Chandrababu anguish: ఏదైనా రాజకీయ పార్టీ తన వైఫల్యాలను తెలుసుకోవడం చాలా ఉత్తమం. లేకుంటే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారుతుంది. వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress)పార్టీకి అదే ఎదురైంది. ఆల్ ఈజ్ వెల్ అన్నట్టు ఉండేది ఆ పార్టీ పరిస్థితి. పార్టీతో పాటు ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల్లో క్షేత్రస్థాయి పరిస్థితుల గురించి జగన్మోహన్ రెడ్డికి తెలిసేది కాదు. అంతవరకు వెళ్ళనిచ్చేవారు కాదు. దాని పర్యవసానాలు 2024 ఎన్నికల్లో స్పష్టంగా కనిపించాయి. వైసీపీకి ఎదురైన గుణపాఠాలు ఇప్పుడు కూటమి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఈ విషయంలో సీరియస్ గా వ్యవహరించకపోతే ఇబ్బందులు తప్పవు. ఇటీవల పార్టీ లైన్, విధివిధానాలను అధిగమించి చాలామంది మాట్లాడుతున్నారు. పార్టీకి ఇబ్బందులు తెస్తున్నారు. ముఖ్యంగా పార్టీ అధికార ప్రతినిధులు సరైన స్టడీ చేసి టీవీ డిబేట్లకు వెళ్లడం లేదు. దాని ఫలితాలు ప్రతికూలతను చూపుతున్నాయి. తాజాగా దీపక్ రెడ్డి అందుకు ఉదాహరణ. దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం నేపథ్యంలో నేషనల్ మీడియాలో డిబేట్లు కొనసాగాయి. ఈ తరుణంలో ఆర్నాబ్ గోస్వామి ఆధ్వర్యంలో రిపబ్లికన్ టీవీలో చర్చకు టిడిపి అధికార ప్రతినిధిగా దీపక్ రెడ్డి హాజరయ్యారు. ఒకానొక దశలో లోకేష్ ప్రస్తావన తీసుకొచ్చారు. దానిపై ఆర్నాబ్ విభిన్నంగా స్పందించేసరికి అక్కడితో చర్చ ముగించలేకపోయారు. అదనపు వాదనలు వినిపించి అనవసరంగా వివాదాన్ని మరింత పెద్దది చేశారు.
అనవసర వివాదం..
అయితే ఇది తెలియని టిడిపి( Telugu Desam Party) అధికార ప్రతినిధులు తొందరపడ్డారు. ఆర్నాబ్ గోస్వామి మంత్రి నారా లోకేష్ ను టార్గెట్ చేశారని భావించారు. ఉద్దేశపూర్వకంగా అలా చేశారని మండిపడ్డారు. ఆర్నాబ్ గోస్వామి కి కౌంటర్ ఇవ్వడం ప్రారంభించారు. అయితే వ్యతిరేక సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ గా ఉన్న ఈ తరుణంలో రిపబ్లిక్ టీవీని నిషేధిస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఇది రిపబ్లికన్ టీవీ యాజమాన్యం వరకు వెళ్ళింది. దీంతో ఆర్నాబ్ గోస్వామి మరో మూడు రోజుల పాటు ఇదే అంశంపై కథనాలు తెలుగుదేశం పార్టీకి డామేజ్ జరిగింది. అసలు టిడిపికి సంబంధంలేని వివాదం ఏరి కోరి తెచ్చుకున్నట్లు అయింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పౌర విమానయాన శాఖకు సంబంధించిన అంశం అది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఆ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతమాత్రాన టిడిపి బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. కానీ టీవీ డిబేట్ లో అనవసరంగా లోకేష్ పేరు తీసుకొచ్చి ఇంతటి వివాదానికి కారణం అయ్యారు.
అధికార ప్రతినిధుల పై అసహనం..
తాజాగా సీఎం చంద్రబాబు( CM Chandrababu) టిడిపి అధికార ప్రతినిధులతో సమావేశం అయ్యారట. టిడిపి అధికార ప్రతినిధుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనం వ్యక్తం చేశారు. వాస్తవానికి రిపబ్లికన్ టీవీ తెలుగుదేశం పార్టీకి అనుకూలమైనది. గతంలో టిడిపి కష్టకాలంలో ఉండగా నేషనల్ మీడియా గా ఆదుకుంది. అటువంటి రిపబ్లిక్ టీవీతో అనవసరంగా వివాదం పెట్టుకోవడం ఏమిటని చంద్రబాబు ప్రశ్నించినట్లు సమాచారం. పార్టీ విధివిధానాలు తెలుసుకోకుండా కొందరు మాట్లాడేస్తున్నారని.. ముందుగా పార్టీ లైన్ తెలుసుకొని మాట్లాడాలని సూచించారు చంద్రబాబు. ఇందుకుగాను ఇద్దరు మంత్రులను ప్రత్యేకంగా కేటాయిస్తానని కూడా చెప్పుకొచ్చారు. వారితో పార్టీ లైన్ పై ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ అందిస్తామని కూడా చంద్రబాబు అన్నారు. అయితే అది అంతగా వర్కౌట్ కాకపోవచ్చు. ఎందుకంటే మంత్రులు వారి శాఖల పరంగా ఎప్పుడు బిజీగా ఉంటారు. ప్రత్యేకంగా వారు ఈ పని చేయడం కూడా కష్టం.
అద్భుత గ్రంథాలయం..
అయితే తెలుగుదేశం పార్టీకి అద్భుతమైన అవకాశం ఉంది. ఏ పార్టీకి లేనంతగా గ్రంథాలయం వసతి ఉంది. చంద్రబాబు వ్యక్తిగత అభిరుచికి తగ్గట్టు గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. రాజకీయపరంగా ఏ అంశానికి సంబంధించిన విషయాలైన అక్కడే తెలుస్తాయి. అంతలా ఆ గ్రంథాలయాన్ని తీర్చిదిద్దారు చంద్రబాబు. మరోవైపు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఒక ప్రత్యేక కమిటీని ఉంచాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కళకళలాడే టిడిపి కార్యాలయం అధికారంలోకి వచ్చాక వెలవెలబోతోంది. దానికి కారణం సచివాలయం కేంద్రంగా టిడిపి పాలన సాగిస్తోంది. అటు చంద్రబాబుతో పాటు లోకేష్ కార్యాలయానికి అందుబాటులో ఉండడం తక్కువ. అందుకే టిడిపి నాయకులు పెద్దగా కనిపించడం లేదు. అయితే ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి పార్టీ కార్యాలయంలో అందుబాటులోకి వస్తే.. ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకొని ఇటువంటి పొరపాట్లు దొర్లకొండ ఉండే అవకాశం ఉంది.