున వాదనలు వినిపించాలని విజ్ఞప్తి చేశారు. అవసరమైతే తాను సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్పుకొచ్చారు. అయితే ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబుతో పాటు జగన్మోహన్ రెడ్డిని పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ పై గురిపెట్టడం మాత్రం సంచలనంగా మారుతోంది. దీని వెనుక రాజకీయ వ్యూహం ఉందన్న అనుమానాలు ఉన్నాయి.
* పరోక్షంగా జగన్ కు మద్దతు
అయితే ఉండవెల్లి అరుణ్ కుమార్( undavalli Arun Kumar)ఎప్పుడు తన విశ్లేషణలు, సమకాలీన రాజకీయ అంశాలపై మాట్లాడినప్పుడు పరోక్షంగా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తారన్న అనుమానాలు ఉన్నాయి. అదే సమయంలో చంద్రబాబుపై పరోక్ష విమర్శలు చేసేందుకు కూడా వెనుకడుగు వేయరని టిడిపి శ్రేణులు అనుమానిస్తుంటాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తో పాటు చంద్రబాబును కాదని పవన్ కళ్యాణ్ ను హైలెట్ చేయడం వెనుక.. ఏదో ఒక రాజకీయ కోణం ఉందన్నది ఒక అనుమానం. గత ఐదేళ్లలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఉండవెల్లి అరుణ్ కుమార్ మాట్లాడారు. అయితే 2014 నుంచి 2019 మధ్య టిడిపి ప్రభుత్వం పై ఘాటుగానే విమర్శలు చేసేవారు. కానీ గత ఐదేళ్లలో ఆ స్థాయి విమర్శలు ఎక్కడ కనిపించలేదన్నది టిడిపి శ్రేణుల వాదన.
* బిజెపిపై ఎగదోస్తున్నారా
అయితే ఇప్పుడు ఏకంగా భారతీయ జనతా పార్టీపై( Bhartiya Janata Party) పవన్ కళ్యాణ్ ను ఎగదోసినట్టు కనిపిస్తున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కేంద్ర పెద్దల వద్ద పవన్ కళ్యాణ్ మాట అయితే చెల్లుబాటు అవుతుంది అన్నది ఉండవల్లి అరుణ్ కుమార్ వాదన. చంద్రబాబు రాష్ట్ర పాలకుడిగా కొన్ని రకాలుగా వ్యూహాలు రూపొందిస్తారని.. కానీ కేంద్ర పెద్దల వద్ద గట్టిగా మాట్లాడలేరన్నది ఉండవెల్లి అభిప్రాయం. అయితే ఏకంగా పార్లమెంటుకు నోటీసులు ఇవ్వాలని పవన్ కళ్యాణ్ కు ఉండవెల్లి సూచించడం మాత్రం సంచలనంగా మారింది. అదే జరిగితే బిజెపి అగ్రనేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది తెలియాలి. అయితే ఇప్పటికే ఏపీ విషయంలో బిజెపి అగ్రనేతలు ఉదారంగా వ్యవహరిస్తున్నారు. సరిగ్గా ఇటువంటి సమయంలో ఏపీ నుంచి ఈ రకమైన నోటీసు మిత్రుల నుంచి వస్తే వారు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే ఉండవల్లి అరుణ్ కుమార్ చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ డిఫెన్స్ లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అన్న అనుమానాలు కలుగుతున్నాయి.