Vijaya Sai Reddy : విజయసాయిరెడ్డి( Vijaya Sai Reddy) వైసీపీకి గుడ్ బై చెప్పడం వెనుక అనేక రకాల కారణాలు వినిపించాయి. జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డి తో నాటకం ఆడిస్తున్నారన్న అనుమానాలు ఉండేవి. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాలతోనే విజయసాయిరెడ్డి రాజీనామా చేశారని స్పష్టమైంది. జగన్మోహన్ రెడ్డి చర్యలతో విసిగి వేసారి పోయి విజయసాయి రెడ్డి రాజీనామా చేశారని తేలిపోయింది. కొద్దిరోజుల కిందట వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే . ఇకనుంచి రాజకీయాలకు దూరంగా ఉండి వ్యవసాయం చేసుకుంటానని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. అయితే ఈరోజు సిఐడి విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి సంచలన విషయాలు బయట పెట్టారు.
Also Read : అందుకే జగన్ కు విజయసాయిరెడ్డి దూరమయ్యారా?
* వై వి సుబ్బారెడ్డి తీరుతోనే..
కేవలం జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి( Subba Reddy) తీరుతోనే తాను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడినట్లు సాయి రెడ్డి స్పష్టం చేశారు. విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డితో చాలా ఏళ్లుగా సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి కుటుంబ ఆడిటర్ గా విజయసాయిరెడ్డి ఉండేవారు. క్రమేపి జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి రావడంతో ఆయనకు బలమైన మద్దతు దారుడిగా నిలిచారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీతో విభేదించి కేసులను ఎదుర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి. దీంతో జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి సైతం ఆ కేసులకు బలయ్యారు. అక్రమాస్తుల కేసుల్లో జగన్ తో పాటు నిందితుడిగా మారారు విజయసాయిరెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రూపకల్పనలో కూడా సాయి రెడ్డి క్రియాశీలక పాత్ర పోషించారు. అదే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డికి మించి కష్టపడ్డారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో నెంబర్ 2 గా కూడా ఎదిగారు.
* తగ్గిన ప్రాధాన్యం
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత వైవి సుబ్బారెడ్డి తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి( sajjala Ramakrishna Reddy ) పాత్ర పెరిగింది. క్రమేపి విజయసాయిరెడ్డి పాత్ర తగ్గుతూ వచ్చింది. ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయిరెడ్డిని తొలగించారు జగన్మోహన్ రెడ్డి. ఆయన స్థానంలో తన బాబాయ్ వై.వి.సుబ్బారెడ్డిని నియమించారు. అటు తాడేపల్లి వైయస్సార్ కేంద్ర కార్యాలయంలో సైతం విజయసాయి రెడ్డి పాత్ర పూర్తిగా తగ్గించేశారు. ఆ స్థానాన్ని భర్తీ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి. అప్పటివరకు విజయసాయిరెడ్డి వద్ద ఉన్న సోషల్ మీడియా విభాగాన్ని సజ్జల కుమారుడికి అప్పగించారు జగన్. కొద్దిరోజులపాటు విజయసాయిరెడ్డి పాత్ర లేకుండా చేశారు జగన్మోహన్ రెడ్డి. దానిపై తీవ్ర మనస్థాపానికి గురైన విజయసాయిరెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్లేందుకు కూడా సిద్ధపడినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఉన్నంతలో జగన్మోహన్ రెడ్డి పై ఉన్న అభిమానంతో సర్దుకుపోయారు.
* అడుగడుగునా నిర్లక్ష్యం
ఈ ఎన్నికలకు ముందు కీలక నేతలు గుడ్ బై చెప్పారు. అదే సమయంలో విజయసాయిరెడ్డిని నెల్లూరు పార్లమెంటు( Nellore parliament seats ) స్థానం నుంచి పోటీ చేయించారు జగన్మోహన్ రెడ్డి. అయితే ఎన్నికల్లో ఓటమి అనంతరం విజయసాయిరెడ్డి విషయంలో నిర్లక్ష్యం చేశారు. ఒకవైపు ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్ గా నియమించి.. మరోవైపు వైవి సుబ్బారెడ్డి తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి ఎనలేని ప్రాధాన్యమిచ్చారు. వై వి సుబ్బారెడ్డి కి పార్లమెంటరీ నేతగా.. సజ్జల రామకృష్ణారెడ్డికి వైయస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర కోఆర్డినేటర్ గా అవకాశం ఇచ్చి.. విజయసాయిరెడ్డిని దారుణంగా అవమానించారు. ఈ అవమానాలను భరించలేక విజయసాయిరెడ్డి బయటకు వెళ్లిపోయారు. తాజాగా కోటరీ వల్లే తాను జగన్మోహన్ రెడ్డికి దూరమయ్యానని స్పష్టం చేశారు. తన మనసులో ఉన్న మాటను బయట పెట్టారు.
Also Read : విజయసాయిరెడ్డిని వదిలేదిలే.. పల్నాడు జిల్లాలో ఫిర్యాదు.. అరెస్టుకు రంగం సిద్ధం!