Jagan(9)
Jagan: వైసీపీ ( YSR Congress )నుంచి పదవులు పొందిన వారు ఇప్పుడు సైలెంట్ గా ఉన్నారు. 2019 ఎన్నికల్లో 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. రెండు టర్మ్ ల్లో దాదాపు 45 మంది మంత్రులు అయ్యారు. కానీ ఇప్పుడు అందులో యాక్టివ్ గా ఉన్నది పదుల సంఖ్యలో మాత్రమే. చాలామంది సైలెంట్ అయ్యారు. మరికొందరు ప్రైవేటు వ్యవహారాలను చూసుకుంటున్నారు. ఇంకొందరు అయితే వైసీపీతో తెగతెంపులు చేసుకున్నారు. ఇటువంటి కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడిన నాయకుడు ఒకడు కనిపించడం లేదు. దీనిపైనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. జగన్ సైతం నేతల తీరుపై అసహనంతో ఉన్నారు. అప్పట్లో పదవులు అనుభవించిన వారు ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు. పార్టీ శ్రేణుల్లో సైతం ఇటువంటి నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా కొందరు మాజీ మంత్రులు కనీసం మీడియా ముందుకు వచ్చేందుకు కూడా ఇష్టపడడం లేదు.
* మంత్రులుగా 45 మంది
వైసీపీ( YSR Congress ) అధికారంలోకి వచ్చిన వెంటనే 25 మంది మంత్రులను తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. రకరకాల సమీకరణలతో పాటు సామాజిక కోణంలో చాలామందిని ఎంపిక చేశారు. ఈ క్రమంలో చాలామందికి అనుహ్యంగా పదవులు దక్కాయి. మంత్రివర్గ విస్తరణలో సైతం చాలామంది కొత్త ముఖాలకు పదవులు ఇచ్చారు జగన్. సమాజంలో ఒక హోదాను కల్పించారు. అటువంటి వారు ఇప్పుడు వైసీపీతో పాటు జగన్ కష్టాల్లో ఉంటే కనీసం పలకరించడం లేదు. 45 మంది మంత్రులుగా పదవులు పొందితే ఇప్పుడు మాట్లాడింది ఒక ఐదు, ఆరుగురు మాత్రమే. మిగతావారు రకరకాల కారణాలతో సైలెంట్ కావడం విశేషం.
* మాట్లాడుతోంది వారే
ప్రస్తుతం మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ( Botsa Satyanarayana) , అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లాంటి వారే మాట్లాడుతున్నారు. మధ్య మధ్యలో ఆర్కే రోజా ప్రకటనలకు పరిమితమవుతున్నారు. ముఖ్యంగా సీనియర్ మంత్రులుగా వ్యవహరించిన ధర్మాన ప్రసాదరావు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నేతలు పూర్తిగా సైలెంట్ గా ఉన్నారు. పోనీ డాక్టర్ సిదిరి అప్పలరాజు, జక్కంపూడి రాజా వంటి నేతలు పూర్తిగా కనిపించకుండా మానేశారు. స్టార్టింగ్ లో మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యేవారు. కానీ అతనితో పాటు కుటుంబ సభ్యులపై కేసులు నమోదయ్యేసరికి ఆయన సైతం పక్కకు వెళ్లిపోయారు.
* పక్కకు వెళ్లి పోయిన ఫైర్ బ్రాండ్లు
వైసిపి ( YSR Congress)అధికారంలో ఉన్నప్పుడు వీరవిహారం చేసేవారు కొడాలి నాని, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్. కనీసం వీరు ఎక్కడున్నారో ఇప్పుడు తెలియడం లేదు. స్టార్టింగ్ లో జోగి రమేష్ సైతం కాస్త వాయిస్ వినిపించారు. కానీ ఆయనపై సైతం కేసులు నమోదు కావడంతో టిడిపి నేతలతో చేతులు కలుపుతూ.. వేదికలు పంచుకుంటున్నారు. కొడాలి నాని ఆచూకీ లేదు. కనీసం గుడివాడ వైపు చూడడం లేదు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి రావడం లేదు. అనిల్ కుమార్ యాదవ్ గురించి చెప్పనవసరం లేదు. పక్క రాష్ట్రాల్లో ఆయన వ్యాపారాలు చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* ఆ పెద్ద తలకాయ లేవి
కనీసం వైసీపీకి అండదండగా నిలిచే పెద్ద తలకాయలు కనిపించడం లేదు. ఉత్తరాంధ్ర నుంచి బొత్స సత్యనారాయణ కనిపిస్తున్నారు. అప్పట్లో స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం( tammaneni Sitaram) సైతం సైలెంట్ అయ్యారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటూ రాజకీయ ప్రకటనలు చేసేవారు తమ్మినేని. కానీ ఇప్పుడు స్వేచ్ఛగా ప్రకటనలు చేయడానికి అవకాశం ఉన్న.. ఎందుకో ముందుకు రావడం లేదు. పోనీ ధర్మాన ప్రసాదరావు మాట్లాడతారంటే ఆయన మౌనముని అయ్యారు. చాలామంది సీనియర్లు కనీసం నోరు తెరవకపోవడంతో అధినేత జగన్ ఆవేదనతో ఉన్నారు. పార్టీ పవర్ లో ఉన్నప్పుడు అన్ని పదవులు పొందాలని.. పార్టీ అధికారం కోల్పోయేసరికి భారంగా మారిందని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నట్లు సమాచారం. మొత్తానికైతే వైసీపీలో పదవులు అనుభవించిన వారు ఇప్పుడు పార్టీని నట్టేట ముంచేసారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.