Chandrababu Arrest: చంద్రబాబు కేసుల్లో సోమవారం కీలకం. సుప్రీం కోర్టు నుంచి కిందిస్థాయి కోర్టు వరకు ఇదే రోజు తీర్పులు వెలువడనున్నాయి. స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనకు రిమాండ్ విధించి దాదాపు నెలరోజులవుతోంది. స్కిల్ స్కాంలో తనపై మోపబడిన కేసులను కొట్టివేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సోమవారం ఈ పిటిషన్ విచారణకు రానుంది. అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది.
స్కిల్ స్కాం కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. దీనిపై సైతం సోమవారం తీర్పు వెలుపడే అవకాశం. మరోవైపు చంద్రబాబు కస్టడీని కోరుతూ సిఐడి ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సైతం నిర్ణయం వెలువడనుంది. ఈ రెండు పిటిషన్లపై శుక్రవారం విచారణ పూర్తయింది. న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ చేశారు.
అటు హైకోర్టులో సైతం చంద్రబాబుకు సంబంధించి మూడు కేసుల్లో సోమవారం తీర్పులు రానున్నాయి. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, ఆంగల్ల అల్లర్ల కేసు, ఫైబర్ నెట్ కేసులలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు.వీటిపై సైతం వాదనలు పూర్తయ్యాయి.కానీ తీర్పును న్యాయమూర్తి సురేష్ రెడ్డి రిజర్వ్ చేశారు. సోమవారం ఈ తీర్పులను వెల్లడించనున్నారు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంటే.. కింది కోర్టులు సైతం తీర్పులను రిజర్వులో పెడతాయి. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడి తర్వాతే.. కింది కోర్టుల సైతం తీర్పులు వెల్లడించే అవకాశం ఉంది.
అటు రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యున్నత న్యాయస్థానం వైపు ఆశగా ఎదురు చూస్తున్నాయి. క్వాష్ పిటీషన్ కు అనుకూలంగా తీర్పు రావాలని భగవంతుని ప్రార్థిస్తున్నాయి. అసలు చంద్రబాబును టచ్ చేయలేరని భావించేవారు టిడిపి శ్రేణులు. అటువంటి చంద్రబాబునే అరెస్టు చేశారు. దాదాపు 30 రోజులు పాటు రిమాండ్ ఖైదీగా ఉంచారు. అటు న్యాయస్థానాల్లో సైతం ఊరట దక్కడం లేదు. ఈ తరుణంలో సుప్రీంకోర్టులో అనుకూల తీర్పు వస్తే చంద్రబాబు ఎటువంటి కేసులు లేకుండా బయటపడతారు. అటు రాజకీయంగా సైతం మైలేజ్
వస్తుందని భావిస్తున్నారు.ఇప్పటికే జనసేనతో పొత్తు కుదరగా.. తాజాగా చంద్రబాబు అరెస్టుతో గ్రాఫ్ పెరిగిందని నమ్ముతున్నారు. చంద్రబాబు బయటకు వస్తేఏపీ రాజకీయాలు శరవేగంగా మారుతాయని భావిస్తున్నారు.అందుకే అత్యున్నత న్యాయస్థానం తీర్పు కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు.