AP IPS Officer: ఒకప్పుడు అధికారంలో ఏ పార్టీ ఉన్నా సరే అధికారులు తటస్థంగా ఉండేవారు. ప్రజల కోణంలోనే పని చేస్తూ ఉండేవారు. అధికార పక్షాన్ని, ప్రతిపక్షాన్ని ఒకే విధంగా చూస్తూ ఉండేవారు. అందువల్లే నాటి రోజుల్లో వ్యవస్థలు సక్రమంగా ఉండేవి. సక్రమంగా పనిచేసేవి. కానీ ఇప్పుడు అలా కాదు. అధికారంలో ఎవరు ఉంటే తమకు అనుకూలమైన అధికారులకు అందలం ఎక్కించడం పరిపాటిగా మారిపోయింది. అలా అధికారంలోకి వచ్చిన పార్టీ చెప్పినట్టుగానే అధికార యంత్రాంగం పనిచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. నచ్చిన నాయకులను నెత్తిన పెట్టుకోవడం.. నచ్చని నాయకులను తొక్కడం వంటివి నేటి కాలంలో పరిపాటిగా మారిపోయాయి. పైనుంచి కింది దాకా వ్యవస్థల్లో మొత్తం అధికార పార్టీకి అనుకూలమైన అధికారులే ఉండడంతో న్యాయం అనేది ఎండమావి అయిపోయింది. ఈ పార్టీ, ఆ పార్టీ అని తేడా లేకుండా అన్ని పార్టీలు అదేవిధంగా వ్యవహరిస్తున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక విధంగా.. అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత మరొక విధంగా పనిచేస్తున్నాయి.
ఏపీలో ఒక ఐపీఎస్ అధికారి గురించి ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతుంది. గతంలో ఆయన ఒక పార్టీకి అనుకూలమైన వ్యక్తిగా ముద్రపడ్డారు. ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించారు అనే అభియోగాలను ప్రస్తుతం ఎదుర్కొంటున్నారు. నాటి రోజుల్లో ఆయన ఒక కీలక నాయకుడిని అరెస్ట్ చేశారని.. ఆ పార్టీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని.. అప్పటి అధికారంలో ఉన్న పార్టీ పెద్దల మెప్పుకోసం ఆయన నిబంధనలు మొత్తం తుంగలో తొక్కారని ఓవర్గం మీడియా ఆరోపిస్తోంది. అంతేకాదు ఆయనకు వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తోంది.. ఈ నేపథ్యంలో ఆ అధికారిని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం టార్గెట్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగం గానే కొన్ని బృందాలు రంగంలోకి దిగి ఆయన గురించి శోధన మొదలుపెట్టాయి. సుమారు 200 అంశాలలో ఆయన గురించి ఎంక్వయిరీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒక్క లోపం దొరికినా సరే ఆయనను బొక్కలో వేయాలని ప్లాన్ చేస్తున్నాయి. మరోవైపు ఆ అధికారికి ఇంతవరకు పోస్టింగ్ ఇవ్వలేదని.. ఆయనను వెయిటింగ్ లిస్టులో పెట్టారని తెలుస్తోంది. దీనికి తోడు ఆయన కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని.. ఎక్కడ ఉన్నారో తెలియదని ఏపీ వర్గాలు అంటున్నాయి.
ఐపీఎస్ అధికారి అయిన మొదటి నుంచి కూడా కాస్త నిక్కచ్చిగానే ఉండేవారు. అయితే ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు గతంలో అధికారంలో ఉండడంతో కాస్త మెత్తబడ్డట్టు సమాచారం. పైగా సీనియర్ ఐపీఎస్ అధికారి కావడంతో అప్పట్లో ఆయనకు అనుకూలమైన పోస్టింగ్ లభించింది. సహజంగానే ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత ఐపీఎస్ అధికారుల మీద ఉంటుంది. పైగా అధికారి కూడా కీలక స్థానంలో ఉండడంతో నాటి ప్రభుత్వ పెద్దల మాటలను పాటించాల్సి వచ్చింది. ఆ ఆదేశాలకు తగ్గట్టుగానే నాడు ఆ అధికారి ఓ కీలక నాయకుడిని అరెస్ట్ చేశారు. అరెస్టుకు ప్రధాన కారణం ఈయనేనని ప్రస్తుత రూలింగ్ పార్టీ బలంగా నమ్మింది. దానికి తగ్గట్టుగానే అభియోగాలు మోపడానికి వ్యవస్థలను సిద్ధం చేసింది. కాకపోతే ఏ అంశంలో కూడా ఆ అధికారి దొరికే అవకాశం లేకపోవడంతో పోలీస్ శాఖ చూస్తూ ఉండిపోయింది. అయితే ఆ అధికారిని అలానే వదిలేస్తారా.. ఏదైనా అభియోగం మోపి కేసులో ఇరికిస్తారా అనేది తెలియాల్సి ఉంది. అయితే సదరు అధికారి మీద కొంతకాలంగా పోలీస్ శాఖ లోని కొన్ని బృందాలు తీవ్ర స్థాయిలో దృష్టి సారించాయి. ఏకంగా ఆయన సర్వీస్ కాలం నాటి అంశాలను జల్లెడ పడుతున్నాయి. అయితే ఇంతవరకు వారికి ఒక్క తప్పు కూడా దొరకపోవడం విశేషం.