YS Jagan : ముందుగా సోదరితో జగన్.. తరువాత కాంగ్రెస్ తో.. రాజీకి ట్రబుల్ షూటర్ ఎంట్రీ!

రాజకీయాల్లో శాశ్వత శత్రుత్వం.. శాశ్వత మిత్రత్వం ఉండదు. అవసరాలు, అవకాశాలే ప్రాతిపదికగా రాజకీయాలు నడుస్తుంటాయి. ఇప్పుడు వాటి ఆధారంగా చేసుకునే కాంగ్రెస్ పార్టీతో జగన్ రాజీకి ప్రయత్నిస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.

Written By: Dharma, Updated On : August 19, 2024 1:00 pm

YS Jagan

Follow us on

YS Jagan : కాంగ్రెస్ కు జగన్ దగ్గరవుతున్నారా? ఆ ప్రయత్నాలు బెంగళూరు నుంచి ప్రారంభమయ్యాయా? ట్రబుల్ షూటర్ ఒకరు రంగంలోకి దిగారా? ఆయనే కాంగ్రెస్ జగన్ మధ్య రాజీ చేస్తున్నారా? అటు షర్మిలను సైతం సోదరునికి దగ్గర చేసే ప్రయత్నం జరుగుతోందా? అంటే మాత్రం సూటిగా సమాధానం లేదు. కానీ అటువంటి సంకేతాలు వస్తున్నట్లు మాత్రం అనుమానాలు ఉన్నాయి. మొన్న ఆ మధ్యన జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు. ఏపీలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని ఆరోపిస్తూ ఢిల్లీ బాట పట్టారు. ఇండియా కూటమిలో ఉన్న పార్టీలన్నీ జగన్ కు మద్దతు తెలిపాయి. లోక్ సభలో సైతం ఏపీలో శాంతిభద్రతలపై ఆందోళన వ్యక్తం చేశాయి. అయితే కాంగ్రెస్ మాత్రం నేరుగా మాట్లాడలేదు. ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుమతి లేకుండా, గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా.. ఆ పార్టీలు ముందుకు వచ్చాయా? అన్నది ప్రశ్న. అయితే జరిగింది ఏదో జరిగింది. ఇకనుంచి మా పక్షానికి వచ్చెయ్.. అని కాంగ్రెస్ పార్టీ జగన్ కు కబురు పెట్టినట్లు సమాచారం. అందుకే జగన్ ఇండియా కూటమికి దగ్గర అయినట్లు తెలుస్తోంది. అయితే ఏపీలో ఉండగా జాతీయస్థాయిలో మిగతా పార్టీలతో సయోధ్య కుదరదని.. ఆ తరహా రాజకీయాలు చేయలేమని.. అందుకు బెంగళూరు అయితే సరిపోతుందని.. అందుకే జగన్ అక్కడికి మకాం మార్చినట్లు తెలుస్తోంది.

* కర్ణాటకలో పెద్దాయన
కర్ణాటక కు చెందిన ట్రబుల్ షూటర్ అప్పటికే రంగంలోకి దిగిపోయారు. ముందుగా ఫ్యామిలీ మ్యాటర్ సెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మీరు దెబ్బలాడుకోవడం వల్ల ప్రత్యర్థి కి లాభం జరుగుతుందని జగన్ తో పాటు సోదరి షర్మిలకు గుర్తు చేసినట్లు తెలుస్తోంది. ముందుగా మీరు కలిస్తే తప్ప.. బలం పెరగదు అన్న విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించినట్లు సమాచారం. ఇందుకు ఉభయులు మెత్తబడినట్లు తెలుస్తోంది. ఇంతవరకు వారిద్దరు ఎదురు పడలేదని.. ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు ఆ పెద్దాయన ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

* విలీనానికి విముఖత
అయితే కాంగ్రెస్ హై కమాండ్ నుంచి..వైసీపీ విలీన ప్రక్రియ గురించి ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. అయితే 40 శాతం ఓటు బ్యాంకు ఉన్న పార్టీని విలీనం చేయమనడం మంచి పద్ధతి కాదని జగన్ వారించినట్లు సమాచారం. అయితే అది కేవలం కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అన్న విషయం గుర్తుంచుకోవాలని. కాంగ్రెస్ పార్టీ బలోపేతం అయితే.. జాతీయస్థాయిలో పుంజుకుంటే.. వైసిపి ఓటు బ్యాంక్ టర్న్ కావడం ఖాయమని కాంగ్రెస్ నాయకత్వం వాదించినట్లు తెలుస్తోంది. ఇండియా కూటమిలో పనిచేస్తామని.. కాంగ్రెస్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని.. కానీ విలీనం చేసే ప్రసక్తి లేదని వైసీపీ నాయకత్వం తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది.

* పరిస్థితికి అనుగుణంగా నిర్ణయాలు
అయితే రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు. వచ్చే ఐదేళ్లలో జరిగే పరిణామాలకు అనుగుణంగా వైసీపీలో మార్పు రావచ్చు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ సైతం జగన్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోవచ్చు. మొత్తానికైతే బెంగళూరు వేదికగా.. ట్రబుల్ షూటర్ నేతృత్వంలో రాజీ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఇవి ఒకేసారి కాకుండా.. క్రమేపి దగ్గర అయ్యే ప్రయత్నాలు అంటూ తెలుస్తోంది. మరి మున్ముందు ఎలాంటి పరిణామాలు జరగబోతాయో చూడాలి.