Visakhapatnam Coastal Erosion Project: విశాఖకు ( Visakhapatnam) గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర ప్రభుత్వం. దసరా కానుక ప్రకటించింది. జిల్లాలో తీర ప్రాంత పరిరక్షణకు భారీ ప్రాజెక్టును మంజూరు చేసింది. ప్రకృతి వైపరీత్యాలనుంచి రక్షణ, పునర్నిర్మాణంలో భాగంగా రక్షణ గోడ నిర్మించేందుకు.. జాతీయ ప్రకృతి వైపరీత్యా నిర్వహణ నిధి నుంచి రూ.200 కోట్ల రూపాయల నిధులను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్ కింద మరో 22 కోట్లు కలిపి.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనుంది. విఎంఆర్డిఏ, జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ కలిపి ఈ ప్రాజెక్టు నిర్మాణ బాధ్యతలను చేపట్టనున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా పూర్తయింది.
* దారుణంగా దెబ్బతిన్న తీరం..
సువిశాల సముద్ర తీర ప్రాంతం విశాఖ సొంతం. అయితే అలల తాకిడికి ఏటా విశాఖ తీరం దెబ్బతింటోంది. దీనివల్ల బీచ్ రోడ్డు( Beach Road) కోతకు గురవుతోంది. పర్యాటక ప్రాంతాలు సైతం సముద్రంలో కలిసిపోతున్నాయి. అందమైన బీచ్ లు మాయమవుతున్నాయి. దీనిపై అధ్యయనం చేసిన జాతీయ తీర ప్రాంత పరిశోధనా కేంద్రం తన నివేదికలో కేంద్రానికి స్పష్టం చేసింది. 1990 నుంచి 2018 వరకు 22.4% తీరం కోతకు గురైనట్లు నివేదించింది. ఇసుక మేటలతో తీరప్రాంతం అస్తవ్యస్తంగా ఉన్నట్లు గుర్తించింది. ఇలానే కొనసాగితే బీచ్ లు పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
* ఈ నిర్మాణాలు చేపడతారు..
విశాఖ నగర పరిధిలోని ప్రధానంగా పేద వాల్తేరు( Pedda Walter ), జాలారిపేట, జాలారి ఎండాడ, శివ గణేష్ నగర్ ప్రాంతాల్లో తీరం ఎక్కువగా కొట్టుకుపోయింది. భీమిలి సమీపంలో మత్స్యకార గ్రామాల పరిస్థితి కూడా అంతే. గోకుల్ పార్క్, కురుసుర జలంతర్గామి ప్రాంతాలకు తరచు ముప్పు వస్తోంది. తీరం కోతతో పర్యావరణానికి సైతం ముప్పు వాటిల్లుతోంది. అయితే ఈ పరిస్థితులను అధ్యయనం చేసింది జాతీయ తీర ప్రాంత పరిశోధనా కేంద్రం. తీవ్ర హెచ్చరికలు జారీ చేయడంతో కేంద్రం అప్రమత్తం అయ్యింది. తీర ప్రాంత పరిరక్షణకు గాను 220 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. తీర ప్రాంతాన్ని కోత నుంచి కాపాడడానికి రక్షణ గోడలు, రిటెన్షన్ గోడలు, గ్రోయిన్లు, షెల్టర్ బెల్టులు నిర్మిస్తారు. భీమిలి, మంగమారిపేట, జాలారి ఎండాడ, శివ గణేష్ నగర్, భీమిలి బీచ్ రోడ్డు, తోట వీధి, ఆర్కే బీచ్ రోడ్డు, గోకుల్ పార్క్, రుషికొండ, చాపల ఉప్పాడ వంటి ప్రాంతాల్లో ఈ రూ.222 కోట్లతో పనులు పూర్తి చేయనున్నారు. భీమిలి వద్ద మత్స్యకార బోట్లు వచ్చే ప్రదేశంలో రక్షణ గోడలు కడతారు. మొత్తానికైతే విశాఖ నగర వాసులకు కేంద్రం నిజంగా దసరా కానుక ఇచ్చినట్టే.