Tirumala Laddu Ghee Case: అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిగా.. ఆనంద నిలయ వర పరిపాలకుడిగా కొనసాగుతున్నాడు తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడు. నిత్య కళ్యాణం.. పచ్చ తోరణం గా విలసిల్లుతున్న శ్రీవారి క్షేత్రంలో.. లడ్డు ప్రసాదానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది.
తిరుపతి శ్రీవారి లడ్డు కోసం గతంలో పైరవీలు కూడా సాగేవంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అటువంటి స్వామివారి లడ్డు తయారీలో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఈ కల్తీ వ్యవహారం ఇష్టానుసారంగా సాగిపోయిందని అభియోగాలు నమోదు అయ్యాయి. దీనిపై సిబిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కొంతకాలంగా విచారణ సాగిస్తోంది. ఈ నేపథ్యంలో కీలకమైన నివేదికలను ఇటీవల సిబిఐ బయట పెట్టుకుంటూ వస్తోంది. ఈ నివేదికలో తాజాగా ఒక సంచలన నిజం వెలుగులోకి వచ్చింది.
సిబిఐ ఆధ్వర్యంలోనే ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెట్టిన నివేదికలో ఒక చేదు నిజం భక్తుల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. లడ్డు తయారీకి ఉపయోగించే నెయ్యి తనిఖీ చేసే విషయంలో నాటి ప్రభుత్వ శాఖలు మొత్తం విఫలమయ్యాయని ప్రత్యేక దర్యాప్తు బృందం ఆక్షేపించింది. జీఎస్టీ, రాష్ట్ర బాయిలర్, జిల్లా ఇండస్ట్రీస్ విభాగాల సిబ్బంది సరిగా పని చేయకపోవడం వల్లే నెయ్యి కల్తీ జరిగిందని సిబిఐ ఆధ్వర్యంలో సిట్ బృందం ఆరోపించింది. డెయిరీల బాయిలర్లను.. నెయ్యి ట్యాంకర్లను తనిఖీ చేయలేదని.. అవి వచ్చే మార్గాలలో తనిఖీలు చేయలేదని సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఆగ్రహం వ్యక్తం చేసింది.
“స్వామివారి లడ్డుల తయారీ కోసం భారీగా నెయ్యిని ఉపయోగిస్తుంటారు. లడ్డూల తయారీ కోసం వచ్చే నెయ్యిని సరిగా తనిఖీ చేయలేదు. అవి వచ్చే మార్గాలలో తనిఖీ కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వంలోని అన్ని శాఖల సిబ్బంది ఈ వ్యవహారంలో విఫలమయ్యారు. తద్వారా స్వామివారి లడ్డు పవిత్రతకు భంగం కలిగించారు. ఇలా వ్యవహరించిన ప్రభుత్వ శాఖలపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని” సిబిఐ ఆధ్వర్యంలోని సిట్ బృందం ఆయా ప్రభుత్వ శాఖలకు లేఖలు రాసింది. తద్వారా లడ్డులో కల్తీ నెయ్యి వాడారు అనే అభియోగాలకు మరింత బలం చేకూరింది.