Site icon OkTelugu

Donald Trump China Visit: ట్రంప్‌ను ట్రాప్‌ చేసేందుకు డ్రాగన్‌ గూడచర్యం.. వెయిటర్‌ ఫొటోలతో గుట్టు రట్టు!

Donald Trump China Visit

Donald Trump China Visit

Donald Trump China Visit: అగ్రరాజ్యాధినేత డొనాల్డ్‌ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ను వెంటపెట్టుకుని ఇటీవల చైనా పర్యటనకు వెళ్లారు. రెండు రోజులు చైనాలో గడిపారు. చైనా కూడా ట్రంప్‌కు రెడ్‌ కార్పెట్‌తో స్వాగతం పలికింది. అయితే అనుమానాల నడుమ సాగిన ఈ పర్యటన, సమావేశాలలో అనేక ఉద్రిక్తతలు కూడా చోటుచేసుకున్నాయి. ఇరు దేశాలు అగ్రస్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఈ పరిస్థితలో ట్రంప్‌ రాకను తమకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నించింది. అమెరికా ఆధిపత్యం చెలాయించకుండా చెక్‌ పెట్టింది. అయితే ట్రంప్‌ చైనా పర్యటన సందర్భంగా జరిగిన అధికారిక విందు వేడుకలో ఎలాన్‌ మస్క్‌ వెనుక నిలబడిన ఎర్ర దుస్తుల మహిళ సాధారణ సర్వర్‌ కాదని, చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ఉన్నత అధికారి అనే ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. స్వతంత్ర బ్లాగర్‌ జెన్నిఫర్‌ జెంగ్‌ ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో బయటపెట్టడంతోపాటు, చైనా గూఢచర్య వ్యవస్థ ఎలా పని చేస్తుందనే దానిపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తారు.

ఏం జరిగింది..?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నేతృత్వంలోని బృందం చైనాలో అధికారిక సందర్శనలో భాగంగా సీసీపీ ఆతిథ్యం ఇచ్చిన గ్రాండ్‌ బ్యాంకెట్‌లో ఈ సంఘటన జరిగింది. ఎలాన్‌ మస్క్‌తో సహా అనేక అమెరికన్‌ టెక్, వ్యాపార నాయకులు హాజరయ్యారు. జెన్నిఫర్‌ జెంగ్‌ రెండు ఫొటోలను పోస్ట్‌ చేశారు.. ఒకటి ఎర్రటి వెయిటర్‌ యూనిఫామ్‌లో, మరొకటి సైనిక యూనిఫామ్‌లో ఉన్న మహిళ. ఆమెను మేజర్‌ చెంగ్‌ చెంగ్‌గా గుర్తించారు. ఆమె పీఎల్‌ఏ హానర్‌ గార్డ్‌ సెరిమోనియల్‌ బ్రిగేడ్‌లో బెటాలియన్‌ కమాండర్‌గా పని చేస్తున్నట్లు, మహిళా హానర్‌ గార్డ్‌ వ్యవస్థను రూపొందించడంలో కీలక పాత్ర పోషించినట్లు, అధికారిక చైనా సోర్సెస్‌ ప్రకారం ఆమె రికార్డు ఉంది. జెంగ్‌ మరింత ముందుకు వెళ్లి, ఆమె ఎర్ర దుస్తుల కింద ఆయుధం దాచి ఉంచి ఉండవచ్చని ఊహించారు. ఇది సాధారణ ఆతిథ్య సిబ్బంది కాకుండా, ఉన్నత స్థాయి విదేశీ అతిథుల కదలికలు, సంభాషణలపై నిఘా పెట్టడానికి ఉద్దేశపూర్వకంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు అని ఆమె వాదన.

చైనా గూఢచర్య వ్యూహాలు..
చైనా ప్రభుత్వం విదేశీ ప్రముఖులు, టెక్నాలజీ నాయకులపై రహస్య నిఘా ఉంచడం కొత్త విషయం కాదు. పశ్చిమ దేశాల నిఘా సంస్థలు ఇప్పటికే చైనా ఏజెంట్లు కార్పొరేట్, దౌత్య, టెక్‌ రంగాల్లోకి మారువేషాల్లో చొరబడుతున్నారని పదేపదే హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. జెన్నిఫర్‌ జెంగ్‌ గతంలో కూడా చైనా కమ్యూనిస్టు పార్టీపై తీవ్ర ఆరోపణలు చేశారు. 2023లో కెనడాలో హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక చైనా హస్తం ఉండవచ్చని ఆరోపణలు వచ్చాయి. కానీ ఆ నిందను భారత్‌పైకి మళ్లించడం ద్వారా పశ్చిమ దేశాలు–భారత్‌ మధ్య విభేదాలు సృష్టించాలని చైనా ప్రయత్నించిందని ఆమె అన్నారు. ఈ తాజా ఘటనలో కూడా అదే వ్యూహం కనిపిస్తోంది. దీనిపై చైనా ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. అయినప్పటికీ, ఇది చైనా యొక్క రాజకీయ–సైనిక వ్యవస్థలో ఉన్న లోతైన అనుమానాలను ప్రతిబింబిస్తుంది. విదేశీ నాయకులు, పారిశ్రామికవేత్తలు చైనాతో వ్యాపార ఒప్పందాలు చేసేటప్పుడు భద్రతా ప్రమాదాలను తక్కువ అంచనా వేయకూడదు. ముఖ్యంగా టెక్నాలజీ రంగంలోని సున్నితమైన సమాచారం సమకాలీన ప్రపంచంలో అతి విలువైనది. చైనా తన ఆర్థిక, సైనిక శక్తిని విస్తరించుకోవడంలో రహస్య వ్యూహాలను ఉపయోగిస్తుందనే అంతర్జాతీయ అనుమానాలు ఇలాంటి సంఘటనలతో మరింత బలపడుతున్నాయి.

అమెరికా వంటి దేశాలు తమ డెలిగేషన్ల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ ఘటన ఒక్కటే కాదు, చైనా–పశ్చిమ దేశాల మధ్య సమ్మతి లేని గూఢచర్య యుద్ధం యొక్క ఒక చిన్న అధ్యాయం మాత్రమే కావచ్చు. ప్రపంచ రాజకీయాల్లో నమ్మకం ఎంత ఖరీదైనదో ఈ సందర్భం మరోసారి గుర్తు చేస్తోంది.

Exit mobile version