Gudivada Amarnath Jail: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు కష్టాలు వీడడం లేదు. ఆ పార్టీ నేతలకు కేసులతో పాటు అరెస్టుల బాధ తప్పడం లేదు. మరోవైపు ఇప్పుడు మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్ కు ఏకంగా కోర్టు జైలు శిక్ష విధించింది. ఆపై జరిమానా కూడా తప్పలేదు. టిడిపి అధికారంలో ఉన్నప్పుడు విశాఖ ప్రత్యేక రైల్వే జోన్ కోసం పెద్ద ఎత్తున వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేపట్టింది. అప్పట్లో నమోదైన కేసుకు సంబంధించి ఇప్పుడు తీర్పు వచ్చింది. దీంతో గుడివాడ అమర్నాథ్ కు ఆరు నెలల జైలు శిక్షతోపాటు ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తూ విశాఖపట్నం రెండో అదనపు ప్రధాన న్యాయస్థానం సంచలన తీర్పు ప్రకటించింది. ఇప్పుడు ఇదే సంచలన వార్తగా మారింది.
* విభజన హామీగా..
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక రైల్వే జోన్ కేటాయిస్తామని విభజన హామీల్లో పేర్కొన్నారు. అందులో భాగంగా 2016 ఏప్రిల్ లో రైల్వే జోన్ కోసం ఉద్యమించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అప్పట్లో విశాఖ నగరంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అమర్నాథ్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. దీనిపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటినుంచి ఈ కేసు విచారణ కొనసాగుతూ వస్తోంది. అయితే తుది తీర్పును న్యాయమూర్తి వెల్లడించారు. ఏకంగా 6 నెలల జైలు శిక్షతోపాటు 5000 రూపాయలు జరిమానా విధించారు. రాజకీయ వర్గాల్లో ఈ తీర్పు చర్చనీయాంసంగా మారింది.
* న్యాయ పోరాటానికి సిద్ధం..
ఈ ఘటనపై స్పందించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఆరోజు తాను చేపట్టిన నిరసన కార్యక్రమం వల్లే ఈరోజు ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటయిందని గుర్తు చేశారు. న్యాయపరంగా తన పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. దిగువ న్యాయస్థానం తీర్పుపై హైకోర్టులో ఆపిల్ కు వెళ్తానని చెప్పుకొచ్చారు. గత కొద్దిరోజులుగా గుడివాడ అమర్నాథ్ పెద్దగా యాక్టివ్గా లేరు. గతం మాదిరిగా పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడం లేదు. అయితే మధ్య మధ్యలో జరిగే పరిణామాలపై స్పందిస్తూ వచ్చారు. ఇప్పుడు తన వల్లే రైల్వే జోన్ వచ్చిందని గుడివాడ అమర్నాథ్ చెబుతుండడం పొలిటికల్ సెటైర్లు పడుతున్నాయి. అప్పట్లో ఆమరణ నిరాహార దీక్షకు సంబంధించి ఆత్మహత్యాయత్నం కేసు ఆయనపై నమోదయింది. దానినే తన పోరాటంగా చెప్పుకొస్తున్నారు గుడివాడ. 2016లో అలా చేశారు కానీ.. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైల్వే జోన్ కు సంబంధించి ఒక్క ఎకరం భూమి కూడా కేటాయించకుండా కాలయాపన చేశారు. అయితే ఇప్పుడు కోర్టు శిక్ష విధించడంతో దీనిని గొప్ప పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు.
* విచిత్రపు మాటలు..
గుడివాడ అమర్నాథ్ మాటలు చాలా విచిత్రంగా కూడా ఉంటాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసే దీక్షల గురించి ఆయనకు తెలుసు. అవి ప్రజల కోసమే నని నమ్మించి.. అధికారంలోకి వచ్చాక అవే సమస్యలు గాలికి వదిలేస్తే కాలం ఎలా బుద్ధి చెబుతుందో అమర్నాథ్ కు ఈ ఘటనతో తెలిసి వచ్చింది. రైల్వే జోన్ కోసం వైసీపీ ప్రభుత్వం భూమి ఇవ్వడానికి ముందుకు రాలేదు కానీ.. కోర్టు ఇచ్చిన శిక్షణ మాత్రం తప్పించుకోలేకపోయారు. ఇప్పుడు ఏకంగా తన పోరాటం వల్ల రైల్వే జోన్ వచ్చిందని అమర్నాథ్ చెబుతుండడం మాత్రం గొప్ప కామెడీగా ఉంది.