Pawankalyan : వ్యవస్థలో సమూల మార్పుల కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చినట్టు జనసేనాని పవన్ చెబుతుంటారు. తాను అధికారం, పదవుల కోసం రాలేదని.. వ్యవస్థలో లోపాలు ఎత్తి చూపి పరిష్కార మార్గం కోసమేనంటూ చెప్పుకొస్తుంటారు. అయితే ఈ విషయంలో ఆయన నిబద్ధత, నిజాయితీని శంకించలేం. కానీ అది ఎన్నాళ్లు? ఎన్నేళ్లు? పనిచేస్తుంది. వైసీపీ ఆవిర్భవించి పుష్కర కాలం దాటుతోంది. ఎన్నో ఎత్తూ పల్లాలను చవిచూసిన ఆ పార్టీ విజయాన్ని మాత్రం అందుకోలేకపోయింది. నడిచివచ్చే లక్షలాది మంది గొంతుకులు ఉన్నా.. విజయతీరాల వైపు మాత్రం పార్టీ వెళ్లలేక చతికిలపడుతోంది.
అయితే ఈ పరిణామ క్రమంలో పవన్ చాలా వర్గాలకు దగ్గరయ్యారు. తమ ఆకాంక్షను ఆయా వర్గాలు పవన్ లో చూడడం ప్రారంభించాయి. అందుకే ఆయన ఎక్కడకు వెళ్లిన అంతులేని ప్రజాభిమానం. అయితే దానిని రాజకీయంగా మలుచుకోవడంలో పవన్ ఆశించిన పురోగతి సాధించలేకపోతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. స్వాతంత్ర భారతావనిలో రాజ్యాధికారం దక్కని మెజార్టీ సామాజికవర్గం ఒకటి పవన్ ను తమ ప్రతినిధిగా చూస్తోంది. తమ భావితరాలకు రాజ్యాధికార స్ఫూర్తిని ఇస్తోందని ఆశిస్తోంది. అయితే రాజకీయ లాభనష్టాల విషయంలో బాధితుడిగా ఉన్న పవన్ మాత్రం దానిని అందిపుచ్చుకోలేకపోతున్నారు.కుల రాజకీయాలు చేయడం ఇష్టం లేదో తెలియదు.. కానీ సరైన వ్యూహం రచించలేకపోతున్నారు.
ఓ సామాజికవర్గం బలమైన ఆకాంక్షను నెరవేర్చేందుకు అవకాశమున్నా ఎందుకో వెనక్కి తగ్గుతున్నారు. సరైన రాజకీయం చేయలేకపోతున్నారు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీతో కలిసి నడిచేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీని కలుపుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలా పార్టీల సమూహ యుద్ధంలో తనకు సీఎం సీటు కష్టమని తెలుసు. పవర్ షేరింగ్ కు ఒప్పుకోరని కూడా తెలుసు. అయినా సాహసానికి దిగడం లేదు. కేవలం బీజేపీతో కలిసి ఒక బలమైన ఆకాంక్ష ఉన్న వర్గాలను ఏకంగా చేసే చాన్స్ ఉన్నా ఆలోచించడం లేదు. ఈ ఎన్నికల వరకూ బలమైన కూటమిగా మారి.. 2029 ఎన్నికల్లో రాజ్యాధికారం వైపు అడుగులు వేసేందుకు అవకాశం ఉన్నా..ఆ దిశగా రాజకీయాలు చేయడం లేదు. అటువంటి ఆలోచన చేస్తే పవన్ తప్పకుండా సక్సెస్ అవుతారని విశ్లేషకులు సైతం బలంగా చెబుతున్నారు. కానీ గత అనుభవాల దృష్ట్యా పవన్ ఆసక్తి చూపకపోవడం విశేషం.