tirumala ghee tenders controversy details : ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యి టెండర్ల వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతోంది. ఈ టెండర్ల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని వైసీపీ ఆరోపిస్తుండగా టీటీడీ మాత్రం పారదర్శకత కోసమే కొత్త నిబంధనలు తెచ్చామని స్పష్టం చేస్తోంది.
ప్రధాన వివాదం: వైసీపీ ఆరోపణలు
శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఈ టెండర్లపై తీవ్ర విమర్శలు గుప్పించారు. నెయ్యి టెండర్లను హెరిటేజ్ సంస్థకు సన్నిహితంగా ఉండే ఇందాపూర్ డెయిరీకి కట్టబెట్టారని, అధిక ధరలకు ఒప్పందాలు కుదుర్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
టీటీడీ వివరణ: కొత్త సంస్కరణలు ఇవే..
ఈ ఆరోపణలను టీటీడీ చైర్మన్ బి.ఆర్. నాయుడు తీవ్రంగా ఖండించారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా కొన్ని కీలక మార్పులు చేశామని ఆయన వివరించారు. ఎంఆర్ఎల్ స్కోర్ బోర్డు తో నెయ్యి స్వచ్ఛతను అత్యున్నత ప్రమాణాలతో పరీక్షించేందుకు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చారు. గతంలో 1500 కి.మీ. దూరం నుండి నెయ్యి సేకరించేవారు. రవాణాలో నాణ్యత దెబ్బతినకుండా ఉండటానికి ఇప్పుడు ఆ పరిమితిని 800 కిలోమీటర్లకు తగ్గించారు. ఏ ఒక్క సంస్థపై ఆధారపడకుండా టెండర్లను విభజించారు. ప్రస్తుతం ఇందాపూర్ డెయిరీ (2), మదర్ డెయిరీ (2), సంగం డెయిరీ (1) సంస్థలు నెయ్యిని సరఫరా చేస్తున్నాయి.
ఇందాపూర్ డెయిరీ – హెరిటేజ్ లింక్ ఏంటి?
ఇందాపూర్ డెయిరీకి, హెరిటేజ్‌కు మధ్య యాజమాన్య సంబంధాలు లేవని టీటీడీ స్పష్టం చేసింది. “హెరిటేజ్ సంస్థ కేవలం ఇందాపూర్ నుండి చీజ్ మాత్రమే కొనుగోలు చేస్తుంది. గత వైసీపీ హయాంలో టెండర్లు పొందిన అమూల్ కూడా ఇందాపూర్ నుంచే ముడి సరుకు సేకరించింది” అని అధికారులు గుర్తు చేశారు.
నందిని నెయ్యి ఎందుకు లేదు?
కర్ణాటకకు చెందిన నందిని డెయిరీని కావాలనే పక్కన పెట్టారన్న ప్రచారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. తమకు అవసరమైన భారీ పరిమాణంలో నెయ్యిని సరఫరా చేయలేమని నందిని సంస్థే స్వయంగా తెలపడం వల్ల ఇతర సంస్థలకు అవకాశం ఇచ్చామని పేర్కొంది.
రాజకీయ రంగు
శ్రీవారి ప్రసాదం వంటి సున్నితమైన అంశం ఇప్పుడు రాజకీయ యుద్ధానికి కేంద్రబిందువుగా మారింది. వైసీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తుండా.. కూటమి ప్రభుత్వం మాత్రం నాణ్యత కోసమే ఈ మార్పులని చెబుతోంది. భక్తులు మాత్రం పవిత్రమైన లడ్డూ ప్రసాదం విషయంలో వైసీపీ పనిగట్టుకుని ఇలా తప్పుడు ప్రచారాలు చేస్తోందని మండిపడుతున్నారు.