Undavalli Arunkumar :మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ రాజకీయ నాయకుడా?విశ్లేషకుడా? అంటే సడన్ గా చెప్పలేం. ఒకవైపు ఎంపీ గా ఉంటూనే మీడియా మొగల్ రామోజీరావు పై కేసు పెట్టారు. మార్గదర్శి కేసులో సుదీర్ఘకాలం పోరాడుతూ వచ్చారు.అయితే మార్గదర్శి సంస్థ నిబంధనలు పాటించడం లేదని ఆరోపిస్తూ న్యాయపోరాటం చేస్తున్నారు.అయితే రెండు దశాబ్దాలు అవుతున్నా..మార్గదర్శి మాత్రం ఆగలేదు. సేవలు అందిస్తూనే ఉంది.కొన్ని వేల చిట్ ఫండ్ ఫైనాన్స్ సంస్థలు బోర్డు తిప్పేశాయి. కానీ ఒక వైపు కేసులు ఎదుర్కొంటున్నా మార్గదర్శి ఇప్పటికీ లావాదేవీలు జరుపుతోంది. ప్రజలు కూడా ఆశ్రయిస్తున్నారు. అయితే మార్గదర్శి తప్పు చేసి ఉండొచ్చు. అయితే తాను తప్పులను ఎత్తిచూపుతానని..అది తన సహజ లక్షణమని ఉండవల్లి చెబుతున్నారు.కానీ ఆయన వ్యవహార శైలి మాత్రం మరోలా ఉంటుంది.2014 నుంచి 2019 మధ్య ఉండవల్లి ఆరోపణలు ఒకలా ఉండేవి. 2019 నుంచి 2024 మధ్య మాత్రం మరోలా కొనసాగాయి. చంద్రబాబు హయాంలో ఇరకాటం పెట్టేలా మాట్లాడేవారు. జగన్ హయాంలో తప్పులు సరిదిద్దుకోవాలన్న రీతిలో మాట్లాడేవారు. చంద్రబాబు విషయంలో ఉండవల్లిలో ఒకరకమైన వివక్ష కనిపించేది. జగన్ విషయంలో మాత్రం కాస్త ఫేవర్ కనపడేది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 75 రోజులు అవుతోంది. అప్పుడే ఆక్షేపణలు, అనుమానాలను ప్రారంభించారు ఉండవల్లి.
* తరచూ మద్యం పాలసీపై
2014 నుంచి 2019 మధ్య మద్యం పాలసీ పై తరచూ మాట్లాడేవారు ఉండవల్లి అరుణ్ కుమార్. నాటి మద్యం పాలసీని తప్పు పట్టేవారు. ఒక బీరును ప్రెస్ మీట్ లో పట్టుకొని దీని తయారీకి 30 రూపాయలు ఖర్చు అవుతుందని.. కానీ మిగతా సొమ్ము ఎవరి ఖాతాల్లోకి వెళుతుందని ప్రశ్నించారు. అప్పుడు బీరు ధర అక్షరాల 100 రూపాయల నుంచి 110 రూపాయలు ఉండేది. కానీ 2019 నుంచి 2024 మధ్య మద్యం విధానం పై ప్రశ్నించిన దాఖలాలు లేవు. కనీసం ఒక్కసారి కూడా ఆరోపణలు చేయలేదు.
* ఒక్కనాడు కూడా మాట్లాడలే
గత ఐదేళ్లలో వైసిపి మద్యం విధానం అభాసుపాలయింది. నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడారు. దేశంలో ఎక్కడ వినిపించని బ్రాండ్లు ఏపీలో దర్శనమిచ్చేవి. ధర కూడా అమాంతం పెంచేశారు. టిడిపి హయాం నాటి ధరలను పోల్చుకుంటే.. 100% పెరిగాయి. అయినా సరే ఉండవల్లి అరుణ్ కుమార్ ఏనాడూ నోరు తెరవలేదు. ఆయన చాలా లాజిక్ గా మాట్లాడేవారు. జగన్ ను ప్రశ్నిస్తూనే.. మైలేజ్ వచ్చేలా మాట్లాడేవారు. చిన్న చిన్న తప్పులను ఎత్తిచూపుతూ.. అసలైన విషయానికి వచ్చేసరికి జగన్ కు క్రెడిట్ దక్కేలా మాట్లాడేవారు.
* తాజాగా ఈవీఎంలపై
అయితే ఇప్పుడు ఈవీఎంలపై పడ్డారు. ఈవీఎంలతోనే చంద్రబాబు గెలిచారని అనుమానం వచ్చేలా మాట్లాడుతున్నారు. అసలు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేసింది చంద్రబాబు కదా అని గుర్తు చేస్తున్నారు. కానీ అదే చంద్రబాబు అభ్యంతరాలు లేవనెత్తినప్పుడు కనీసం నోరు తెరవలేదు ఉండవల్లి అరుణ్ కుమార్. కానీ ఇప్పుడు విపక్షాలు ఈవీఎంలపై అనుమానం వ్యక్తం చేస్తే చంద్రబాబు మాట్లాడాలంటున్నారు. మొదట మాట్లాడింది చంద్రబాబు కాబట్టి.. దానిని నివృత్తి చేయాలంటున్నారు. ఇక్కడ కూడా జగన్ కు వత్తాసు పలికేలా మాట్లాడుతున్నారు. అందుకే ఉండవల్లి తీరును టిడిపి శ్రేణులు తప్పు పడుతున్నాయి. ఆయన వైఖరి మార్చుకోవాలని సూచిస్తున్నాయి. మనసులో ఒకటి.. బయటకు ఒకటి మాట్లాడొద్దంటున్నాయి.