YSRCP MP candidates: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ ఉత్తరాంధ్ర పై ఫోకస్ చేసింది. వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ సీట్లకు బలమైన అభ్యర్థులను పోటీలో పెట్టాలని చూస్తోంది. తద్వారా అసెంబ్లీ నియోజకవర్గాలను సైతం కైవసం చేసుకోవాలని భావిస్తోంది. గడిచిన ఎన్నికల్లో ఐదు పార్లమెంట్ స్థానాలకు గాను ఒకచోట మాత్రమే వైసీపీ నెగ్గింది. అయితే వైసిపి ఆవిర్భావం నుంచి కొరకరాని కొయ్యగా ఉంది శ్రీకాకుళం పార్లమెంట్ సీటు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ కేవలం అరకు పార్లమెంటు స్థానానికి పరిమితమైంది. ఎంపీగా డాక్టర్ తనూజా రాణి అక్కడ గెలుచ్చారు. అయితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఐదు పార్లమెంట్ సీట్లు దక్కించుకోవాలని గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఎవరైతే బలమైన అభ్యర్థులు అవుతారో అని ఇప్పటి నుంచే వ్యూహాలు మొదలు పెట్టింది.
* విశాఖ పార్లమెంట్ స్థానం విషయానికి వచ్చేసరికి వైసిపి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది. మొన్నటి ఎన్నికల్లో ఇక్కడ నుంచి టిడిపి అభ్యర్థిగా బరిలో దిగిన శ్రీ భరత్ విజయం సాధించారు. ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు బొత్స ఝాన్సీ లక్ష్మి. విశాఖపట్నం నియోజకవర్గానికి ఎప్పటి వరకు వైసిపి ఇన్చార్జిను ప్రకటించలేదు హై కమాండ్. అందుకే మరోసారి ఝాన్సీ లక్ష్మీ పేరు ప్రకటిస్తారని అంతా భావించారు. ఇప్పటికే విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా బొత్స సత్యనారాయణ ఉన్నారు. ఝాన్సీ లక్ష్మి విజయనగరం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. ఇంకోవైపు విశాఖ ఎంపీ అభ్యర్థిగా గుడివాడ అమర్నాథ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ప్రస్తుతం ఆయన చోడవరం వైసీపీ ఇన్చార్జిగా ఉన్నారు. మాజీ ఎంపీ ఎంవీవీఎస్ సత్యనారాయణ సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మొన్నటి ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఈ ముగ్గురిలో ఒకరికి వైసిపి సీటు దక్కడం ఖాయమని తెలుస్తోంది.
* అనకాపల్లి నుంచి మొన్నటి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా పోటీ చేసిన సీఎం రమేష్ గెలిచారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బూడి ముత్యాల నాయుడు ఓడిపోయారు. అయితే ఆయన ఎంపీ అభ్యర్థిగా ఉండేందుకు ఆసక్తి చూపడం లేదు. పైగా ఇక్కడ సీఎం రమేష్ బలమైన అభ్యర్థి. అందుకే ఈసారి కొత్త అభ్యర్థిని రంగంలోకి దించుతారని తెలుస్తోంది. ప్రధానంగా గవర సామాజిక వర్గానికి చెందిన నేతను బరిలో దించుతారని తెలుస్తోంది. ఇంకోవైపు వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తోంది. ఆమె వెలమ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.
* అరకు పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి సిట్టింగ్ ఎంపీ డాక్టర్ తనుజారాణి కి అవకాశం ఇస్తారని తెలుస్తోంది. ఆమె కాదంటే మాజీ ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి నీ రంగంలోకి దించుతారు. మరోవైపు మాజీమంత్రులు రాజన్న దొర, పాముల పుష్ప శ్రీవాణి సైతం పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే మరోసారి డాక్టర్ తనుజారాణి రంగంలోకి దించితే బాగుంటుందన్న అభిప్రాయం వైసీపీ నుంచి వ్యక్తం అవుతోంది.
* విజయనగరం పార్లమెంట్ స్థానం నుంచి ఎక్కువమంది దృష్టి ఉంది. బొత్స ఫ్యామిలీ నుంచి ఆయన మేనల్లుడు చిన్న శ్రీను రంగంలోకి దించుతారని ప్రచారం ఎప్పటినుంచో ఉంది. ప్రస్తుతం చిన్న శ్రీను విశాఖ జిల్లా భీమిలి అసెంబ్లీ నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. ఇంకోవైపు బొత్స సతీమణి ఝాన్సీ లక్ష్మి సైతం ఇక్కడి నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ సైతం పోటీకి ఆసక్తి చూపుతున్నారు. అయితే బొత్స ఫ్యామిలీకి ఈ సీటు విడిచిపెట్టే పరిస్థితి ఉంది.
* శ్రీకాకుళం పార్లమెంట్ స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొరకరాని కొయ్యగా ఉంది. 2019లో జగన్ ప్రభంజనం సమయంలో సైతం ఇక్కడ టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు కింజరాపు రామ్మోహన్ నాయుడు. 2024 ఎన్నికలతో హ్యాట్రిక్ కొట్టడంతో కేంద్రంలో కీలకమైన పౌర విమానయాన శాఖను దక్కించుకున్నారు. 2014 ఎన్నికల్లో తూర్పు కాపు సామాజిక వర్గానికి చెందిన రెడ్డి శాంతికి అవకాశం ఇచ్చారు. 2019లో కాలింగ సామాజిక వర్గానికి చెందిన దువ్వాడ శ్రీనివాస్ కు ఛాన్స్ కల్పించారు. 2024 ఎన్నికల్లో కాలింగ సామాజిక వర్గానికి చెందిన తిలక్ పోటీ చేశారు. అయితే ఇంతలా ఎంత ప్రయోగాలు చేసినా వర్కౌట్ కాలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో తమ్మినేని సీతారామును కానీ.. ధర్మాన ప్రసాదరావును గానీ రంగంలోకి దించుతారని వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.