YSR Congress: వైసిపి( YSR Congress ) ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారా? ఒకరిద్దరు పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారా? ఆ వార్తల్లో నిజం ఎంత? ఏపీ పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. ఎన్నికల్లో కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది వైసిపి. చాలా జిల్లాల్లో అయితే కనీసం బోణీ కొట్టలేదు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో సైతం దారుణంగా దెబ్బతింది ఆ పార్టీ. కడపలో మూడు స్థానాలతో పాటు కర్నూలులో రెండు స్థానాలకు పరిమితం అయింది. చిత్తూరు జిల్లాలో సైతం ఓ రెండు స్థానాలను దక్కించుకుంది. మిగిలిన ఉత్తరాంధ్ర, కోస్తాలో అయితే మరో ఐదు స్థానాలను గెలుచుకుంది. అటు పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కడప, రాజంపేట, తిరుపతి, అరకు సీట్లకు మాత్రమే పరిమితం అయింది. అయితే ఇలా గెలిచిన వారిలో పేరు మోసిన నాయకులంటూ ఎవరూ లేరు. పార్టీకి వీర విధేయత కలిగిన నేతలు తక్కువే. దీంతో గెలిచిన వారిలో చాలామంది బయటకు వెళ్ళిపోతారన్న టాక్ ఉంది.
* ఫిరాయింపుల ప్రభావం
2014లో తెలుగుదేశం( Telugu Desam) పార్టీ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో 23 మంది వైసిపి ఎమ్మెల్యేలు టిడిపిలోకి ఫిరాయించారు. అందులో కొందరికి చంద్రబాబు మంత్రి పదవులు కూడా ఇచ్చారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేలను లాగేసుకున్నారు అన్న విమర్శను మూటగట్టుకున్నారు. ఆ ప్రభావం 2019 ఎన్నికలపై కూడా పడింది. 2019లో జగన్మోహన్ రెడ్డి గెలిచారు. టిడిపికి చెందిన ఓ నలుగురు వైసీపీలోకి ఫిరాయించారు. వారితోనే చంద్రబాబుపై విమర్శలు చేయించారు జగన్. వల్లభనేని వంశీ మోహన్ అయితే తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. దాని ప్రభావం 2024 ఎన్నికల్లో పడింది. అందుకే ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు వస్తామంటే చంద్రబాబు చేర్చుకుంటారా? అసలు వైసీపీ ఎమ్మెల్యేల అవసరం కూటమికి ఎందుకు? అన్న ప్రశ్న వినిపిస్తోంది. అయితే ఒకరిద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనడం లేదు. వారు అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. ప్రధానంగా మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి పేరు వినిపిస్తోంది.
* టిడిపి నుంచి పొలిటికల్ ఎంట్రీ
2009లో తెలుగుదేశం పార్టీ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు బాలనాగిరెడ్డి( Bala Nagi Reddy ). అటు తరువాత రాజశేఖర్ రెడ్డి పిలుపుతో కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేశారు. 2014 ఎన్నికల్లో మంత్రాలయం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచారు. 2019 ఎన్నికల్లో సైతం గెలుపొందారు. అయితే వరుసగా హ్యాట్రిక్ విజయం సాధించిన ఆయన మంత్రి పదవి ఆశించారు. కానీ సామాజిక సమీకరణలో భాగంగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి అవకాశం ఇచ్చారు జగన్. ఐదేళ్లపాటు ఆయననే కొనసాగించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యారు బాలనాగిరెడ్డి. కానీ పార్టీని వీడలేదు. ఈ ఎన్నికల్లో సైతం వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. కూటమి ప్రభంజనంలో సైతం నిలిచారు. అయితే గెలిచిన నాటి నుంచి పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా యాక్టివ్ లేరు. కూటమి ప్రభుత్వం పై సైతం విమర్శలు చేయడం లేదు. దీంతో ఆయన పార్టీ మారేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది.
* కీలక సమావేశానికి గైర్హాజరు
కర్నూలు( Kurnool) రీజనల్ కోఆర్డినేటర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి( pedhi Reddy Ramachandra Reddy ) ఉన్నారు. ఆయన ఇటీవల కర్నూలు జిల్లా పార్టీ సమావేశాన్ని నిర్వహించారు. అయితే బాలనాగిరెడ్డి సమావేశానికి గైర్హాజరయ్యారు. ఆయన పూర్వశ్రమం తెలుగుదేశం పార్టీ. అందుకే ఆ పార్టీలో తిరిగి చేరతారని ప్రచారం నడుస్తోంది. ఇటీవల వైసిపికి కీలక నేతలు గుడ్ బై చెబుతుండడంతో.. బాల నాగిరెడ్డి సైతం పునరాలోచనలో పడ్డారని టాక్ నడుస్తోంది. అయితే ప్రస్తుతం ఆయన పెద్దగా రాజకీయాల్లో అందుబాటులో లేరు. పెద్ద ప్లాన్ తో ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మున్ముందు పరిణామాలు ఎటు దారితీస్తాయో చూడాలి.